Indonesia Earthquake: మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:36 AM
ఈ ఏడాది ఫిబ్రవరి 26న సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మయన్మార్(Myanmar)ను వణికించిన భూకంపం(Earthquake) తాజాగా ఇండోనేషియా(Indonesia)ను కుదిపేసింది. ఇవాళ(ఆదివారం) ఉదయం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్రా దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మయన్మార్ భూకంపం గురించి టీవీలు, వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న ఇండోనేషియా వాసులు భయంతో వణికిపోతున్నారు. అక్కడి భూవిలయంలో సుమారు 1,664 మంది మృతిచెందగా.. 3,408 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో తమకూ అలాంటి పరిస్థితి ఎదురవుతుందనే భయం వీరిని పట్టుకుంది. కాగా, గతంలోనూ పలు భూకంపాలు లక్షల మంది ఇండినేషియా వాసుల ప్రాణాలు తీశాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సులవేసీ ద్వీప తీరానికి కొంత దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ సంభవించలేదు. అలాగే 2021లోనూ సులవేసీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు నేలమట్టం అయ్యి లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.
సులవేసీలో 2018లో 7.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చి ఏకంగా 2,200 మంది ప్రాణాలు బలి తీసుకుంది. అలాగే మానవ సమాజం ఎన్నటికీ మర్చిపొలేని 2004 నాటి భూకంపం ఏకంగా సునామీకి దారి తీసింది. అసీ ప్రావిన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం రాగా.. తదనంతరం సునామీ ఏర్పడి ఏకంగా 1.7 లక్షల మంది ప్రాణాలు తీసేసింది. భూ ఫలకాలు నిత్యం ఢీకొనే ప్రాంతంలో ఇండోనేషియా ఉన్న కారణంగా తరచుగా ఇక్కడ భూకంపాలు ఏర్పడుతుంటాయి. అందుకే ఈ ప్రాంతానికి శాస్త్రవేత్తలు రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టారు. అలాగే ఇక్కడ అనేక అగ్ని పర్వాతాలూ ఉండటం భూకంపాలకు మరో కారణంగా చెప్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ugadi 2025: సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..