Share News

ACB: లంచం కిక్కుతో ఏసీబీకి చిక్కారు

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:42 AM

‘పై సంపాదన’ జేబులో పడితే కిక్కే వేరు కావొచ్చు గానీ పట్టుబడితే ఎన్ని చిక్కులో కదా! ఈ లాజిక్‌ మరిచి.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు వేర్వేరుచోట్ల నలుగురు అధికారులు!

ACB: లంచం కిక్కుతో  ఏసీబీకి చిక్కారు

  • వెంచర్‌ మేనేజర్‌ నుంచి రూ.2 లక్షలు తీసుకున్న డీపీవో, పంచాయతీ కార్యదర్శి

  • ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఏడీఈ రూ.50 వేలు.. భూ సర్వే కోసం సర్వేయర్‌ రూ.12వేలు

అలంపూర్‌ చౌరస్తా, గచ్చిబౌలి, మర్రిగూడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘పై సంపాదన’ జేబులో పడితే కిక్కే వేరు కావొచ్చు గానీ పట్టుబడితే ఎన్ని చిక్కులో కదా! ఈ లాజిక్‌ మరిచి.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు వేర్వేరుచోట్ల నలుగురు అధికారులు! గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరులో సమీపంలో ఓ వెంచర్‌ మేనేజర్‌ నుంచి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), పంచాయతీ కార్యదర్శి రూ.3 లక్షలు డిమాండ్‌చేసి పట్టుబడ్డారు. పుల్లూరు దగ్గర్లో 44వ నంబరు జాతీయ రహదారికి అనుకొని టోల్‌ప్లాజా సమీపంలో సర్వే నంబరు 235/ఏ లోని నాలుగు ఎకరాల్లో ‘ఆన్నపూర్ణ గ్రీన్‌ల్యాండ్స్‌’ పేరుతో ఏపీకి చెందిన కొందరు వెంచర్‌ చేశారు. ఈ వెంచర్‌ కోసం వేసిన రోడ్డు మీద నుంచి వెళ్లేందుకు కొందరు వ్యక్తులు అడ్డుపడుతున్నారంటూ డీపీవో శ్యామ్‌ సుందర్‌కు వెంచర్‌ మేనేజర్‌ మహ్మద్‌ అజాజ్‌ బాషా ఫిర్యాదు చేశాడు. దీనిపై శ్యామ్‌సుందర్‌, పుల్లూరు గ్రామ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కలిసి వెళ్లి వెంచర్‌ను పరిశీలించారు. అయితే ఆ వెంచర్‌లో పంచాయతీకి తనఖా పెట్టిన ప్లాట్లను అనుమతులు లేకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారుల సహకారంతో వెంచర్‌ యాజమాని ఓ బిల్డర్‌కు రిజిస్ట్రేషన్‌ చేశారని కొందరు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంచర్‌ యజమానులకు నోటీసులు వెళ్లాయి. దీన్ని ఆసరాగా చేసుకొని వెంచర్‌ మేనేజర్‌ బాషా నుంచి ప్రవీణ్‌ లంచం డిమాండ్‌ చేశారు.


వెంచర్‌పై చర్యలు ఉండొద్దంటే డీపీవోకు, తనకు కలిపి మొత్తం రూ.3లక్షలు ఇవ్వాల్సిందేనన్నాడు. చివరికి.. రూ.2లక్షలకు బేరం కుదిరింది. దీనిపై బాషా, వెంచర్‌ యజమానులు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం ప్రవీణ్‌కు నగదు ఇచ్చేందుకు ఆయన సూచనల మేరకు అలంపూర్‌ వెళ్లే మార్గంలో గల జోగుళాంబ రైల్వేహాల్ట్‌ సమీపంలోని ఓ వెంచర్‌ వద్దకు బాషా వెళ్లాడు. అతడి నుంచి నగదు తీసుకున్న వెంటనే శ్యామ్‌సుందర్‌కు ప్రవీణ్‌ ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. సమీపంలోనే మాటువేసిన ఏసీబీ అధికారులు ప్రవీణ్‌ను చుట్టుముట్టి అదపులోకి తీసుకున్నారు. అప్పటికే జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో నిఘా ఉంచిన మరికొందరు ఏసీబీ అధికారులు డీపీవో శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోఘటనలో.. రెండు భవనాలకు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం లంచంగా రూ.లక్ష డిమాండ్‌ చేసిన విద్యుత్తు శాఖ ఏడీఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శేరిలింగంపల్లి సమీపంలోని గోపన్‌పల్లిలో రెండు అపార్ట్‌మెంట్లకు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు కావాలని విద్యుత్తు లైసెన్స్‌ కాంట్రాక్టర్‌ కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలి ఏడీఈ సతీశ్‌ కుమార్‌ను సంప్రదించాడు.


ఇందుకు సతీశ్‌ రూ.లక్ష డిమాండ్‌ చేయగా రూ.75వేలకు ఒప్పందం కుదిరింది. రెండు రోజుల క్రితమే రూ.25వేలు ఇచ్చి.. మిగితా డబ్బును శుక్రవారం ఇచ్చేలా కాంట్రాక్టర్‌ మాట్లాడుకున్నాడు. దీనిపై అప్పటికే అతడు ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం 12.30కు గచ్చిబౌలి విద్యుత్తు కార్యాలయంలో ఏడీఈ సతీశ్‌కు కాంట్రాక్టర్‌ డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులొచ్చి పట్టుకున్నారు. ఇంకో ఘటనలో.. ఓ భూమిని సర్వే చేసేందుకు లంచం తీసుకుంటూ రెవెన్యూ కమ్యూనిటీ కాంట్రాక్ట్‌ సర్వేయర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు.. శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేట తండాకు చెందిన ముడావత్‌ సాయిరామ్‌ అనే రైతుకు భూ సరిహద్దుల సమస్య ఉంది. తనకు చెందిన 8గుంటల భూమి మరొకరి కబ్జాలో ఉందని.. సర్వే చేయాలని సాయిరామ్‌ ఆరునెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే భూమి సర్వే చేసేందుకు సర్వేయర్‌ రవినాయక్‌ రూ.15వేలు డిమాండ్‌ చేయగా, రూ.12వేలు ఇస్తానని సాయిరామ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై సాయిరామ్‌ ఐదు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో సాయిరామ్‌ నుంచి రూ.12వేలు తీసుకున్న సర్వేయర్‌ రవిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 04:42 AM