Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:07 AM
రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

చెల్లింపు ధర 10-15% పెంపు?
త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన!
టీజీబీసీఎల్‌కు నివేదికను సమర్పించిన కమిటీ
బోర్డు భేటీ.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత
సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం!
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్)కు ఇటీవలే సమర్పించింది. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. టీజీబీసీఎల్ బోర్డు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపై ప్రాథమికంగా చర్చించింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చేలోపు ఈ నివేదికను టీజీబీసీఎల్ ప్రభుత్వానికి అందించనుంది. ముఖ్యమంత్రి వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
వాస్తవానికి మద్యం తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను ఎక్పైజ్ చట్టం ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి సమీక్షించాల్సి ఉంటుంది. దీనికోసం టీజీబీసీఎల్ గతంలోనే త్రిసభ్య కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోపాటు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ సభ్యులుగా ఉన్నారు. మద్యం తయారీదారులకు చెల్లించాల్సిన ధరల పెంపుపై ఈ కమిటీ గత ఆరు నెలలుగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 51 మద్యం తయారీ కంపెనీలు ఉండగా.. త్రిసభ్య కమిటీ పలుమార్లు మద్యం తయారీదారులతో సమావేశమైంది. మద్యం ధరలపై వారి సూచనలు స్వీకరించింది.
మూడేళ్ల క్రితం 6శాతం పెంపు..
చివరిసారిగా మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం మద్యం తయారీదారులకు చెల్లించే మొత్తాన్ని 6శాతం పెంచింది. అయితే అప్పటితో పోలిస్తే.. ప్రస్తుతం పెరిగిన ముడిసరుకు ధరలు, ఉద్యోగుల జీతభత్యాలు, రవాణా.. ఇలా అన్ని ఖర్చులను కమిటీ సేకరించింది. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయనంటూ బీర్ల తయారీ కంపెనీ (యూబీ) ఈ నెల 8 నుంచి బీర్ల ఉత్పత్తులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇతర మద్యం తయారీ కంపెనీలు సైతం ధరలు పెంచాలంటూ కొద్ది నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. యూబీ నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్పైజ్ శాఖపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. పక్క రాష్ట్రాల మద్యం ధరలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ ఆ నివేదికను టీజీబీసీఎల్‌కు సమర్పించింది.