Vishwashanthi Legacy: మాది విశ్వశాంతి పథం
ABN , Publish Date - Apr 13 , 2025 | 02:10 AM
గ్రామీణ ప్రాంతం నుంచి విద్యా మార్గంలో అశేష కృషి చేసి ‘శ్రీ విశ్వశాంతి’ విద్యాసంస్థను స్థాపించిన మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. 50 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న ఆయన ప్రయాణం గొప్ప ప్రేరణ

సంకల్పం
మొదట అనుకున్నది డాక్టర్ కావాలని.
కాలేజీలో నాటకాలు వేశాక మనసు నటన వైపు మళ్లింది.
ఆ రెండూ నెరవేరలేదు కానీ... విద్యావేత్తగా ఆయన మరో
ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
ప్రపంచ శాంతి స్ఫూర్తితో... రేపటి తరాన్ని ఉన్నతంగా నిలపాలన్న లక్ష్యంతో...
‘శ్రీ విశ్వశాంతి’కి శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా... దేశవ్యాప్తంగా
వేలమంది విద్యార్థులను విశ్వ విజేతలుగా తీర్చిదిద్దుతున్నారు.
‘శ్రీ విశ్వశాంతి’ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా... విద్యా శిఖరం...
ఆ సంస్థల చైర్మన్... మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావును ‘నవ్య’ పలుకరించింది.
‘‘కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట మా స్వగ్రామం. మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న శేషగిరిరావు, అమ్మ కమలా మనోహరి. కుటుంబంలో నేను మూడోవాడిని. నాన్న మాకు ఉన్న రెండెకరాల పొలాన్ని సాగు చేసేవారు. కుటుంబ పోషణకు దాని మీద వచ్చే సంపాదన సరిపోకపోవడంతో వల్లభనేని లక్ష్మీనారాయణ అనే భూస్వామి దగ్గర నౌకరీకి వెళ్లేవారు. దీనికి నెలకు రెండు బస్తాల ధాన్యం ఇచ్చేవారు. అమ్మ ఈ ధాన్యాన్ని... మిల్లు పట్టించి, కుటుంబానికి సరిపడా బియ్యం ఉంచుకుని, మిగిలింది అమ్మేది. నా పాఠశాల విద్యాభ్యాసం అద్దాడలోని అమ్మమ్మ ఇంటి వద్ద సాగింది. అక్కడ తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నా. అప్పట్లో ట్యూషన్ చెప్పినందుకు నెలకు మూడు రూపాయల ఫీజు తీసుకునేవారు. ఆ డబ్బులు చెల్లించే స్తోమత కూడా మాకు లేదు. అమ్మమ్మ, తాతయ్య... ట్యూషన్ మాస్టారు వద్దకు వెళ్లి ఆ ఫీజు ఇచ్చుకోలేమని చెప్పడంతో ఆయన నాకు ఉచితంగా పాఠాలు బోధించారు. తర్వాత ఎస్‌ఎ్‌సఎల్‌సీని ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్‌లో పూర్తి చేశాను.
కొడుకుతో డిగ్రీ తరగతులకు...
జమ్మిగొలివేపల్లి... ఉయ్యూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామం. అక్కడి నుంచి స్కూల్‌కు వచ్చే ప్రమీలరాణి నా జీవిత భాగస్వామి అవుతుందని అనుకోలేదు. ఐదో తరగతిలో తనతో పరిచయం ఏర్పడింది. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో పీయూసీలో సీటు రావడంతో విజయవాడకు వచ్చేశాను. గుణదలలో అక్క ఇంట్లో ఉంటూ పీయూసీ పూర్తి చేశాను. సీటు ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో వచ్చినా చదువంతా ఆంధ్రా లయోలా కాలేజీ లెక్చరర్ల వద్ద సాగింది. ప్రమీలకు స్టెల్లా కాలేజీలో బీఏ సీటు రావడంతో తను కూడా విజయవాడకు వచ్చింది. హాస్టల్‌లో ఉంటూ నా యోగక్షేమాలను తెలుసుకోవడానికి ఉత్తరాలు రాసేది. ఆదివారాల్లో హాస్టల్‌కు వెళ్లి ప్రమీలతో మాట్లాడేవాడిని. తర్వాత ఇద్దరం కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పట్లో మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో కో-ఎడ్యుకేషన్ ఉండేది. ఇద్దరం కలిసి హిందూ కాలేజీలో చేరాం. అక్కడ ఒక గది అద్దెకు తీసుకున్నాం. అద్దె నెలకు రూ.25. ప్రమీలతో పరిచయం ఏర్పడిన పదకొండేళ్లకు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో ప్రేమ పెళ్లంటే గ్రామాల్లో చాలా విచిత్రంగా చూసేవాళ్లు. ప్రమీల కుటుంబానికి, మా కుటుంబానికి పరిచయం ఉండడంతో ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పాం. ఇద్దరిదీ ఒకే కులం కావడం మాకు కలిసివచ్చింది. డిగ్రీ రెండో సంవత్సరంలో మాకు ఒక బాబు పుట్టాడు. తోటివాళ్లంతా పుస్తకాలతో క్లాస్‌లకు వస్తే... మేం మాత్రం మా బాబుతో వెళ్లేవాళ్లం.
