Bhatti Vikramarka: గంజాయిరాజ్, లిక్కర్‌రాణీ.. అని అన్నామా?
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:18 AM
ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో నిందిచడాన్ని బీఆర్‌ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజం
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో నిందిచడాన్ని బీఆర్‌ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వాన్ని బయటి వ్యక్తులు ఏదో అంటున్నారని అసెంబ్లీలో మీరు అనడం విడ్డూరంగా ఉంది. మిమ్మల్ని కూడా బయట గంజాయిరాజ్, లిక్కర్‌రాణీ అని అంటున్నారు. మేమేనాడైనా అలా విమర్శించామా?’ అని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి భట్టి ప్రశ్నించారు. తాను యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని, అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశ్యంతో వచ్చానని భట్టి ఈ సందర్బంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమం కోసం నిధులు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని తెలిపారు. గతంలో రాబడి, వ్యయాలకు పొంతన లేకుండా బడ్జెట్‌ను రూపొందించేవారని, నిధులు కూడా ఖర్చు చేసేవారు కాదని చెప్పారు.
తమ ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్‌నే ప్రవేశపెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం వివిధ పనులు చేయించుకొని రూ.1,60,000 కోట్ల బిల్లులను బకాయి పెడితే తమ ప్రభుత్వం వాటిని చెల్లిస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన రూ.50,000 కోట్లను (క్యారీఫార్వర్డ్ నిధులను చేర్చి) కూడా వారి అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యార్థులకు డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచిందన్నారు. రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసానిచ్చిందని, ఇప్పటికే యాభైవేలకి పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మళ్లీ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామకాలను చేపడతామని అన్నారు. అలాగే, వైశ్యుల కోసం రూ.25కోట్లు, బ్రాహ్మణులకు రూ.100కోట్ల నిధులను కేటాయించి అగ్రవర్ణాలకు కూడా ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. రూ.5లక్షలుగా ఉన్న ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచి తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని భట్టి పేర్కొన్నారు.