Share News

BRS MLA Suspension: మాట.. మంట

ABN , Publish Date - Mar 14 , 2025 | 03:47 AM

సభ మీ ఒక్కరి సొంతం కాదు’ అంటూ.. నిండు సభలో అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు

BRS MLA Suspension: మాట.. మంట

విపక్ష ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

  • గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార, విపక్షాల వాగ్వాదం

  • ‘సభ మీ ఒక్కరి సొంతం కాదు’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్య

  • సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల

  • స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం

  • జగదీశ్‌ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

  • సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్‌

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి పంపాలని సభ నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘సభ మీ ఒక్కరి సొంతం కాదు’ అంటూ.. నిండు సభలో అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు! గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా గురువారం సభలో అధికార, విపక్షాల మధ్య జరిగిన వాగ్వాదంతో అసలే ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం.. జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది! ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. ఒక దశలో.. జగదీశ్‌రెడ్డిపై బహిష్కరణ వేటు వేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్యలపై చర్చించేందుకు ఈ అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేయాలని సభ నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసెంబ్లీలో తొలి సస్పెన్షన్‌ ఇదే. గురువారం సభ ప్రారంభం కాగానే విప్‌ ఆది శ్రీనివాస్‌.. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సమర్థించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసిందని.. పదేళ్ల విధ్వంసాలతో గాయపడ్డ తెలంగాణ ఇప్పుడు కోలుకుంటోందని ఆది శ్రీనివాస్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘కమీషన్‌ ఫర్‌ ఫోర్‌ మెంబర్స్‌’ అంటూ.. కేసీఆర్‌, కేటీఆర్‌ కవిత, హరీశ్‌ పేర్లను పరోక్షంగా ప్రస్తావించి, విమర్శించారు. ‘గవర్నర్‌ ప్రసంగం కూడా వినలేని ప్రతిపక్షం అవసరమా?’ అని ప్రజలు అనుకుంటున్నారని వేముల వీరేశం మండిపడ్డారు. వారి తర్వాత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు.


గవర్నర్‌ ప్రసంగంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ప్రసంగాన్ని తాము విన్నామని, ఇంటికి పుస్తకాలు కూడా తీసుకెళ్లి చదివామని.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, చాట్‌ జీపీటీ వినియోగించి ప్రసంగం తయారు చేసినట్లుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ ప్రసంగం ‘డ్రై’గా, విజన్‌ లేకుండా ఉందని.. దాన్ని మనసుపెట్టి తయారు చేయలేదని.. మనసు కవి ఆత్రేయ బతికుంటే ఈ ప్రసంగం చూసి, ఆత్మహత్య చేసుకునేవారని విమర్శించారు. ‘సభలో ఉండమంటే ఉంటాం... పొమ్మంటే పోతాం’ అని ఆగ్రహంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పందించారు. ‘‘గతంలో మంత్రిగా పనిచేశారు. అనుభవం ఉన్న వ్యక్తి మీరు. స్పీకర్‌ను బెదిరించే ధోరణి వద్దు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి’’ అని సూచించారు. శ్రీధర్‌బాబు మాటలకు జగదీశ్‌ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతుండడంతో స్పీకర్‌ జోక్యం చేసుకుని.. ‘‘జగదీశ్‌ రెడ్డిగారూ అసహనానికి గురికాకండి’’ అన్నారు. దీనికి జగదీశ్‌ రెడ్డి.. ‘‘మేమా?’’ అని ప్రశ్నించగా.. ‘‘మీరే’’ అన్నారు స్పీకర్‌. సహనంతో మాట్లాడి, సభా సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. దీనికి జగదీశ్‌ రెడ్డి.. తాను ఏ సభా సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో చెప్పాలన్నారు. అందుకు స్పీకర్‌.. ‘‘నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం’’ అని స్పష్టం చేశారు. ‘‘అసలే కాదు.. అసలే కాదు’’ అని జగదీశ్‌ రెడ్డి అనడంతో.. తనను ప్రశ్నించడమే సభాసంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్‌ మరోమారు తేల్చిచెప్పారు. అప్పుడు జగదీశ్‌రెడ్డి.. ‘‘ఈ సభ మన అందరిదీ, ఈ సభపై మనందరికీ సమాన హక్కులున్నాయి. మా అందరి తరఫునే మీరు పెద్దమనిషిగా అక్కడ కూర్చున్నారు తప్ప.. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు సభను అవమానించేలా ఉన్నాయని.. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని దుద్దిళ్ల అన్నారు. జగదీశ్‌రెడ్డి తాను మాట్లాడిన మాటల్లో ప్రతి పదాన్నీ వెనక్కి తీసుకుని సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