డిగ్రీలోనే స్కూల్ ఆలోచన...
డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నాకు, ప్రమీలకు ఒక స్కూలు పెడదామన్న ఆలోచన వచ్చింది. విజయవాడలో ప్రైవేటు స్కూళ్లను పరిశీలించాం. అప్పుడే మిషనరీ స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. గుడివాడలో మాకు పరిచయం ఉన్న శ్రీమన్నారాయణ... ‘విశ్వభారతి’ స్కూల్‌ను ప్రారంభించారు. ఉద్యోగం కోసం ముందుగా ఆయన దగ్గరకు వెళ్లాను. పరిచయస్తులకు వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం ఇష్టంలేని ఆయన ఖాళీలు లేవని చెప్పారు. రాయలసీమకు చెందిన శ్రీరాములు... కైకలూరుకు సమీపాన కోరుకల్లు గ్రామంలో స్కూలు ఏర్పాటు చేశారు. బతుకుదెరువు కోసం మేమిద్దరం అక్కడ టీచర్లుగా చేరాం. నెలకు ఒక్కొక్కరికి రూ.125 జీతం. మూడు నెలలు పని చేసిన తర్వాత సంక్రాంతి సెలవులకు నేను, ప్రమీల సొంతూరు వెళ్లాం. మా ఊళ్లో స్కూలు పెట్టాలని రెండు, మూడు స్థలాలు చూశాం. మా రెండో అబ్బాయికి జలుబు చేస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. మేం పెట్టాలనుకున్న స్కూలు గురించి డాక్టర్ దంపతులు అడిగారు. వారి ఇద్దరు పిల్లలకూ ట్యూషన్ చెప్పమని కోరారు. అక్కడి నుంచి మా స్కూలు ప్రయాణం మొదలైంది.
ఆరుగురు విద్యార్థులతో...
1975 ఫిబ్రవరి 22న ఆరుగురు విద్యార్థులతో ‘విశ్వశాంతి’ స్కూలు ప్రారంభమైంది. మొదటి సంవత్సరం 16 మంది విద్యార్థులు ఉండేవారు. మరుసటి ఏడాది ఆ సంఖ్య 136కి చేరింది. విద్యార్థులకు నేను, ప్రమీల పాఠాలు చెప్పేవాళ్లం. మరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు టీచర్లుగా ఉండేవారు. 1988 నుంచి ఎమ్మెల్యేల పిల్లలూ ‘విశ్వశాంతి’లో అడ్మిషన్లు తీసుకోవడం మొదలైంది. ఇప్పుడు 80 ఎకరాల విస్తీర్ణంలో ‘శ్రీ విశ్వశాంతి’ నడుస్తోంది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 6,300 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 700 మంది మా దగ్గర అడ్మిషన్లు తీసుకున్నారు. విదేశాల్లో స్థిరపడినవారి పిల్లలూ విశ్వశాంతిలో ఉన్నారు. డాక్టర్ కావాలన్నది నా మొదటి లక్ష్యం. కాలేజీలో చదువుతున్నప్పుడు రంగస్థలంపై నాటకాలు వేయడంతో నటుడు కావాలన్న లక్ష్యం పుట్టింది. ఈ రెండు లక్ష్యాలూ నెరవేర్చుకోలేపోయాను.
