Shingles: 50 ఏళ్లు దాటితే షింజిల్స్ షురూ
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:00 AM
షింజిల్స్ అనేది చికెన్‌పాక్స్ వైరస్ వల్ల కలిగే తీవ్రమైన చర్మ సమస్య 50 ఏళ్లు దాటిన వారిలో ఇది తీవ్రమైన నొప్పి మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది

అవగాహన
చికెన్‌పాక్స్ వైరల్ ఇన్‌ఫెక్షన్ అనే విషయం మనందరికీ తెలిసిందే! ఇదే వైరస్ ‘షింజిల్స్’ అనే తీవ్రమైన చర్మ సమస్యకు కూడా కారణమవుతుంది. 50 ఏళ్లు పైబడిన వాళ్లను వేధించే ఈ సమస్య గురించి వైద్యులు ఏమంటున్నారంటే...
షింజిల్స్ ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ కాదు. కానీ అది జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఏడాది మన దేశంలో చేపట్టిన ఇండియా షింజిల్స్ అవగాహన సర్వేలో 50 ఏళ్లు పైబడిన 56.6% మంది పెద్దలకు షింజిల్స్ గురించి ఏమాత్రం అవగాహన లేదనే విషయం తేలింది. కానీ ఈ సమస్య గురించి పూర్తి అవగాహన ఏర్పరుచుకోగలిగితే, మరింత మెరుగ్గా దాన్ని ఎదుర్కోగలుగుతాం!
వ్యాధి కాదు, వైరస్ వ్యాపిస్తుంది
చికెన్‌పాక్స్‌కు కారణమయ్యే వైరస్ వల్లే షింజిల్స్ సోకుతుంది. అయితే షింజిల్స్ సోకిన వ్యక్తుల నుంచి ఆ వ్యాధి ఇతరులకు వ్యాపించదు. కానీ షింజిల్స్‌కు కారణమైన వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అప్పటివరకూ చికెన్‌పాక్స్ బారిన పడని వ్యక్తులు షింజిల్స్ సోకిన వ్యక్తులకు బహిర్గతమైతే, వారికి షింజిల్స్ సోకడానికి బదులుగా, చికెన్‌పాక్స్ సోకుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా సదరు వైరస్ శరీరంలో నిద్రాణంగా ఉండిపోయి, తర్వాతి కాలంలో 50 ఏళ్లు పైబడిన తర్వాత షింజిల్స్ రూపంలో వేధిస్తుంది.
పొరపాటు పడకూడదు
దురదలతో కూడిన షింజిల్స్‌ను, ఎగ్జిమ అనే చర్మ వ్యాధిగా పొరపాటు పడేవాళ్లు ఉంటారు. దాంతో షింజిల్స్ చికిత్స ఆలస్యమైపోతుంది. ఫలితంగా వైరస్ మరింత అభివృద్ధి చెంది, దీర్ఘకాలిక సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎగ్జీమాకు భిన్నమైన షింజిల్స్‌లో నొప్పి, మంట, తిమ్మిర్లు ఉంటాయి. ఆ తర్వాత శరీరం మీద పుండ్లు ఏర్పడతాయి.
ఏళ్ల తరబడి నొప్పి
షింజిల్స్ సోకిన కొందర్లో పుండ్లు మానిన వెంటనే నొప్పి తగ్గదు. షింజిల్స్‌తో నాడుల చివర్లు దెబ్బతిని, పోస్‌థెరపిటిక్ న్యురాల్జియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో నాడులు అవసరానికి మించిన నొప్పి సంకేతాలను చర్మం నుంచి మెదడుకు సరఫరా చేస్తూ ఉంటాయి. దాంతో తట్టుకోలేనంత బాధ వేధిస్తుంది. ఈ నొప్పి నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దాంతో నిద్రాభంగం కలగడం, రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడడం, జీవన నాణ్యత దెబ్బతినడం జరుగుతుంది. వయసు ఎంత ఎక్కువగా ఉంటే, ఈ నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది.
ఇతర అవయవాలు కూడా...
షింజిల్స్ చర్మంతో పాటు, కీలక అవయవాలను కూడా ప్రభావితం చేస్తాయి. కంటి చుట్టూరా తలెత్తిన షింజిల్స్‌తో కళ్లు దెబ్బతిని, కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో మెదడు ఇన్‌ఫ్లమేషన్, ముఖ పక్షవాతం, వినికిడి, సంతులన సమస్యలు తలెత్తుతాయి. బలహీనమైన వ్యాధినిరోధకశక్తి కలిగిన వారిలో ఈ సమస్యలు అత్యధికం.
షింజిల్స్ పలుసార్లు
షింజిల్స్ ఒక్కసారే సోకుతుందన్నది అపోహ. ఎక్కువ శాతం మంది జీవితంలో ఒక్కసారే షింజిల్స్ బారిన పడితే, అంతకంటే ఎక్కువ సార్లు ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన వాళ్లు కూడా లేకపోలేదు. అయుతే రెండోసారి షింజిల్స్ సోకినప్పుడు, మొదటిసారి పుండ్లు ఏర్పడిన అదే ప్రదేశంలో పుండ్లు ఏర్పడవు.
చికిత్స ఇలా...
యాంటీవైరల్: వైరస్ తీవ్రత, వ్యవధిని తగ్గించడం కోసం మరీ ముఖ్యంగా ప్రారంభంలో ఈ మందులు వాడుకోవచ్చు.
నొప్పి నివారణ: వైద్యులు సూచించే నొప్పిని తగ్గించే మందులు వాడుకోవచ్చు
ఉపశమనం: ఉపశమనం కోసం పుండ్లను, దురదను తగ్గించే జెల్స్, క్రీమ్స్ వాడుకోవచ్చు.
భారతదేశంలో 50 ఏళ్లకు పైబడిన 90% మంది ఈ వైర్‌సను శరీరాల్లో కలిగి ఉన్నారు కాబట్టి ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని, నివారణ చర్యలు పాటించాలి. అందుకోసం షింజిల్స్ గురించి వైద్యులతో చర్చించి, టీకాలతో నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధకశక్తిని దృఢంగా ఉంచుకోవాలి.
-డాక్టర్ మేక సత్యన్నారాయణ
సీనియర్ కన్సల్టెంట్
ఫ్యామిలీ ఫిజీషియన్,
అశ్విని ఐడి క్లినిక్, హైదరాబాద్