తప్పేముంది?

జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఆయన మాటల్లో ఏ తప్పూ లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సభలో అందరు సభ్యులకూ సమాన హక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. జగదీశ్‌ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఆ సమయంలో.. మాట్లాడేందుకు జగదీశ్‌రెడ్డికి స్పీకర్‌ అవకాశమిచ్చారు. అప్పుడు ఆయన.. కాంగ్రెస్‌ సభ్యుల నిరసన గురించి ప్రస్తావించి, సభను ఆర్డర్‌లో పెట్టాలని, అందరూ కూర్చుంటేనే తాను మాట్లాడతానని అన్నారు. సభాసంప్రదాయాలేంటో, స్పీకర్‌ హక్కులేమిటో, సభ్యుల హక్కులేమిటో తేలాలని వ్యాఖ్యానించారు. దీనికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌.. జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడారని, బీఆర్‌ఎస్‌ నేతలు తొలి నుంచీ దళిత జాతిపై చిన్నచూపుతో ఉన్నారని మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించిన జగదీశ్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యావత్‌ దళిత జాతికీ జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. ఇరుపక్షాల వాగ్వాదంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌ సభను 15నిమిషాలపాటు వాయిదా వేశారు. కానీ, మూడున్నర గంటల తర్వాత సభ ప్రారంభమైంది.


అవహేళన చేశారు.. అవమానించారు..

జగదీశ్‌ రెడ్డి సభాపతిని ఏకవచనంతో సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారని మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆయన ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేతలు గవర్నర్‌ను కాంగ్రెస్‌ కార్యకర్త అన్నారని.. ఇప్పుడు స్పీకర్‌ను ఏకవచనంతో ‘నీకు’ అని సంబోధించారని.. జగదీశ్‌రెడ్డి తీరు సభలో జుగుప్సాకరంగా ఉందని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. గిరిజన గవర్నర్‌, దళిత స్పీకర్‌ కావడంతోనే ఆయన అలా ప్రవర్తించారని, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఏమీ అనకపోయినా గత ప్రభుత్వం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ శాసనసభ సభ్యత్వాలను రద్దుచేసిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తుచేశారు. ఒక స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఇంతవరకూ తాను చూడలేదన్నారు. స్పీకర్‌ స్థాయిని తగ్గించి వ్యంగ్యంగా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి ఆయన్ను అవమానపరిచారని ఆవేదన వెలిబుచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. స్పీకర్‌ అధికారాల గురించి తెలుపుతూ సభాహక్కుల పుస్తకాన్ని చదివి వినిపించారు. స్పీకర్‌కు రాజ్యాంగం విశేషాధికారాలు కల్పించిందని.. సభ లోపల, బయట స్పీకర్‌కు వ్యతిరేకంగా మాట్లాడకూడదని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఆయన్ను తొలగించడంపై ఎథిక్స్‌ కమిటీలో చర్చిస్తామని.. ఈ సమావేశాలు జరిగేంతవరకూ సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని కోరారు. దీంతో ఈ సెషన్‌ ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్‌ చేస్తునట్టు స్పీకర్‌ ప్రకటించారు. సభ నుంచి వెంటనే వెళ్లిపోవాలని స్పీకర్‌ ఆదేశించడంతో జగదీశ్‌ రెడ్డి వెళ్లిపోయారు. స్పీకర్‌ నిర్ణయం అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే ముందు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - Mar 14 , 2025 | 03:47 AM