Kiran Kumar Reddy: రేవంత్‌పై కుట్ర.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 07 , 2025 | 01:47 PM
Kiran Kumar Reddy: ప్రపంచ తెలుగు మహాసభలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వేడుకలో చోటుచేసుకున్న చిన్నపాటి తప్పిదం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ యాంకర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును తప్పుగా కిరణ్ కుమార్ రెడ్డి అని పలికారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవడయ్యా ఆ తెలుగు మహాసభలు పెట్టింది. తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా? ముఖ్యమంత్రే తెలవని వాళ్లు యాంకర్ అవుతారా? యాంకరింగ్ చేసే వ్యక్తికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో కూడా తెలియదా..అసలు ఆ యాంకర్‌కు తెలుగు వచ్చా’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏదైనా పెద్ద కార్యక్రమం నిర్వహించే ముందు నిర్వాహకులు అన్ని చూసుకోని నిర్వాహించాలి కానీ ఇలాంటి తప్పిదాలు ఎలా చేస్తారని నిలదీశారు. ఇలాంటి పొరపాటు ఎలా చేస్తారని మండిపడ్డారు. తాను ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే ముందు అన్ని సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటానని.. ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా పేపర్ మీద రాసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి సీఎం పేరు ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సభలకు మెదటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. చివరి రోజున ఈ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే.
Updated Date - Jan 07 , 2025 | 02:14 PM