Share News

ప్రకృతిలో మమేకమై...

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:20 AM

సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్లి ఆర్డర్‌ చేసిన తర్వాత... రుచి నచ్చకపోతే ఆహార పదార్థాలు వదిలేస్తాం. కానీ కూర్గ్‌లో ఉన్న ‘ది ఇబనీ వెల్‌నెస్‌ సెంటర్‌లో అలా వదిలేస్తే...

ప్రకృతిలో మమేకమై...

సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్లి ఆర్డర్‌ చేసిన తర్వాత... రుచి నచ్చకపోతే ఆహార పదార్థాలు వదిలేస్తాం. కానీ కూర్గ్‌లో ఉన్న ‘ది ఇబనీ వెల్‌నెస్‌ సెంటర్‌లో అలా వదిలేస్తే ప్రతి పదిగ్రాములకు వంద రూపాయల జరిమానా కట్టించుకుంటారు.

కేవలం ఆహారమే కాదు.. ప్రకృతికి ఇబ్బందికి కలిగించే ఏ చిన్న పనిని చేయరు. పక్షులకు ఇబ్బంది అవుతుందని ఈ రిసార్ట్‌లో సెల్‌ఫోన్‌ టవర్స్‌ కూడా వేయలేదు.


ఇలా పూర్తిగా ప్రకృతితో మమేకమైపోయిన ఈ రిసార్టు ఎండీ డాక్టర్‌ షెర్రిని ‘నవ్య’ పలకరించినప్పుడు అనేక విశేషాలు చెప్పుకొచ్చారు. వాణిజ్యపరమైన ప్రాధాన్యత లేకుండా రిసార్టును, వెల్‌నెస్‌ సెంటర్‌ను నడపటం సాధ్యమా? ‘ది ఇబనీ’ని ఎందుకు ప్రారంభించారు?

కూర్గ్‌ కాఫీ తోటలకు ప్రసిద్ధి. అయితే ఈ ప్రాంతంలో ‘కొడగు’ అనే తెగల వారు నివనిస్తూ ఉంటారు. వీరు ఇప్పటికీ ప్రకృతిని దేవతగా కొలుస్తారు. ప్రకృతికి విరుద్ధమైన ఏ పనిని చేయరు. కొడుగు భాషలో ‘ఇబనీ’ అంటే మంచు బిందువు అని అర్ధం. మంచు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మేము అనుసరించే విధానాలు అలాగే ఉంటాయి. మా దగ్గర ఉన్న అన్ని భవంతులకు కొడగు భాషలోని పేర్లే పెట్టాం. 2002లో మా నాన్నగారు 125 ఎకరాల ఈ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. దానిలో మేము మాత్రమే నివసించేవాళ్లం. దీనిని అందరితోను ఎందుకు పంచుకోకూడదనే ఆలోచన వచ్చింది. అప్పుడు కొన్ని కాటేజీల మాదిరిగా రూమ్స్‌ కట్టించాం. 125 ఎకరాలలో 47 కాటేజీలు ఉంటాయి. అంటే ప్రతి కాటేజీకి సుమారు మూడు ఎకరాల కాఫీ తోటలు..అడవీ ప్రాంతం వస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప కాటేజీ ఉందనే విషయం కూడా ఎవరికి తెలియదు. మేము దీనిని నిర్మించిన సమయంలో ఒక్క పెద్ద చెట్టును కూడా కొట్టలేదు.


రిసార్టు చిన్నగా ఉంటే ఎక్కువ లాభాలు ఉండవు కదా...

మేము ఈ ప్రాజెక్టు ద్వారా డబ్బులు సంపాదించాలనుకోవటం లేదు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషిని చేయాలనుకుంటున్నాం. దానితో పాటుగా పర్యాటకులకు స్వచ్ఛమైన ప్రకృతి అనుభూతిని అందించాలనేదే మా ఉద్దేశం. పర్యాటకులకు ఉదయానే వినిపించే పక్షుల పాటలు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. గడియారాల అవసరం లేకుండా సూర్యుడి గమనం ద్వారా సమయం ఎంత అయిందో చెప్పే నైపుణ్యత రావాలి. ప్రశాంతమైన ప్రకృతిలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు చురుకుగా పనిచేస్తాయి. అప్పుడు మనలో కలిగే భావనలు వేరుగా ఉంటాయి. అంతే కాకుండా అతిథులకు మా వద్ద ఉన్న వందల రకాల చెట్ల జాతులు గురించి అవగాహన కలగాలి. అదే మా లక్ష్యం. దీని వెనక ఎలాంటి లాభాపేక్ష లేదు.


