Enforcement Directorate: నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా A2 రాహుల్‌గాంధీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:16 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది

చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. సామ్ పిట్రోడా,
సుమన్ దూబేపైనా అభియోగాలు
విచారణార్హమా? కాదా?.. 25న కోర్టు నిర్ణయం
ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా
ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి
విపక్షంపై రాజకీయ ప్రతీకారం: కేసీ వేణుగోపాల్
నేడు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం ఈ కేసులో రౌస్‌అవెన్యూ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు(ప్రాసిక్యూషన్ కంప్లైంట్) దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని ఏ1గా, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఏ2గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందని మండిపడ్డాయి. బుధవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. సోనియా, రాహుల్‌పై ఏదైనా కేసులో చార్జిషీట్ దాఖలవ్వడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్‌గోగ్నే.. ఈనెల 25న అభియోగపత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ చార్జిషీట్ విచారణార్హమా? కాదా? అన్నదానిపైనా ఈనెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు నోటీసులు జారీ చేసిన నాలుగు రోజుల్లోనే.. చార్జిషీట్ దాఖలు కావడం గమనార్హం..! నేషనల్ హెరాల్డ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా.. ఇందులో చెరో 38ు చొప్పున షేర్లతో సోనియా, రాహుల్ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు ఢిల్లీలోని బహదూర్‌షా జాఫర్ మార్గ్‌లోని ఐకానిక్ హెరాల్డ్‌హౌ్‌సతోపాటు.. ముంబై, లఖ్‌నవూల్లో ఆస్తులున్నాయి. నిజానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఏజేఎల్‌ను స్థాపించి, నేషనల్ హెరాల్డ్‌ను ప్రారంభించారు.
యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా, రాహుల్‌గాంధీలకు చెందినది. అయితే.. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీ రూ.50 లక్షలకు యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేశారు. ఆ ఆస్తుల వాస్తవ విలువ రూ.2 వేల కోట్లుగా ఉంటుంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి దీనిపై 2012లో పటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తొలుత ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2021లో మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)ను నమో దు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. 2022లో రాహుల్‌గాంధీ, సోనియాలకు సమన్లు జారీచేసి, విచారణను కొనసాగించింది. మంగళవారం కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో సోనియాగాంధీని ఏ1గా, రాహుల్‌గాంధీని ఏ2గా పేర్కొంది. కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా, జర్నలిస్టు సుమన్ దూబే, యంగ్ ఇండియా కంపెనీని నిందితుల జాబితాలో చేర్చింది.
విచారణకు హాజరైన వాద్రా
హరియాణాలో జరిగిన భూఒప్పందంపై మనీల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ నుంచి సమన్లు రావడంతో.. రాబర్ట్‌వాద్రా మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆయనను దాదా పు 6 గంటల పాటు విచారించి, తిరిగి బుధవారం రావాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వాద్రా మద్దతుదారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ విచారణకు ముందు వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. 2008 భూలావాదేవీకి సంబంధించి ఎలాంటి అక్రమాలు లేవన్నారు.
నేడు దేశవ్యాప్త ఆందోళనలు
కేంద్రంలోని బీజేపీ.. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రతీకారానికి దిగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాంరమేశ్ సహా.. పలువురు మంగళవారం ఎక్స్‌లో స్పందించగా.. బుధవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనను విడుదల చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేయడాన్ని భారత జాతీయ కాంగ్రె్‌స(ఐఎన్‌సీ) ముక్తకంఠంతో ఖండిస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు చెందిన ఆస్తులను ఏకపక్షంగా, అన్యాయంగా సీజ్ చేయడాన్ని ఖండించారు. ‘‘ఇది(తాము లేవనెత్తుతున్న అంశం) న్యాయ విధానానికి సంబంధించిన అంశం కాదు. ఈ చర్య చట్టబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా)ను ముసుగుగా ధరించి, చేస్తున్న ప్రభుత్వ-ప్రాయోజిత నేరం. సోనియా, రాహుల్, ఇతర అగ్రనేతలపై చార్జిషీట్ దాఖలు చేయడం అనేది ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయడమే’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చర్య.. ప్రజాస్వామ్యబద్ధమైన విపక్ష పార్టీపై దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని ఆయన అన్ని పీసీసీలను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.