Khammam: కొమ్మా రెమ్మా కన్నీరు..
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:34 AM
శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతిచెందారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946 జూలై 1న రామయ్య జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే మొక్కలు నాటేవారు.

గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత
కోటికిపైగా మొక్కలు నాటి దేశ విదేశాల్లో ఖ్యాతి
ఖమ్మం, న్యూఢిల్లీ, అమరావతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి)/ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): అశోకుడు మొక్కలు నాటించాడనే సంగతి పుస్తకాలకే ఎందుకు పరిమితమవ్వాలి? ఆ చొరవను మనం ఆచరణలోనూ చూపలేమా? అనే గొప్ప సామాజిక స్పృహ ఆయనది! బొమ్మలతో ఆడుకునే ఐదేళ్ల ప్రాయంలో పచ్చదనం మీద ప్రేమతో మొక్కలు నాటారాయన! మొక్కలు నాటేందుకు ఖర్చుల కోసం కొంతభూమిని అమ్మేందుకూ వెనుకాడలేదాయన! పుటుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అని కాళోజీ అంటే.. బతుకంతా ప్రకృతి సేవలోనే గడిపి.. మొక్కలు నాటడాన్ని, వాటిని పరిరక్షించడాన్నే కర్తవ్యంగా భావించి.. ఏకంగా కోటికిపైగా మొక్కలు నాటి వనజీవిగా పేరొందిన దరిపల్లి రామయ్య (79) కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతిచెందారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946 జూలై 1న రామయ్య జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే మొక్కలు నాటేవారు. ముత్తగూడెంలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో పశువుల కాపరిగా మారారు. 1967లో జానమ్మను పెళ్లి చేసుకున్నారు. రామయ్య దంపతులకు కుమారులు సైదులు, సత్యనారాయణ, కనకయ్య, కూతురు సైదమ్మ ఉన్నారు. సైదులు, సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. రామయ్య కుటుంబానికి గతంలో ఏడెకరాల భూమి ఉండేది. మొక్కలు నాటేందుకు ఖర్చులకోసం మూడెకరాలను రామయ్య అమ్మారు. రహదారుల వెంట మొక్కలు నాటుతూ, రోడ్ల వెంట ఉన్న చెట్ల వద్ద కాయలు ఏరి వాటి నుంచి వచ్చిన గింజలను ఖాళీస్థలాలు, కొండలపై జల్లుతూ ఉండేవారు. ఎవరైనా మొక్కలు కావాలని ఆయన దగ్గరకు వెళితే ఉచితంగానే గింజలు, మొక్కలను అందించేవారు. పచ్చదనంపై విస్తృత ప్రచారం చేయడమే కాకుండా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం, ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ నినాదాలు రాయడం చేసేవారు. ఇంట్లో గిన్నెలు, పాత్రలు, బీరువాలు, గోడలు ఎక్కడైనా ప్రకృతికి సంబంధించిన నినాదాలే రాసేవారు. తన కుమారుడు, కూతురు పెళ్లిళ్ల శుభలేఖపై కూడా మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించాలని నినాదాలను ముద్రించారు.
అద్భుతమైన శిల్పి కూడా
‘‘వృక్షో రక్షతి రక్షితః’’ అనేది రామయ్య నమ్మిన నినాదం.. దాన్ని ఓ ఇనుప ప్లేట్‌పై రాసి మెడలో హారంగా వేసుకుని తిరిగేవారు. రామయ్య అద్బుతమైన శిల్పి కూడా. తన ఇంటి వద్ద గ్రానైట్ రాళ్లపై శిల్పాలను చెక్కేవారు. ఆ శిల్పాలపై కూడా వృక్షోరక్షతి రక్షితః అంటూ నినాదాలు చెక్కేవారు. 2000లో వనజీవి సేవలను గర్తించిన నాటి సీఎం చంద్రబాబు, ఆనాటి ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల.. రామయ్యకు బైక్ బహూకరించి, దాని పెట్రోలు ఖర్చులకు నెలకు రూ.1500 మంజూరు చేశారు. నాటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలోనూ రామయ్య పాలుపంచుకున్నారు. కాగా, రామయ్య కృషిని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతిలో రామయ్య జీవితాన్ని పాఠ్యాశంగా బోధిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఘికశాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశం పొందుపరిచింది. రామయ్య మొక్కలపై ఉన్న ప్రేమతో తన నలుగురు మనవరాళ్లకు కబంద పుష్పం, చందన పుష్పం, వనశ్రీ, హరితారణ్య అనే పేర్లు పెట్టి మొక్కలపై తనకున్న ప్రేమను చాటారు. అయితే కరెన్సీ నోట్లపై మొక్కల ఫొటోలను ముద్రించాలని, గ్రీన్ కరెన్సీ రావాలని రామయ్య కోరుకునేవారు. ప్రభుత్వాల పెద్దలను కలిసినప్పుడు వారికి ఈ విషయాలనే చెప్పేవారు. కాగా, రామయ్య ప్రధానమంత్రులు, పలువురు ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు పొందారు. నాటి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సత్కారాలు పొందారు. 2013 ఏప్రిల్ 8న బెంగుళూరుకి చెందిన అకాడమీ ఆఫ్ యూనవర్సల్ గ్లోబల్ పీన్ అనే సంస్థ వారు వనజీవి రామయ్యకు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి ఏపీలో సీఎంలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, నాటి గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే చేతుల మీదుగా రామయ్య ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. 2018లో మంత్రి తుమ్మల స్వయంగా రామయ్య ఇంటిక వెళ్లి డబుల్‌బెడ్రూం ఇల్లు కట్టించి ఇచ్చారు.
సుస్థిరత గళం వినిపించిన వ్యక్తి రామయ్య: మోదీ
లక్షల సంఖ్యలో చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి దరిపల్లి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన అవిశ్రాంత కృషి.. ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయన్నారు.సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు. రామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామయ్య మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
సమాజానికి తీరని లోటు: సీఎం రేవంత్
రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవాళికి మనుగడ లేదనే సిద్థాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి దరిపల్లి రామయ్య అని, ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. రామయ్య మృతి బాధాకరమని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి చింతించానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తెలిపారు.
ధరిత్రి ముద్దుబిడ్డ వనజీవి రామయ్య: తుమ్మల
పర్యావరణ ప్రేమికుడిగా మొక్కలే ప్రాణంగా జీవించిన మహోన్నత వ్యక్తి, ధరిత్రి ముద్దుబిడ్డ వనజీవి రామయ్య మృతి దేశానికి తీరనిలోటు అని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తుమ్మల హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి రామయ్య మృతదేహాంపై పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తంచేశారు. రామ య్య మరణం దేశానికి, రాష్ట్రానికి తీరనిలోటు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. రామయ్య అకాల మృతి ప్రకృతి ప్రేమికులకు తీరనిలోటు అని, ఆయన పర్యావరణ పరిరక్షణలో స్ఫూర్తి నింపిన మహానీయుడు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రామయ్య మృతిపట్ల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News