Delhi CM: ఢిల్లీ సీఎంను ప్రకటించిన బీజేపీ.. అందరి అంచనాలు తారుమారు..
ABN , Publish Date - Feb 19 , 2025 | 08:02 PM
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్నో పేర్లు సీఎం రేసులో వినిపించినప్పటికీ చివరి వరకు గోప్యత పాటించిన బీజేపీ అధిష్టానం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందు ఢిల్లీ సీఎం పేరును ప్రకటించింది.

ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఫిబ్రవరి8వ తేదీన ఫలితాలు వెల్లడైనప్పటినుంచి ఢిల్లీ సీఎంగా బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. కొద్దిసేపటిక్రితం సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది. షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంగా ఎన్నుకున్నారు. రేపు రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఈ ఇద్దరు పరిశీలకులు శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని సభ్యుల ముందుంచారు. చివరిగా ఏకగ్రీవంగా రేఖా గుప్తా పేరును ఢిల్లీ సీఎంగా ఎన్నుకున్నారు.
చివరి వరకు ఉత్కంఠ..
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలై 12 రోజులు పూర్తైనా.. సీఎం ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. బీజేపీ శాసనసభపక్ష సమావేశం జరగడానికి ముందువరకు కూడా పది పేర్లు వినిపించాయి. ముందుగానే బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం ఎవరనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ ఆ పేరు బయటకు రాకుండా చివరవరకు గోప్యత పాటించింది. ఢిల్లీ సీఎం ఎంపిక కోసం నియమించిన పరిశీలకులు ఎమ్మెల్యేల సమావేశంలో అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి ఎమ్మెల్యేలంతా ఓకే చెప్పడంతో ఎలాంటి వివాదం లేకుండా ఢిల్లీ సీఎం ఎంపిక జరిగిపోయింది. ముఖ్యంగా రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, శిఖా రాయ్, పర్వేష్ సాహిబ్ సింగ్, రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్, కైలాష్ గంగ్వాల్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా పేర్లు వినిపించాయి. అనూహ్యంగా రేఖ గుప్తాను బీజేపీ ఢిల్లీ సీఎంగా ఎంపిక చేసింది.
గతంలోనూ..
బీజేపీ సీఎంల ఎంపికలో ఎప్పుడూ గోప్యత పాటిస్తూనే వచ్చింది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ సీఎంల ఎంపికలో అనూహ్యంగా కొత్తపేర్లను తెరపైకి తీసుకువచ్చింది. సామాజిక సమీకరణలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బీజేపీ ముఖ్యమంత్రులను ఎంపిక చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
Also Read:
Delhi New CM: మరోసారి బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆఖరి క్షణంలో సీఎం రేసులో ఆ రెండు పేర్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here