విశ్వశాంతి కోసమే...
నాకు పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన పుస్తకాలు బాగా చదివేవాడిని. ఆ సమయంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్ధాలు జరిగేవి. వాటితో కలిగిన హింస కలచివేసింది. మా అన్నయ్య కృష్ణమూర్తి ఆర్మీలో పని చేసేవాడు. ఈ యుద్ధాలు జరిగే సమయంలో మా కుటుంబమంతా చాలా ఆందోళనగా ఉండేది. ‘చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది కదా’ అన్న భావన నాలో ఉండేది. అందుకే మా స్కూలుకు ‘విశ్వశాంతి’ పేరు పెట్టాం. సిద్ధాంతి సూచనలతో ముందు శ్రీ చేర్చాం. ఇక అప్పటి నుంచి ‘శ్రీ విశ్వశాంతి’గా స్థిరపడిపోయింది. నేను ఇప్పటికీ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల మధ్యే గడుపుతాను. 50 ఏళ్ల ‘శ్రీ విశ్వశాంతి’ ప్రయాణంలో దేశానికి ఉత్తమ విద్యార్థులను అందించానన్న సంతృప్తి నాకు ఎప్పటికీ ఉంటుంది.
ఆరోగ్యమూ ముఖ్యమే...
విద్యార్థులకు చదువు ఒక్కటే సరిపోదని, అందుకు తగిన వాతావరణం కూడా కల్పించాలనేది ‘విశ్వశాంతి గ్రామీణ యూనివర్సిటీ’ సంకల్పం. దానికి అనుగుణంగానే ప్రాంగణమంతా పచ్చని మొక్కలు పెంచాం. అంతేకాదు... విద్యార్థుల ఆరోగ్యం కోసం సొంతంగా ఒక డెయిరీని ఏర్పాటు చేశాం. అత్యున్నత ప్రమాణాల్లో నిర్వహిస్తునందుకు దీనికి ‘బెస్ట్ డెయిరీ ఫారమ్ ఆఫ్ ఏపీ అవార్డు’ కూడా దక్కింది.
ఆమె ఆకాంక్షలకు అనుగుణంగా...
ఆర్థిక భారం తగ్గించి గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించాలనేది ప్రమీల ఆకాంక్ష. ఆమె కోరిక మేరకు ఏటా మూడొందల మందికి పైగా విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నాం. దీంతోపాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా అబ్బాయిలు, కోడళ్లు కూడా ‘శ్రీ విశ్వశాంతి’ విద్యా ప్రగతిలో భాగస్వాములయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యావంతులైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది.’’
"అప్పట్లో మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో కోఎడ్యుకేషన్ ఉండేది. ఇద్దరం కలిసి హిందూ కాలేజీలో చేరాం. అక్కడ ఒక గది అద్దెకు తీసుకున్నాం. అద్దె నెలకు రూ.25. ప్రమీలతో పరిచయం ఏర్పడిన పదకొండేళ్లకు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో ప్రేమ పెళ్లంటే గ్రామాల్లో చాలా విచిత్రంగా చూసేవాళ్లు."
1975 ఫిబ్రవరి 22న ఆరుగురు విద్యార్థులతో ‘విశ్వశాంతి’ స్కూలు ప్రారంభమైంది. మొదటి సంవత్సరం 16 మంది విద్యార్థులు ఉండేవారు. మరుసటి ఏడాది ఆ సంఖ్య 136కి చేరింది. విద్యార్థులకు నేను, ప్రమీల పాఠాలు చెప్పేవాళ్లం. మరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు టీచర్లుగా ఉండేవారు. 1988 నుంచి ఎమ్మెల్యేల పిల్లలూ ‘విశ్వశాంతి’లో అడ్మిషన్లు తీసుకోవడం మొదలైంది. ఇప్పుడు 80 ఎకరాల విస్తీర్ణంలో ‘శ్రీ విశ్వశాంతి’ నడుస్తోంది.
గుడాల శ్రీనివాస, విజయవాడ
ఫొటోలు: లక్ష్మణ్
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..