Domestic Tragedy: తమ్ముడి దొంగతనానికి అక్క బలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:18 AM
కర్నాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా, హనూరు తాలూకా కాడుగోళ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటన, ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. సుశీల అనే మహిళ తన ఇంటికి వచ్చిన తమ్ముడు మాదేవ్ నుంచి, ఆమె భర్త మహేశ్ దాచుకున్న మొబైల్ ఫోన్ మరియు నగదు దొంగిలించుకున్నాడు.

సోదరి ఇంటికి వచ్చి బావ సెల్‌ఫోన్, నగదు చోరీ
ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త
అవమానంతో ఇద్దరు పిల్లలతో సహా భార్య ఆత్మహత్య
బెంగళూరు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): అక్క ఇంటికి వచ్చిన తమ్ముడు.. బావ దాచుకున్న నగదు, సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించాడు. ఆగ్రహించిన బావ.. బావమరిదికి ఫోన్ చేసి మందలించాడు. భార్యపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా హనూరు తాలూకా కాడుగోళ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు, కాడుగోళ గ్రామంలో ఉంటున్న సుశీల ఇంటికి తమ్ముడు మాదేవ వెళ్లాడు. కాసేపటి తరువాత తన బావ మహేశ్‌కు చెందిన మొబైల్ ఫోన్, నగదు తీసుకుని వెళ్లిపోయాడు.
ఈ విషయమై మహేశ్ తన బావమరిదికి ఫోన్ చేసి ‘ఇంటికొచ్చి ఇలాంటి పనులు చేస్తారా..? కష్టపడి సొమ్ము దాచుకున్నాం. వెంటనే వచ్చి తిరిగి ఇచ్చెయ్’ అని తీవ్రస్థాయిలో మందలించాడు. ఈ క్రమంలో బావబావమరుదుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మహేశ్, తన భార్య సుశీలతోనూ గొడవపడ్డాడు. ‘మీ తమ్ముడు ఇలాంటి పనులు చేస్తాడా..?’ అని దూషించాడు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేని సుశీల, ఆదివారం రాత్రి ఇంటి నుంచి పిల్లలతో కలిసి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లి ఉంటుందని మహేశ్ భావించాడు. కానీ సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని ఓ బావి వద్ద సుశీల చెప్పులు, తాళిబొట్టు, ఇతర వస్తువులను గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహదేశ్వర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించి సుశీల (30), పిల్లలు దివ్య (11), చంద్రు(8) మృతదేహాలను వెలికి తీశారు.