భలే ‘టైమ్’ వచ్చిందిప్పుడు..
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:10 PM
ఆన్‌లైన్ లగ్జరీ వాచీలు కొనుగోలు చేస్తున్న వారిలో అధిక శాతం 40 లోపు వయసు వాళ్లే ఉన్నారని ‘స్విస్‌వాచ్ ఎక్స్‌పో’ మార్కెట్ సర్వేలు తెలియజేస్తున్నాయి. అలాగే వీళ్లు పద్దెనిమిది నెలలు లేదా రెండేళ్లు కాగానే ఆ గడియారాన్ని మార్చేసి కొత్తది కొంటున్నారట.

‘హలో..’ అంటూ షేక్‌హ్యాండ్ ఇవ్వగానే ముంజేతిపై తళతళ మెరిసే గడియారంతోనే వారి స్టేటస్ వెంటనే అర్థం అవుతుంది. చేతికి పెట్టుకునే వాచీనే కదాని తీసిపారేసే కాలం కాదిది. రాళ్లు, రత్నాలు, వజ్రాలు, బంగారంతో తయారయ్యే ఖరీదైన గడియారాల మార్కెట్ చాలా పెద్దదైపోయిందిప్పుడు. ఏటా రూ.2500 కోట్ల విలువైన వాచీలు స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. స్విస్ లగ్జరీ వాచీలలో ముఖ్యమైన బ్రైట్లింగ్ కంపెనీ దేశంలోనే తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. లగ్జరీ వాచీల మార్కెట్ ఏటా 15 శాతం వృద్ధి చెందుతోంది. అందుకే గడియారాలకు మంచి టైమ్ వచ్చిందిప్పుడు...
చేతి గడియారం... చిన్న ముళ్లు, పెద్ద ముళ్లు.. 12 అంకెలు, ఓ డయలు, స్ట్రాప్ ఇంతేనా? అందులో మిలమిల మెరిసే రాళ్లు, ఖరీదైన రత్నాలను పొదగడం; బంగారు, వెండితో డయల్స్‌ను తయారుచేయడం; సెకన్లలో సమయాన్ని కచ్చితత్వంతో తెలుసుకోగల మెకానిజం వీటి సొంతం. ఒక ఖరీదైన గడియారాన్ని తయారుచేయాలంటే రోజుల తరబడి గంటలకు గంటలు కష్టపడితే కానీ పూర్తవ్వదు. వీటి డిజైన్, తయారీ, రూపకల్పన, పనితీరు, విడి భాగాలు... అన్నీ అద్భుతమే. అదీకాక ఏటా పరిమిత సంఖ్యలో మాత్రమే మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి తయారీ సంస్థలు. అందుకే వాచీల ధర అత్యంత ఖరీదు. వేల రూపాయల నుంచి లక్షల దాకా ఉంటుంది. కొన్ని అయితే కోట్ల రూపాయలు పలుకుతున్నాయి.
ఆన్‌లైన్ లగ్జరీ వాచీలు కొనుగోలు చేస్తున్న వారిలో అధిక శాతం 40 లోపు వయసు వాళ్లే ఉన్నారని ‘స్విస్‌వాచ్ ఎక్స్‌పో’ మార్కెట్ సర్వేలు తెలియజేస్తున్నాయి. అలాగే వీళ్లు పద్దెనిమిది నెలలు లేదా రెండేళ్లు కాగానే ఆ గడియారాన్ని మార్చేసి కొత్తది కొంటున్నారట. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతతో వచ్చే సెల్‌ఫోన్లను విరివిగా మార్చడం చూస్తూనే ఉన్నాం. కాలానికి తగ్గట్ట్టుగా మారే ధోరణే ఇదంతా. లగ్జరీ గడియారంతో తమ సర్కిల్స్‌లో మెరిసిపోవాలన్నదే వినియోగదారుల ఉద్దేశ్యం.
