Share News

అభయాన్నిచ్చే శ్రీరామనామం!

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:50 AM

వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు మధుసూధన మాసము (చైత్ర మాసం)లో జన్మించాడు. ఆయన జన్మించిన శుక్లపక్ష నవమి తిథిని అందరూ శ్రీరామ నవమి మహోత్సవంగా జరుపుకుంటారు...

అభయాన్నిచ్చే శ్రీరామనామం!

హరేకృష్ణ

6న శ్రీరామ నవమి

వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు మధుసూధన మాసము (చైత్ర మాసం)లో జన్మించాడు. ఆయన జన్మించిన శుక్లపక్ష నవమి తిథిని అందరూ శ్రీరామ నవమి మహోత్సవంగా జరుపుకుంటారు.

భగవద్గీతలో ఉద్బోధించినట్టు దుష్ట శిక్షణకు.. శిష్ట రక్షణకు.. ధర్మ సంస్థాపనకు భగవంతుడు యుగయుగాన అవతరిస్తాడు. జీవుడు భగవంతుణ్ణి శరణు పొందే మార్గాన్ని సుగమం చేస్తాడు. అలాంటి అవతారమే శ్రీరామచంద్రుడు. దేవదేవుడిని శరణు పొందిన వారెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని లోకానికి నిరూపించటమే శ్రీరామ అవతరణలోని ముఖ్యఉద్దేశం. శ్రీమద్రామాయణ, భాగవతాదుల్లో పొందుపరచిన శ్రీరాముని లీలల్లో తరచూ ఈ సూత్రమే గోచరిస్తుంటుంది. భగవంతుడు అవతరించటం అంటే తన స్వధామం నుండి ఈ భూలోకానికి దిగివచ్చే ప్రక్రియ. శ్రీరాముడు ఆధ్యాత్మిక లోకంలోని అయోధ్య ధామం నుండి భూలోకంలోని అయోధ్యలో అవతరించాడు. మానవ జన్మలు కర్మఫలానుసారం జరుగుతాయి. కానీ భగవంతుడి అవతరణ ఆయన సంకల్పం ఆధారంగానే జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. భగవంతుడు శాశ్వతుడు. ఈ కోణం నుంచి చూస్తే రాముడు త్రేతాయుగానికే పరిమితం కాదు. ఆయన సర్వకాలాలలో సర్వజీవులకు పూజనీయుడు.


లీలా మహత్యం...

సూర్యుడు ఒకచోట అస్తమిస్తే, మరోచోట ఉదయిస్తాడు. అలాగే భగవంతుడి వేడుకలు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. ఈ వేడుకను మనం జరుపుకోవటం ద్వారా నిత్యలీలల్లో పాల్గొనే భాగ్యం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతాం. సాధారణంగా భగవంతుడు తన లీలలను ప్రదర్శించేది జీవులకు సేవాభాగ్యాన్ని కల్పించటం కోసమే. అంతే కాకుండా ప్రతి లీలలో ధర్మం నిబిడీకృతమై ఉంటుంది. వీటిని అర్థం చేసుకున్నప్పుడు... జీవితంలో ఏ మార్గాన్ని అనుసరించాలనేది తెలుస్తుంది. సంప్రదాయక ఆచార్యుల ద్వారా ఈ లీలలను తెలుసుకుంటే వాటికి ప్రామాణికత ఉంటుంది. లేకపోతే తప్పుగా అర్థం చేసుకొనే అవకాశమూ ఉంటుంది.


శ్రీరామ రక్ష...

‘‘ఎవరైనా నన్ను ఒక్కసారైనా నిజముగా శరణువేడి స్వామీ! ఈ రోజు నుండి నేను నీ వాడను అంటూ తనకు అభయమొసగమని ప్రార్థిస్తే, అట్టివానికి ఆ క్షణము నుండి అభయమిచ్చి సర్వదా సంరక్షించెదను’’ అని రాముడే స్వయంగా ప్రకటిస్తాడు. ఈ ధోరణి శ్రీరామచంద్రుడి లీలా వైభవంలో అడుగడుగునా దర్శనమిస్తుంది. రావణాసురుని నుండి తమను రక్షింపమని దేవతలే అడిగినా లక్ష్మణుని తల్లికి.. సుగ్రీవునికి లేదా విభీషనుడికి ఇచ్చిన మాటైనా.. ఇలా ప్రతి సందర్భంలోనూ అందరికీ రాముడు అభయమిస్తాడు. అలాంటి రాముడిని చేరుకోవటానికి ఉత్తమమైన మార్గం... భగవన్నామ జపం. ‘‘భిన్నత్వాన్‌ నామ నామినో’’ అంటుంది పద్మపురాణం. భగవన్నామానికి మరియు భగవంతునికి మధ్య ఎట్టి వ్యత్యాసమూ లేదని దీని అర్ధం. భగవన్నామాన్ని జపిస్తే భగవంతుడు మనవద్దనున్నట్టే. రామ నామాన్ని జపించేవారికి ఆ నామమే అభయాన్ని ప్రసాదిస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువు నేటికీ తన నామ రూపంలో ఈ లోకంలోనే ఉన్నాడు.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:50 AM