Arvind Kejriwal: ఉచితాలు దేవుడి ప్రసాదం... మోదీ ఇప్పుడైనా ఒప్పుకుంటారా?
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:40 PM
బీజేపీ ఇచ్చిన హామీలు 'ఆమ్ ఆద్మీ పార్టీ' నుంచి కాపీ కొట్టారని, తమ పార్టీ ఎంచుకున్న మార్గానే వాళ్లు అనుసరించేటప్పుడు ఏమాత్రం విజన్ లేని బీజేపీని ఎందుకు ఎన్నుకోవాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప్ పాత్ర-1'పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇచ్చిన హామీలు 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) నుంచి కాపీ కొట్టారని, తమ పార్టీ ఎంచుకున్న మార్గానే వాళ్లు అనుసరించేటప్పుడు ఏమాత్రం విజన్ లేని బీజేపీని ఎందుకు ఎన్నుకోవాలని ఆయన ప్రశ్నించారు.
BJP Manifesto: మహిళలకు రూ.2,500 సాయం, గ్యాస్ బండపై రూ.500 సబ్సిడీ
బీజేపీ 'సంకల్ప పాత్ర'ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం విడుదల చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలెండర్లపై రూ.500 సబ్సిడీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఢిల్లీలో (ఆప్ సర్కార్) అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
దీనిపై కేజ్రీవాల్ నిశిత విమర్శలు చేశారు. ''కేజ్రీవాల్ తరహాలోనే ఉచితాలు ఇస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈరోజు ప్రకటించారు. నేను ఒకటే అడుగుతున్నాను. ఉచితాలు మంచివి కావని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకూ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఉచిత హామీలు గుప్పించడం ద్వారా గతంలో తాము చెప్పినది తప్పని, కేజ్రీవాల్ చేసింది సరైనదేనని ఒప్పుకున్నట్టు అయింది. ఉచితాలు హానికరం కాదని, దేశానికి భగంవతుని ప్రసాదమని మోదీ చెప్పాలి'' అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని నడ్డా ఇప్పుడు చెబుతున్నారని, ఆ విషయాన్ని సంకల్ప్ పాత్రలోనూ చేర్చారని అన్నారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను మూసేస్తామని నడ్డా చెబుతుండటంపై తాను ఈరోజు ఢిల్లీ ప్రజల వద్దకు వెళ్లి, మొహల్లా క్లినిక్‌కు కావాలా, వద్దా అని అడిగానని చెప్పారు. మొహల్లా క్లినిక్‌లకు అనుకూలంగా ఉన్న వారు ఆప్‌కు ఓటు వేయాలని, వద్దనుకునే వారు బీజేపీకి ఓటు వేయాలని అన్నారు.
''నా పని మరింత మెరుగ్గా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. కేజ్రీవాల్ చేసే పనే మీరు చేస్తే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలని ప్రజలు బీజేపీని అడుగుతున్నారు'' అని ఆయన చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో క్లుప్లంగా చెప్పాలంటే, కేజ్రీవాల్ చేసిన పనిని బీజేపీ అభినందించిందని చెప్పారు. బీజేపీకి ఒక ప్లానింగ్ అంటూ ఏదీ లేదని, ఆప్ మేనిఫెస్టోపై, ఆప్ హామీలపై పోటీ చేయాలనుకుంటోందని విమర్శించారు. ఇంతకంటే దరుదృష్టం మరొకటి ఉండదన్నారు. ఎలాంటి విజన్ కానీ, ఆలోచనలు కానీ ప్లానింగ్ కానీ లేని పార్టీని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని బీజేపీపై కేజ్రీవాల్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Kumbh Mela 2025: కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి.. వివరాల కోసం కాల్ చేయండి..
Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Read Latest National News and Telugu News