నలుపుకే జై
లగ్జరీ గడియారాల్లో ఉన్న నేటి ట్రెండ్‌ను చూస్తే... 2020 నుంచి 43 -45 ఎంఎం కేసుల వాచీలకు డిమాండు బాగా పెరిగింది. అక్కడక్కడా 34-36 ఎంఎం కేసులవీ కనిపిస్తున్నాయి. ఇక డయల్స్ విషయానికి వస్తే ఆల్ టైమ్ ఫేవరెట్స్‌గా నలుపు రంగులో ఉన్నవే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. లగ్జరీ గడియారాల కంపెనీలు రోలెక్స్, ఒమెగా, టాగ్ హోయర్, బ్రైట్లింగ్ తదితరాలన్నీ కూడా బ్లాక్ డయల్ గడియారాలనే ఉత్పత్తి చేస్తున్నాయి. నలుపు తరవాత సిల్వర్, నీలం డయల్ వాచీలను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు.
వినియోగదారుల డిమాండు, మారుతున్న టెక్నాలజీ, జీవనశైలి ఆధారంగా లగ్జరీ వాచ్‌ల కంపెనీలు డిజైన్లను విడుదల చేస్తున్నాయి. వాచీలు తయారు చేసే శాస్త్రానికి (హోరాలజీ) 2025 గొప్ప ఏడాదిగా నిలవబోతోందని మార్కెట్ పండితులు విశ్లేస్తున్నారు. టాప్ కంపెనీలు కూడా పర్యావరణానికి హాని కలిగించని మెటీరియల్స్‌తో గడియారాలు చేయడానికి ముందుకొస్తున్నాయి. ‘రీసైకిల్డ్ టైటానియం, సింథటిక్ సఫైర్ గ్లాస్, వేగాన్ స్ట్రాప్స్‌తో మోడల్స్ రూపొందిస్తున్నారు. లేటెస్ట్ డిజైన్స్ మార్కెట్‌లో ఎన్ని ఉన్నా కూడా ఒక్కోసారి వింటేజ్ లుక్ ఉన్న వాచీలే యువకులను ఆకర్షిస్తున్నాయి. డిజిటల్ వాచీలు ఎంతలా మార్కెట్‌ను కమ్ముకున్నా మెకానికల్ వాచీలే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అయితే వీటిలో కూడా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ తో, లేటెస్ట్‌గా ఉన్న వాటికే జనం మొగ్గు చూపుతున్నారు. అలాగే స్మార్ట్ ఫీచర్లు ఉన్న లగ్జరీ వాచీలకు సైతం డిమాండ్ పెరుగుతోంది. వీటిల్లో హెల్త్ ట్రాకింగ్, స్మార్ట్ నోటిఫికేషన్లు, సోలార్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఎంతో ఉపయోగకరం. లగ్జరీ వాచీలు అంటేనే లిమిటెడ్ ఎడిషన్. అందుకే ఆ వాచీలపై ప్రత్యేక డిజైన్లు, స్టోరీలతో పాటు తమ పేర్లను కూడా ముద్రించుకుని తెగ మురిసిపోవాలనుకునే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. అయితే పురుషుల కన్నా మహిళల వాచీల్లో కాసింత క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. రాళ్లు, రంగులు, డిజైన్లలో విభిన్నత స్పష్టంగా కనిపిస్తుంది.
బాబోయ్ నకిలీ
గ్లోబల్ వాచ్ మార్కెట్‌ను ఎక్కువగా వేధిస్తోన్న సమస్య నకిలీ ఉత్పత్తులు. ఏడాదిలో ఎంత లేదన్నా 4 కోట్ల నకిలీ వాచీలను ఉత్పత్తి చేస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ది స్విస్ వాచ్ ఇండస్ట్రీ పేర్కొంటోంది. ఒరిజినల్ వాచీలతో పోలిస్తే నకిలీ వాచీలు ధర తక్కువ. అచ్చం ఒకేలా ఉంటాయి. కనుక్కోవడం కష్టం. కాస్త పట్టి చూస్తేకానీ ఫేక్ అని పసిగట్టలేము. ఆన్‌లైన్ సేల్స్‌లో నకిలీల జోరు ఎక్కువ. కాబట్టి లైసెన్స్ ఉన్న షోరూముల్లో, గ్యారంటీ కార్డులతోనే లగ్జరీ వాచీలను కొనుగోలు చేయడం ఉత్తమం.
‘సికందర్’ చేతికి...
