Share News

IRCTC North East Tour Package: 7 సిస్టర్స్ అందాలను వీక్షించేందుకు IRCTC అదిరే ప్యాకేజ్.. 15 రోజుల పాటు..

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:48 PM

IRCTC Bharat Gaurav Train 2025: నీలికొండల్లో దాగున్న ఈశాన్య రాష్ట్రాల అందాలను 15 రోజుల పాటు లగ్జరీ రైళ్లో చుట్టేసే అద్భుత అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC). ఈ వేసవి సెలవుల్లో జీవితంలో మరిచిపోలేని అనుభవాలను ఆస్వాదించేందుకు ఈ టూర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోండి..

IRCTC North East Tour Package: 7 సిస్టర్స్ అందాలను వీక్షించేందుకు IRCTC అదిరే ప్యాకేజ్.. 15 రోజుల పాటు..
IRCTC Bharat Gaurav Train North East Tour 2025

IRCTC North East Tour Package: మీరెప్పుడైనా విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రాల సహజ అందాలను అన్వేషించాలని కలలు కన్నారా.. తక్కువ ఖర్చుతోనే సెవెన్ సిస్టర్స్ సౌందర్యాన్ని ఆస్వాదించాలని అనుకుంటే అందుకు ఇదే మంచి అవకాశం. ఐఆ‌ర్‌సీటీసీ 'నార్త్ ఈస్ట్ డిస్కవరీ' పేరిట లగ్జరీ రైళ్లో పర్యాటకులకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో విహారయాత్ర చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్", "దేఖో అప్నా దేశ్" కార్యక్రమాల ద్వారా స్వదేశీ పర్యాటకాభివృద్ధికి కృషి చేయడంలో భాగంగా ఈ ప్యాకేజీ ప్రవేశపెట్టింది. భారతదేశంలో తక్కువమంది సందర్శించే ఐదు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రకృతి ప్రేమికులను రారా రమ్మని ఆహ్వానిస్తున్న ఈ కొత్త టూర్ ప్యాకేజీ వివరాలు..


ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)"నార్త్ ఈస్ట్ డిస్కవరీ" టూర్ ఏప్రిల్ 22, 2025న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఎటావా, కాన్పూర్ ఇలా అనేక బోర్డింగ్ పాయింట్లలో ఆసక్తిగల ప్రయాణికులకు అందుబాటులో ఉంది.భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైళ్లో యాత్రికులు 15 రోజుల పాటు సుమారు 5800 కిలోమీటర్ల ప్రయాణంలో ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల మీదుగా చేసే రైలు యాత్ర పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.


15 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు

  • 15 రోజుల రైలు పర్యటన ఏప్రిల్ 22, 2025న ప్రారంభమవుతుంది. అస్సాంలోని గౌహతి, శివసాగర్, జోర్హాట్ కజిరంగాలను కవర్ చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్, త్రిపురలోని ఉనకోటి, ఉదయపూర్, నాగాలాండ్‌లోని దిమాపూర్, కోహిమా, మేఘాలయలోని షిల్లాంగ్, చిరపుంజి సందర్శిస్తారు.

  • గౌహతి, అస్సాం

    యాత్ర మొదటి స్టాప్ గౌహతి. అక్కడ పర్యాటకులు కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత ఉమానంద ఆలయాన్ని సందర్శించి బ్రహ్మపుత్ర నదిలో సూర్యాస్తమయ క్రూయిజ్ ఆస్వాదిస్తారు.

  • శివసాగర్, ఈటానగర్

    ఆ తర్వాత రైలు రాత్రిపూట నహర్లగున్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణం చేస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఆ తర్వాతి నగరం అస్సాం తూర్పు భాగంలో ఉన్న అహోం రాజ్యం పాత రాజధాని శివసాగర్. శివసాగర్, శివడోల్ వద్ద ఉన్న ప్రసిద్ధ శివాలయం, తలతాల్, రంగ్ ఘర్ వంటి ఇతర వారసత్వ ప్రదేశాలు ఈ యాత్రలో చూడవచ్చు.


  • కజిరంగా

    ఇంకా పర్యాటకులు జోర్హాట్‌లోని తేయాకు తోటలను సందర్శిస్తారు. కరంగ్‌లో రాత్రి బస తర్వాత కజిరంగ జాతీయ ఉద్యానవనంలో తెల్లవారుజామున అడవి సఫారీ చేస్తారు. అనంతరం రైలు త్రిపుర రాష్ట్రానికి ఫుర్కేటింగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. కుమార్‌ఘాట్ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత పర్యాటకులు 'ఈశాన్యంలోని అంగ్కోర్ వాట్' అయిన ఉనకోటి వారసత్వ ప్రదేశాన్ని, రాజధాని అగర్తలాను సందర్శిస్తారు. ఉదయపూర్‌లో ప్రసిద్ధ ఉజ్జయంత ప్యాలెస్, నీర్మహల్ ప్యాలెస్, త్రిపుర సుందరి మందిర్ ఉన్నాయి.

