Share News

అభిషేక్‌ చేశాడు

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:20 AM

ఇదీ సన్‌రైజర్స్‌ సత్తా.. అంటూ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రికార్డులను తిరగరాస్తూ సాగిన అతడి విధ్వంసానికి ఉప్పల్‌ స్టేడియం ఊగిపోయింది. కొడితే సిక్సర్‌ లేదంటే ఫోర్‌ అనే...

అభిషేక్‌ చేశాడు

నేటి మ్యాచ్‌లు

రాజస్థాన్‌ X బెంగళూరు

వేదిక: జైపూర్‌ : మ.3.30 నుంచి

ఢిల్లీ X ముంబై

వేదిక: ఢిల్లీ : రా.7.30 నుంచి

40 బంతుల్లోనే శతకం

246 పరుగులను ఛేదించిన సన్‌రైజర్స్‌

పంజాబ్‌కు షాక్‌

అభిషేక్‌ శర్మ (141) (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో)

సెంచరీ అనంతరం ‘ఇది ఆరెంజ్‌ ఆర్మీ కోసం’ అంటూ రాసిన కాగితాన్ని చూపిస్తున్న అభిషేక్‌

హైదరాబాద్‌: ఇదీ సన్‌రైజర్స్‌ సత్తా.. అంటూ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రికార్డులను తిరగరాస్తూ సాగిన అతడి విధ్వంసానికి ఉప్పల్‌ స్టేడియం ఊగిపోయింది. కొడితే సిక్సర్‌ లేదంటే ఫోర్‌ అనే మాదిరిగా సాగిన బాదుడుకు, పంజాబ్‌ కింగ్స్‌ సాధించిన భారీ స్కోరు కూడా చిన్నబోయింది. దీంతో వరుసగా నాలుగు ఓటములకు చెక్‌ పెడుతూ రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. శ్రేయాస్‌ (82), ప్రభ్‌సిమ్రన్‌ (42), ప్రియాన్ష్‌ (34), స్టొయినిస్‌ (34 నాటౌట్‌) వేగం కనబర్చారు. హర్షల్‌కు నాలుగు, ఎషాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలిచింది. హెడ్‌ (66), క్లాసెన్‌ (21 నాటౌట్‌) రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అభిషేక్‌ నిలిచాడు.


ఏమా బాదుడు..?: 246 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ ఏ దశలోనూ వెనక్కితగ్గలేదు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ వాయువేగంతో పరుగులు రాబట్టగా.. అటు మరో ఓపెనర్‌ హెడ్‌ చక్కగా సహకరించాడు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఈ ఇద్దరూ వీరంగమే ఆడారు. అయితే 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్‌ క్యాచ్‌ అవుటైనా అది నోబ్‌గా తేలడంతో బతికిపోయాడు. ఇక పవర్‌ప్లేలో 83 రన్స్‌తో జట్టు ఛేదన వైపు వేగంగా సాగింది. ఎట్టకేలకు 13వ ఓవర్‌లో హెడ్‌ను చాహల్‌ అవుట్‌ చేయగా తొలి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అదే ఓవర్‌లో సింగిల్‌తో అభిషేక్‌ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ‘ఇది ఆరెంజ్‌ ఆర్మీ కోసం’ అంటూ ఓ పేపర్‌ను చూపాడు. వన్‌డౌన్‌లో క్లాసెన్‌ క్రీజులోకి వచ్చినా అభిషేక్‌దే హవా సాగింది. బౌండరీలతో హోరెత్తిస్తూ లక్ష్యాన్ని వేగంగా కరిగించాడు. చివరకు 23 బంతుల్లో 24 రన్స్‌ కావాల్సిన వేళ అర్ష్‌దీ్‌పకు చిక్కాడు. ఆ తర్వాత క్లాసెన్‌ బౌండరీల హోరుతో మరో 9 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.


