థర్మామీటర్‌ను విమానంలోకి అనుమతించరు.. కారణమిదే..
ABN, Publish Date - Mar 12 , 2025 | 07:22 PM
Thermo Meter not Allowed in Flight : కొందరు పిల్లలకు తరచూ జ్వరం వస్తుంటుంది. అందుకని జ్వరం వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికని ప్రయాణాల్లో పేరెంట్స్ థర్మామీటర్ క్యారీ చేస్తుంటారు. అయితే, విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రం థర్మామీటర్ అస్సలు వెంట తీసుకెళ్లకండి. దీన్ని మీతో పాటు తీసుకెళితే మిమ్మల్ని అనుమతించరు. దాని వెనకగల అసలు కారణమిదే..

చాలా మంది ప్రయాణించేటప్పుడు అవసరమైన మందులతో పాటు థర్మామీటర్‌ను కూడా తప్పక తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. కానీ విమానంలో థర్మామీటర్ తీసుకెళ్లడం నిషేధం.

విమానంలో థర్మామీటర్ ఎందుకు అనుమతించరో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి థర్మామీటర్లలో రెండు రకాలున్నాయి. ఒకటి పాదరసంతో పనిచేసేది. ఇంకోటి డిజిటల్ థర్మామీటర్.

రెండు రకాల థర్మామీటర్లలో మెర్క్యూరీ థర్మామీటర్ మాత్రమే విమానాల్లోకి అనుమతించరు. ఇందుకు అతిపెద్ద కారణం పాదరసం.

సైన్స్ ప్రకారం పాదరసం అల్యూమినియంకు దగ్గరగా ఉంటే ప్రమాదం. విమానాల తయారీలో అల్యూమినియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కారణంగానే పాదరసానికి సంబంధించిన ఏ వస్తువైనా విమానంలోకి అనుమతించరు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం విమానంలో థర్మామీటర్ చెడిపోతే విమానం కూలిపోయే ప్రమాదముంది. అందుకే మీరు మీ చెక్ఇన్ బ్యాగేజీలో లేదా మీ లగేజీలో పాదరసం ఉన్న థర్మామీటర్‌ను తీసుకెళ్లకూడదు.

అయితే, పాదరసం థర్మామీటర్లు ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్లు, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు ఇలా అనేక రకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇలాంటి వాటిని తీసుకెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Updated at - Mar 13 , 2025 | 12:39 PM