Arvind Kumar: అంతా కేటీఆరే చేశారు!
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:03 AM
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారమంతా నాటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అప్పట్లో ఆ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్ కుమార్.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఫార్ములా-ఈ కారు రేసు ఒప్పందాలు,
చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి
నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం
మళ్లీ మనదే అధికారం.. ప్రొసీడ్ అన్నారు
ప్రభుత్వ అధికారిగా.. మంత్రి చెప్పినట్లు చేశాను
ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను
ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడిది
రేసు నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు
ఏసీబీ విచారణలో అర్వింద్ కుమార్ వెల్లడి!
ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారమంతా నాటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అప్పట్లో ఆ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్ కుమార్.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. విదేశీ కంపెనీకి పురపాలక శాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్‌కు చెప్పానని, అయితే అంతా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అర్వింద్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఒక ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు నడుచుకున్నానని, ఇందులో తన స్వార్థమేమీ లేదని అన్నట్లు, అయితే.. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే కాపాడలేకపోవడం వాస్తవమేనని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్ బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఉదయం 9.40 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోగా.. 10.30 గంటల తర్వాత ఆయనను ఏసీబీ సీఐయూ టీం సభ్యులు పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. సాయంత్రం 4.30 వరకు దాదాపు ఆరు గంటలపాటు విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు అర్వింద్‌కుమార్ సమాధానమిస్తూ.. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కారు రేసు 9, 10, 11, 12 సెషన్లు నిర్వహించడానికి సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)తో 2022లో చర్చలు మొదలయ్యాయని తెలిపారు. రేసు నిర్వహించడానికి ఒక స్పాన్సరర్ అవసరం కావడంతో నాటి మంత్రి కేటీఆర్.. తన మిత్రుడైన గ్రీన్‌కో కంపెనీ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను రంగంలో దించారు. త్రైపాక్షిక ఒప్పందానికి ముందు ఏం జరిగింది? ఎవరెవరు ఎన్నిసార్లు పురపాలక శాఖ అధికారులతో, మంత్రితో సమావేశమయ్యారు? అని ఏసీబీ ప్రశ్నించగా.. ఒప్పందానికి ముందు, తర్వాత జరిగిన విషయాలను అర్వింద్‌కుమార్ పూసగుచ్చినట్లు వివరించారు.
సమస్యలు వస్తాయని చెప్పినా..
త్రైపాక్షిక ఒప్పందం అమల్లో ఉన్నపుడు తాము ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని ఏస్ నెక్ట్స్‌జెన్ రాత పూర్వకంగా పురపాలకశాఖకు తెలియజేసిందా? అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా.. అంతా మంత్రి కేటీఆరే మాట్లాడారని అర్వింద్‌కుమార్ చెప్పారు. స్పాన్సరర్ కంపెనీ తమకు నష్టం వచ్చినట్లు చెబుతున్నందున.. పురపాలక శాఖే స్పాన్సరర్‌గా ముందుకు రావాలని చెప్పడంతో తాను ఫైల్ తయారుచేసి మంత్రికి పంపించానన్నారు. ఆ సమయంలో లీగల్ సమస్యల గురించి వివరించానని, అయితే ‘డోంట్ వర్రీ.. మళ్లీ మనమే వస్తున్నాం.. ప్రొసీడ్’ అంటూ అంతా తానే చూసుకుంటానని కేటీఆర్ చెప్పారని తెలిపారు. ఎఫ్‌ఈవో నుంచి రూ.54.88 కోట్లకు వచ్చిన రెండు ఇన్‌వాయి్‌సలకు హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయాలని మంత్రి ఆదేశించారని చెప్పారు. క్యాబినెట్ ఆమోదం లేకపోవడం, ఆర్థికశాఖ అనుమతి తీసుకోకపోవడం, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, విదేశీ కరెన్సీ చెల్లింపులు, ఆర్‌బీఐ అనుమతికి సంబంధించి ఏసీబీ అధికారులు సంధించిన పలు ప్రశ్నలకు అర్వింద్‌కుమార్ సూటిగా జవాబిచ్చినట్లు తెలిసింది. కొన్ని కీలక డాక్యుమెంట్లతోపాటు కేటీఆర్‌తో జరిపిన వాట్సాప్ చాట్ మెసేజ్‌లను కూడా అధికారులకు అందజేశారని సమాచారం.
పురపాలక శాఖను బలవంతంగా లాగారు..
ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణలోకి పురపాలక శాఖ బలవంతంగా లాగబడిందని, ఆ శాఖ మంత్రి ఆదేశాలను ధిక్కరించే పరిస్థితిలో తాము లేమని అర్వింద్‌కుమార్ ఏసీబీ ఎదుట తన నిస్సహాయతను అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. కాగా, విచారణ సమయంలో ఏసీబీ అధికారులు పలుమార్లు అర్వింద్‌కుమార్‌కు తగినంత సమయం ఇచ్చి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన అంశాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించవచ్చని సమాచారం. విచారణ క్రమంలో అర్వింద్‌కుమార్‌కు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఏసీబీ అధికారులు అనుమతించినా.. కేవలం ఆయన స్నాక్స్ మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పి సాయంత్రం 4.30 గంటలకు విచారణ ముగించారు. ఆయన వాహనాన్ని కార్యాలయం రెండో గేటు నుంచి పంపించివేశారు.