Maha Kumba Mela 2025 : మీరు కుంభమేళాకు వెళ్తుంటే.. ఈ 10 విషయాలు తెలుసుకోండి.. ఏ సమస్యా రాదు..
ABN , Publish Date - Jan 24 , 2025 | 05:39 PM
మీరు మహాకుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నట్లయితే ఈ 10 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి. ఎటువంటి సమస్యా రాదు..

ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళాలో ఈ రోజు 12వ రోజు. ఇప్పటివరకూ దాదాపు 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. సాధారణంగా కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇలాంటి సమయంలో గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. కానీ, ఈ సారి జరుగుతున్న మహాకుంభమేళా అత్యంత ప్రత్యేకమైనది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రయాగ్‌రాజ్‌లో రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితిలో, మీరు కూడా మహాకుంభానికి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యా రాదు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. షాహీ స్నాన్ సమయంలో పుణ్యస్నానం చేస్తే మరీ మంచిదని భక్తుల నమ్మకం. 6 షాపీ స్నాన్‌లో 2 ఇప్పటికే పూర్తి కాగా, తర్వాతది జనవరి 29న మౌని అమావాస్య రోజున రాజ స్నానం జరుగుతుంది. దీని తరువాత, రాజ స్నానం ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26న జరుగుతాయి. ఆ లోగా త్రివేణి సంగమానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లయితే ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది.
మహాకుంభమేళాకు వెళ్లే ముందు ఈ 10 విషయాలు తెలుసుకోండి..
మహాకుంభమేళా సందర్శించేందుకు ఇదే ఉత్తమ సమయం : షాహి స్నాన్ రోజున పవిత్రస్నానం చేస్తే శుభసూచకమని భక్తుల విశ్వాసం. అయితే, ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
రాజ స్నానం రోజున సాధువులు, ఋషులు స్నానం చేసిన తర్వాత మాత్రమే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించడం మంచిది.
మీరు మహాకుంభ సమయంలో టెంట్ సిటీలో ఉండాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోండి. బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఎంచుకోండి, ఎందుకంటే బుకింగ్ పేరుతో చాలా మంది మోసానికి గురవుతున్నారు. UP టూరిజం వెబ్‌సైట్ నుంచి మాత్రమే టెంట్‌లను బుక్ చేయండి. https://upstdc.co.in/Web/kumbh2025
షాహీ స్నాన్ రోజున మీరు సాధారణ రోజు కంటే ఎక్కువ నడవాల్సి ఉంటుంది. ఇది 10-15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లండి. వీలైనంత తక్కువ సామాను తక్కువగా వెంట ఉంచుకోండి.
మహాకుంభంలో స్నానం చేయడానికి ఎల్లప్పుడూ నిర్దేశించిన ఘాట్‌లకే వెళ్లండి. పిల్లలు, వృద్ధుల కోసం గుర్తింపు బ్యాండ్లు లేదా ID కార్డులను తీసుకుని వాటిని ధరించేలా చేయండి.
మీ గుర్తింపు కార్డు, హోటల్ లేదా లాడ్జ్ పేరు ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో బుకింగ్‌కు సంబంధించిన వివరాలను తీసుకెళ్లండి. మందులు, ఆహార పదార్థాలను కూడా ఉంచండి.
కుంభమేళా సమయంలో మీ వాళ్లు ఎవరైనా విడిపోతే "ఖోయా-పాయా" కేంద్రాన్ని సంప్రదించండి. మీరు హెల్ప్‌లైన్ నంబర్ 1920కి కాల్ చేయడం ద్వారా కూడా సహాయం పొందవచ్చు.
పుణ్య స్నానం పూర్తయ్యాక సమీపంలోని హనుమాన్ జీ, వేణి మాధవ్ ఆలయం, అక్షయవత్ ఆలయం, మంకమేశ్వర్ ఆలయం, అలోపి మాత ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
స్నానం చేసేటప్పుడు సబ్బు, షాంపూ లేదా డిటర్జెంట్ ఉపయోగించవద్దు. ఇవి నది స్వచ్ఛతను ప్రభావితం చేస్తాయి.
ఇప్పుడు మహాకుంభమేళాలో జనవరి 29న మౌని అమావాస్య రోజున రాజ స్నానం జరుగుతుంది. దీని తరువాత రాజ స్నానం ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 న జరుగుతుంది.