ఇంత స్వచ్ఛంగా నిర్వహించాలనుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?

రకరకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి మేము పాఠాలు.. గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఉదాహరణకు మేము ఏ పదార్థంలోను పంచదార వాడం. కాఫీ..టీ.. డిజర్ట్స్‌ అన్నింటిలోను బెల్లమే వాడతాం. ఇక మా దగ్గర ఆహారాన్ని వృద్ధా చేయనివ్వం. ఎవరైనా అతిధులు ఆహారాన్ని వృద్ధా చేస్తే - పది గ్రాములకు వంద రూపాయలు చెల్లించమంటాం. ఈ విషయం ముందే చెబుతాం. ఇలా జమ అయిన మొత్తానికి మరి కొంత కలిపి ఏడాదికి ఒక సారి స్వచ్ఛంద సంస్థలకు అందిస్తాం. అంతే కాదు. మా దగ్గర బుఫేలో కూడా ఒక సారి వంటలు వండం. అతిధుల సంఖ్య ఆధారంగా విడతల విడతల వారిగా ఆహారాన్ని వండుతాం. దీని వల్ల వృద్ధా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విషయాలు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ మా పద్ధతిలో పర్యావరణానికి, సమాజానికి మేలు చేసేవారు మా దగ్గరకు వస్తారు. కొందరు రాకపోవచ్చు. దీనికి కూడా మేము సిద్ధపడే ఉన్నాం. అంతే కాకుండా మేము పూర్తి పర్యావరణహితమైన పద్ధతులను అనుసరిస్తాం. మా దగ్గర ఎక్కడ ప్లాస్టిక్‌ కనిపించదు భవంతులు నిర్మించే సమయంలో ఒక్క చెట్టును కూడా కొట్టివేయలేదు. అంత దాకా ఎందుకు.. మా రిసార్ట్‌లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అంతంత మాత్రమే! సెల్‌ఫోన్‌ టవర్స్‌ పెడతామని అనేక మంది ముందుకు వచ్చారు. కానీ మేము అంగీకరించలేదు. ఎందుకంటే- మా దగ్గర సుమారు 75 రకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఏడాదికి ఒక సారి వచ్చే వలస పక్షులు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్‌ టవర్స్‌ వెలువరించే తరంగాల వల్ల పిచుకలు వంటి అనేక పక్షులు చనిపోతాయి. అందువల్ల టవర్స్‌ను పెట్టడానికి అంగీకరించలేదు. దాంతో మా దగ్గరకు వచ్చే పర్యాటకులు వైఫీ మీద ఆధారపడాల్సి ఉంటుంది.


ఆతిధ్యరంగంలో ఉన్నత స్థానాల్లో తక్కువ మంది మహిళలు ఉంటారు. మీ అనుభవాలేమిటి?

నాకు ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను ఎప్పుడూ పురుషుల కన్నా తక్కువ అని అనుకోలేదు. అలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ రావు. నా ఉద్దేశంలో పని బాగా చేయటం.. చేయలేకపోవటం అని మాత్రమే ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఎవరు బాగా పనిచేస్తే వారికి ఉద్యోగం ఇవ్వాలి తప్ప- స్త్రీలనే వివక్ష ఉండకూడదనేది నా అభిప్రాయం.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఒక వైపు వ్యాపారం... మరో వైపు ఇల్లు...

వీటి మధ్య బ్యాలెన్స్‌ ఎలా?

ఇల్లు... వ్యాపారం... ఈ రెండే తప్ప నాకు వేరే వ్యాపకాలు ఏమి లేవు. కొన్ని సార్లు ఈ రెండూ కలిసిపోతూ ఉంటాయి. బోర్డు రూమ్‌లో కూర్చుని ఇంట్లో పిల్లల కోసం పిజ్జాలు ఆర్డర్‌ చేసిన సందర్భాలున్నాయి. ఇదే విధంగా ఇంట్లో పిల్లలు- ‘‘బోర్డు రూమ్‌లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు..’’ అని ఫిర్యాదు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నా ఉద్దేశంలో మన ప్రాధమ్యాలు స్పష్టంగా తెలిస్తే...

వ్యాపారాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయటంలో సమస్యలు ఉంటాయని అనుకోవటం లేదు.

ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:20 AM