Revanth Reddy: విద్యార్థులకు వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:09 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ విద్యార్థులు కేంద్రంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాలి
విద్యార్థులే కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలి
ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారవద్దు
సమగ్ర మార్పులతో విధానపత్రం రూపొందించండి
వీసీలతో భేటీ, విద్యా కమిషన్ సమీక్షలో సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ విద్యార్థులు కేంద్రంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని, వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని అన్నారు. ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకొని ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్తున్నారని తెలిపారు. వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పలు యూనివర్సిటీల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆయా కోర్సులకు చెందిన ప్రొఫెసర్లకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాలన్నారు. యూనివర్సిటీలను కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చవద్దని అన్నారు. ఈ సందర్భంగా వీసీలకు తమ వర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాలు, ఇతర వసతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా.. వర్సిటీల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వీసీలంతా వర్సిటీలవారీ సమస్యలు, ఉమ్మడి సమస్యలపై ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో సమావేశమై చర్చించాలని, తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.
జీవన నైపుణ్యాలు పెంపొందించాలి
రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ ఏర్పాటు కోసం సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యావ్యవస్థ కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని ప్రకటించారు. అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై రూపొందించే విధాన పత్రం విషయంలో వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలని అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై శుక్రవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫారాల పంపిణీతోపాటు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, యంగ్‌ఇండియా స్కిల్ వర్సిటీల నిర్మాణాల గురించి సీఎం వివరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని, అదే సమయంలో ఆచరణ సాధ్యమయ్యేలా ఉండాలని సూచించారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది బలంగా పడుతుందని, ప్రాథమిక విద్యను బలోపేతం చేేస్త ఉన్నత చదువుల్లో విద్యార్థులు మెరుగ్గా రాణించగలరని పేర్కొన్నారు. కాగా, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యావ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీవన నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు.
సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుండగా... ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కాగా, భద్రాద్రి రాముడికి ముఖ్యమంత్రి అధికారికంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకే ఒక్క సారి జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే ఒక్కసారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నిరుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ... పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ముఖ్యమంత్రి సహా ఇతర ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు. దశాబ్దం తర్వాత సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ అధికారికంగా హాజరవుతున్నారు.
8న అహ్మదాబాద్‌కు సీఎం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశాల తొలిరోజు దాదాపు 169 మంది పాల్గొంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక రెండో రోజు ఈ నెల 9న ఏఐసీసీ సభ్యులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల మంత్రులు, సీనియర్ నేతలు కలిసి 1725 మందితో ఏఐసీసీ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల్లో గెలిచేందుకు ఐదేళ్లపాటు కష్టపడాలని డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఆరు నెలలు, ఏడాదిపాలు పనిచేస్తే సరిపోదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని, రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది డీసీసీ అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News