‘సికందర్’ మూవీ ప్రమోషన్లలో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది సల్మాన్‌ఖాన్ ధరించిన గడియారం. ప్రసిద్ధ జాకబ్ అండ్ కంపెనీ, ఏథోస్‌తో కలిసి రూపొందించిన ‘ఎపిక్ ఎక్స్ రామ జన్మభూమి టైటానియమ్ ఎడిషన్ 2’ గడియారం ఇది. డయల్ చుట్టూ జైశ్రీరామ్ అని రాసి ఉండడం విశేషం. లోపల అయోధ్య రామమందిరం, శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను పొందుపరిచారు. లిమిటెడ్ ఎడిషన్ వాచీ ఇది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి కేవలం 49 మాత్రమే ఉన్నాయి. సల్మాన్‌ఖాన్ ధరించిన ఈ వాచీ ధర అక్షరాలా రూ.61 లక్షలు. ఇది రోజ్‌గోల్డ్ ఎడిషన్ వాచీ. అదే టైటానియమ్ వాచీ ధర రూ.34 లక్షలు.
ఏడు కోట్లు మాత్రమే...
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జనవరిలో ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రూబెల్ ఫోర్సే హ్యాండ్‌మేడ్ 1 గడియారంతో కనిపించారు. ఈ వాచీ ధర అక్షరాలా ఏడు కోట్ల రూపాయలట. పేరుకు తగినట్టే ఈ గడియారం హ్యాండ్‌మేడ్‌తో తయారైంది. దీన్ని రూపొందించడానికి 6,000 పని గంటలు అవసరం. ఈ గడియారంలోని 95 శాతం విడిభాగాలను హస్తకళానైపుణ్యంతో తయారుచేయడం విశేషం. హ్యాండ్‌మేడ్ 1 గడియారాన్ని 2019లోనే లాంచ్ చేశారు. ఏడాదికి రెండు లేక మూడు గడియారాలనే ఆ సంస్థ తయారుచేస్తుంది. అంటే ప్రస్తుతం ఇలాంటివి 15 మాత్రమే ఉన్నాయి. వాటిని పొందిన వాళ్లలో జుకర్‌బర్గ్ ఒకరు. ఇదే కాకుండా మరికొన్ని ఖరీదైన వాచీల సేకరణ ఈ టెక్ బిలియనీర్ సొంతం. ఈ ఏడాది హ్యాండ్‌మేడ్ 2 సిరీస్ వాచీలను విడుదల చేస్తున్నట్టుగా గ్రూబెల్ ఫోర్సే ప్రకటించింది.
స్పోర్ట్స్ ఐకాన్
నేటి టెన్సిస్ సెన్సేషన్ జానిక్ సిన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ గెలుపొంది తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించాడు. ఇటలీకి చెందిన ఈ యువ ఆటగాడు స్టయిల్ ఐకాన్‌గా యువత మనసు దోచుకున్నాడు. ఆ టోర్నీ కప్పుతో పాటు అతడు ధరించిన గడియారం కూడా కెమెరా వెలుగుల్లో తళుక్కున మెరిసింది. ప్రసిద్ధి చెందిన రోలెక్స్ కంపెనీ రూపొందించిన కాస్మోగ్రాఫ్ డేటోనా లగ్జరీ గడియారం అది. ఆకాశం నుంచి జారిపడ్డ ఉల్క ముక్కతో ఈ వాచీ డయల్ తయారు చేయడం విశేషం. అందుకే ధర లక్షల్లో పలికింది.
వాచీ కంపెనీతో..
ఫుట్‌బాల్ ప్రపంచంలో మరికొన్నేళ్లు కెలియాన్ ఎంబాపే పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అతడు సాధిస్తోన్న రికార్డులు అలాంటివి. ఇరవై ఆరేళ్ల ఈ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌కు లగ్జరీ గడియారాలంటే భలే మోజు. అతడి కలెక్షన్‌లో ఎన్నో వాచీలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా ఇన్వెస్టర్ అవతారం ఎత్తాడు. హాంకాంగ్‌కు చెందిన లగ్జరీ గడియారాల సంస్థ ‘రిస్ట్‌చెక్’లో ఇటీవలే ఎంబాపే పెట్టుబడులు పెట్టడం వ్యాపార ప్రపంచంలో పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ కంపెనీ వాచీల ధరలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇలా రకరకాల బ్రాండ్లు, డిజైన్లతో ఆకట్టుకుంటున్న గడియారాలకు ఇప్పుడు మంచి టైమ్ వచ్చింది.