  • కోహిమా

    త్రిపుర తర్వాత రైలు నాగాలాండ్ రాష్ట్రాన్ని సందర్శించడానికి దిమాపూర్‌కు బయలుదేరుతుంది. బదర్‌పూర్ స్టేషన్, లుమ్డింగ్ జంక్షన్ మధ్య సుందరమైన రైలు ప్రయాణాన్ని అతిథులు తెల్లవారుజామున వారి సీట్ల నుంచి చూడవచ్చు. దిమాపూర్ స్టేషన్ నుంచి పర్యాటకులను బస్సులో కోహిమాకు తీసుకెళ్తారు. ఇక్కడ నాగ జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఖోనోమా గ్రామ పర్యటన కూడా ఉంటుంది.


  • ఈ టూరిస్ట్ రైలు తదుపరి హాల్ట్ గౌహతిలో ఉంటుంది. ఆ తరువాత పర్యాటకులను రోడ్డు మార్గంలో మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్‌కు తీసుకెళ్తారు. మార్గమధ్యలో ఉమియం సరస్సు వద్ద పిట్ స్టాప్ ఉంటుంది.

  • మరుసటి రోజు తూర్పు ఖాసీ కొండలలో ఉన్న చిరపుంజీకి విహారయాత్ర వెళ్తారు. షిల్లాంగ్ శిఖరం, ఎలిఫెంట్ జలపాతం, నవఖలికాయ్ జలపాతం, మావ్‌స్మై గుహలు ఆ రోజు సందర్శిస్తారు. చిరపుంజీ నుంచి పర్యాటకులు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కోసం రైలు ఎక్కడానికి గౌహతి స్టేషన్‌కు తిరిగి వెళతారు. యాత్రికులు ఈ మొత్తం పర్యటనలో రైలులో దాదాపు 5,800 కి.మీ. ప్రయాణం చేస్తారు.


డీలక్స్ AC టూరిస్ట్ రైలు

భారత్ గౌరవ్ డీలక్స్ఎసి టూరిస్ట్ రైలులో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఫ్లేమ్ లెస్ కిచెన్, షవర్ క్యూబికల్స్, సెన్సార్ బేస్డ్ వాష్ రూంలు, ఫుట్ మసాజర్లు, ఒక మినీ లైబ్రరీ, సీసీటీవీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ సేఫ్ లు ప్రతి కోచ్ కు ఉంటాయి. ఈ సదుపాయలు మీ యాత్రను సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి. పూర్తి ఎయిర్ కండిషన్డ్ వసతులున్న ఈ రైళ్లో AC I (సుపీరియర్), AC II (డీలక్స్), AC III (కంఫర్ట్) వంటి 3 విభాగాలున్నాయి.


  • టికెట్ ధరలు

    AC 1 (కూపే)కు ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,67,845, AC1 (క్యాబిన్)కు రూ.1,49,815, AC 2 టైర్ లో ఒక్కొక్కరికి రూ.1,29,915, AC III లో రూ.1,16,905 గా నిర్ణయించారు. టూరిస్ట్ రైళ్లో 15 రోజుల పాటు ప్రయాణించే యాత్రికులకు అందించే వసతీ, సౌకర్యాలకు కలిపి IRCTC ఈ టూర్ ప్యాకేజీ ధర ఉంటుంది.

  • మినహాయింపు

    సంబంధిత క్లాస్ లో రైలు ప్రయాణం, AC హోటళ్లలో రాత్రి బస, అన్ని భోజనాలు (శాఖాహారం మాత్రమే) అన్ని ప్రయాణఖర్చులు, బస్సుల్లో సందర్శనా స్థలాలకు వెళ్లేందుకు అయ్యే టికెట్ ఖర్చులు, ప్రయాణ బీమా, గైడ్ సేవలు మొదలైన ఖర్చులన్నీ ఈ ప్యాకేజీలోనే ఉంటాయి.


Read Also: Dark Tourism: డార్క్ టూరిజం అంటే ఏంటి.. యువతలో పెరుగుతున్న కొత్త ...

Hyderabad One Day Tour : రూ.380 ఖర్చుతోనే హైదరాబాద్ సిటీ టూర్ ...

IRCTC: తిరుపతికి చౌక టూర్ ప్యాకేజీ..పిల్లలతో సహా ఇలా ఈజీగా ...

Updated Date - Apr 15 , 2025 | 05:15 PM