సైన్‌బోర్డుల అడవి
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:32 AM
కూడళ్లలో సైన్‌బోర్డులు మామూలే. నగరాల్లో ఏ వీధి ఎక్కడుందో తెలుసుకోవడానికి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడమూ తెలుసు. గ్రామాల్లో ఊరి పేరుతో ఒకటో రెండో సైన్‌బోర్డులు కనిపిస్తాయి. అయితే కెనడాలోని అలస్కా హైవేపై ఒక చోట కొన్నివేల సైన్‌బోర్డులు దర్శనమిస్తాయి. ఏకంగా ‘సైన్‌పోస్ట్ ఫారెస్ట్’గా పిలిచే అక్కడ బోర్డులు పెట్టడం ఎలా మొదలయ్యిందంటే...

జాతీయ రహదారుల్లోని సైన్ బోర్డులను చూసి, వాహనదారులు వాటి ప్రకారం ముందుకు వెళ్తుంటారు. కానీ కెనడాలోని అలస్కా రహదారిపై ఒక చోట ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులు చూడాలంటే వాహనాన్ని పక్కకు ఆపి... నింపాదిగా రోజంతా చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ కొన్ని వేల సైన్‌బోర్డులు దర్శనమిస్తాయి. అందుకే ఆ ప్రాంతానికి ‘సైన్‌పోస్ట్ ఫారెస్ట్’ అని పేరు స్థిరపడింది. సైన్‌పోస్ట్ ఫారెస్ట్ ఎక్కడుందో తెలియచేసేందుకు కూడా ఒక సైన్‌బోర్డు ఉండటం విశేషం.
ఈ వార్తను కూడా చదవండి: విహారం... సరికొత్తగా...
ఎలా మొదలయ్యిందంటే...
సైన్‌బోర్డులన్నీ ఇలా ఒకేచోట ఏర్పాటు చేయడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అలస్కా హైవే నిర్మాణ పనులు చేపట్టారు. అమెరికా, కెనడాను కలిపే రహదారి ఇది. ఈ పనులు జరుగుతున్న సమయంలో అమెరికన్ సైనికుడొకరు అక్కడ ఒంటరిగా విధులు నిర్వర్తిస్తూ ఉండేవాడు. అతని స్వగ్రామం ఇల్లినాయిస్‌లోని డాన్విల్లే. అతడు సరదాకి తన స్వగ్రామం ఉన్న దిక్కు తెలియజేసేలా చేత్తో ఒక చెక్కపై రాసి రోడ్డు పక్కన పాతాడు. దాన్ని చూసిన మరికొంతమంది కూడా అలాగే వాళ్ల ఊళ్లకు దారి చూపిస్తూ బోర్డులు పాతారు. క్రమంగా వాటి సంఖ్య పెరిగి వేలకు చేరింది. దాంతో ఆ ప్రాంతం సైన్‌పోస్ట్ ఫారెస్ట్‌గా మారింది. ప్రస్తుతం అక్కడ 90 వేలకు పైగా సైన్‌బోర్డులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
సైన్‌పోస్ట్ ఫారెస్ట్ కొన్ని ఎకరాలలో విస్తరించి ఉంది. ఇప్పటికీ అక్కడ ప్రతిరోజూ కొత్త బోర్డులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. స్ట్రీట్ సైన్‌బోర్డులే కాకుండా, ‘వెల్‌కం టు..’ వంటి బోర్డులు కూడా ఇక్కడ అనేకం కనిపిస్తాయి. ఇక్కడికొచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. ఈ ప్రదేశాన్ని సందర్శించిన పర్యాటకులు సైతం సరదాగా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. కాలక్రమంలో ఇది పాపులర్ ప్లేస్‌గా గుర్తింపు పొందింది. అలస్కా హైవేపై సైన్‌పోస్ట్ ఫారెస్ట్ ఎక్కడుంది? అని ఎవరిని అడిగినా చెబుతారు. అక్కడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ సైన్ బోర్డుల ముందు సెల్ఫీ దిగకుండా మాత్రం ముందుకు కదలరు.
ఈ వార్తలు కూడా చదవండి:
Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్ కారు
ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు
Read Latest Telangana News and National News