పంజాబ్‌ దూకుడు: టాస్‌ గెలవగానే పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ శివాలెత్తారు. మధ్య ఓవర్లలో శ్రేయాస్‌, ఆఖర్లో స్టోయినిస్‌ ఫినిషింగ్‌కు పంజాబ్‌ అవలీలగా 220 స్కోరు దాటేసింది. అలాగే రైజర్స్‌ పేలవ ఫీల్డింగ్‌ కూడా భారీ స్కోరుకు దోహదపడింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ప్రభ్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆరంభమైంది. ఇక రెండో ఓవర్‌లో ప్రియాన్ష్‌ 6,4తో పాటు.. తర్వాతి ఓవర్‌లోనే అతడి 6,6,4తో జట్టు 18 బంతులకే 53 పరుగులతో వావ్‌ అనిపించింది. అయితే హర్షల్‌ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన వెంటనే ఆర్య మిడ్‌ వికెట్‌లో నితీశ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరో ఓవర్‌లో కెప్టెన్‌ శ్రేయాస్‌ సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 89/1 స్కోరుతో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ను కొత్త పేసర్‌ ఎషాన్‌ మలింగ అవుట్‌ చేశాడు. ఈ స్థితిలో శ్రేయాస్‌ బాధ్యత తీసుకుని రన్‌రేట్‌ తగ్గకుండా చూశాడు. నేహల్‌ (27)తో కలిసి మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. 12వ ఓవర్‌లో శ్రేయాస్‌ 6,4,6తో 20 రన్స్‌ సమకూరాయి. ఈ జోరుతో అతడు 21 బంతుల్లోనే తన ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. వరుస ఓవర్లలో నేహల్‌ (27), శశాంక్‌ (2)ల వికెట్లను కోల్పోయినా శ్రేయాస్‌ దూకుడు తగ్గించలేదు. 17వ ఓవర్‌లో అతడి నాలుగు ఫోర్లతో జట్టు 200 దాటింది. అయితే తర్వాతి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చిన హర్షల్‌.. మ్యాక్స్‌వెల్‌ (3), శ్రేయాస్‌ వికెట్లతో ఝలక్‌ ఇచ్చాడు. కానీ ఆఖరి ఓవర్‌లో స్టొయినిస్‌ నాలుగు సిక్సర్లతో షమి ఏకంగా 27 రన్స్‌ సమర్పించుకున్నాడు.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (సి) నితీశ్‌ (బి) హర్షల్‌ 36, ప్రభ్‌సిమ్రన్‌ (సి) కమిన్స్‌ (బి) మలింగ 42, శ్రేయాస్‌ (సి) హెడ్‌ (బి) హర్షల్‌ 82, నేహల్‌ వధేరా (ఎల్బీ) మలింగ 27, శశాంక్‌ (ఎల్బీ) హర్షల్‌ 2, మ్యాక్స్‌వెల్‌ (బి) హర్షల్‌ 3, స్టొయినిస్‌ (నాటౌట్‌) 34, జాన్సెన్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 245/6; వికెట్ల పతనం: 1-66, 2-91, 3-164, 4-168, 5-205, 6-206; బౌలింగ్‌: షమి 4-0-75-0, కమిన్స్‌ 4-0-40-0, హర్షల్‌ 4-0-42-4, ఇషాన్‌ మలింగ 4-0-45-2, జీషన్‌ 4-0-41-0.

సన్‌రైజర్స్‌: హెడ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చాహల్‌ 66, అభిషేక్‌ (సి/సబ్‌) ప్రవీణ్‌ దూబే (బి) అర్ష్‌దీప్‌ 141, క్లాసెన్‌ (నాటౌట్‌) 21, ఇషాన్‌ (నాటౌట్‌) 9, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 18.3 ఓవర్లలో 247/2; వికెట్ల పతనం: 1-171, 2-222; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-37-1, జాన్సెన్‌ 2-0-39-0, యష్‌ ఠాకూర్‌ 2.3-0-40-0, మ్యాక్స్‌వెల్‌ 3-0-40-0, ఫెర్గూసన్‌ 0.2-0-1-0, స్టొయినిస్‌ 0.4-0-6-0, చాహల్‌ 4-0-56-1, శశాంక్‌ 2-0-27-0.


1

సన్‌రైజర్స్‌పై అత్యధిక పవర్‌ప్లే పరుగులు (89) సాధించిన జట్టుగా పంజాబ్‌.

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (141) సాధించిన భారత ఆటగాడిగా అభిషేక్‌. ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌.

ఐపీఎల్‌లో పంజాబ్‌కిది రెండో అత్యధిక స్కోరు (245/6). కోల్‌కతాపై ఎక్కువ రన్స్‌ (262/2) సాధించింది.

2

ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక ఛేజింగ్‌ (246) చేసిన జట్టుగా సన్‌రైజర్స్‌

ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (0/75) సమర్పించుకున్న రెండో బౌలర్‌గా షమి. ఆర్చర్‌ (0/76) టాప్‌లో ఉన్నాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

ఢిల్లీ 4 4 0 0 8 1.278

గుజరాత్‌ 6 4 2 0 8 1.081

లఖ్‌నవూ 6 4 2 0 8 0.162

కోల్‌కతా 6 3 3 0 6 0.803

బెంగళూరు 5 3 2 0 6 0.539

పంజాబ్‌ 5 3 2 0 6 0.065

రాజస్థాన్‌ 5 2 3 0 4 -0.733

హైదరాబాద్‌ 6 2 4 0 4 -1.245

ముంబై 5 1 4 0 2 -0.010

చెన్నై 6 1 5 0 2 -1.554

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి:

గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2025 | 03:21 AM