Political Leaders on Budget: కేంద్ర బడ్జెట్‌పై నేతల రియాక్షన్ ఎలా ఉందంటే...
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:11 PM
Political Leaders: కేంద్ర వార్షిక బడ్జెట్ 2025పై రాష్ట్ర నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు.. బడ్జెట్‌పై తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రానికి చెందిన పలు పార్టీల నేతలు స్పందించారు. ఒక్కో నేత ఒక్కో విధంగా బడ్జెట్‌కు సంబంధించి మాట్లాడారు. బీజేపీ నేతలు బడ్జెట్ అద్భుతమని కొనియాడగా, బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణకు మరోసారి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు అయితే బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ బడ్జెట్ బీహార్, ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టినట్టు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై నేతలు ఏ విధంగా స్పందించారో ఇప్పుడు తెలుసుకుందాం.
వారిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్: మల్లు రవి
ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బడ్జెట్ తయారు చేసినట్టు ఉందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఐదు సార్లు బడ్జెట్‌లో బీహార్ అంశాలను ప్రస్తావించారన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ అంశం కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడ లేదని తెలిపారు. విభజన హామీలు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి చెప్పలేదని.. ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని.. నిరుద్యోగం అంశాన్ని ఎక్కడ కూడా చెప్పలేదన్నారు. నిత్యావసర వస్తువుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మోదీ ఎక్కడా ఇప్పుడు ఆ అంశాన్ని చెప్పలేదని విమర్శించారు. రైతులు, పేద వారి గురించి ఎక్కడా మాట్లాడలేదని ఎంపీ మల్లు రవి అన్నారు.
రైతులు ఉన్నది ఏడు కోట్లేనా: ఎంపీ రామసహాయం రఘురాం
ఈ బడ్జెట్ ఢిల్లీ, బీహార్ ఎన్నికల రాష్ట్రం కొరకు పెట్టినట్టుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. బీహార్ రాష్టానికి మకాన బోర్డు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారని.. తెలంగాణకు ఎప్పటి నుంచో రెండో ఎయిర్ పోర్ట్ అడిగామని గుర్తుచేశారు. రాష్టానికి బడ్జెట్‌లో ఇచ్చింది అంటూ ఏమి లేదన్నారు. దేశంలో 7 కోట్ల మంది మాత్రమే రైతులు ఉన్నారా అందరికీ ఎందుకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణలో భద్రాచలంకు నిధులు ఎందుకు ఇవ్వరని ఎంపీ ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు: ఎంపీ కిరణ్ కుమార్
ఈ బడ్జెట్ బీహార్, ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టినట్టు ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉడాన్ స్కీమ్ కింద ఎయిర్ పోర్టులు పెంచుతామని అంటున్నారని.. విమానం టిక్కెట్లపై నియంత్రణ ఉండాలని.. అది లేకుండా ఎయిర్ పోర్టులు పెంచుతామని అంటున్నారన్నారు. ఢిల్లీ గద్దెను దక్కించుకునే ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపించిందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. తెలంగాణ చాలా కీలకమైన రాష్ట్రం తెలంగాణ నుంచి కేంద్రానికి నిధులు ఎక్కవగా వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్రంలో అందరి మంత్రులను కలిసి తెలంగాణకు ప్రాముఖ్యత కల్పించాలని కోరారన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అనే ఆలోచన నుంచి బయటకు రావాలని.. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అని తెలిపారు. గుజరాత్ వ్యాపారస్తులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు.
అట్టర్ ఫ్లాప్ బడ్జెట్: ఎంపీ వంశీ
కేంద్ర బడ్జెట్ అట్టర్ ప్లాప్ బడ్జెట్ అని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అన్నారు. రాజకీయం కొరకు బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బడ్జెట్‌లో నిర్లక్ష్యం చేశారని.. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తాము ఎన్నో డిమాండ్లు, ప్రతిపాదనలు పెట్టామన్నారు. చాలా బాధాకరంగా ఉందన్నారు. యువత ఉద్యోగ, ఉపాధి లేకుండా కష్టపడుతున్నారన్నారు. అంబానీ, అదానికి కొత్త కొత్త బిజినెస్‌లు దక్కే విధంగా కనిపిస్తున్నాయన్నారు. సింగరేణికి సోలార్ ప్రాజెక్టు, క్లీన్ టెక్ ఎన్నో ప్రతిపాదనలు తాము ఆర్థిక మంత్రికి గతంలో ఇచ్చామని తెలిపారు. దళితులకు పన్నుల్లో ప్రత్యేక రాయితీ ఇవ్వాలని ఎంపీ గడ్డం వంశీ డిమాండ్ చేశారు.
ఇది డ్రీమ్ బడ్జెట్: కిషన్ రెడ్డి
పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. వ్యక్తిగత ఇన్ కమ్ టాక్స్ పరిధిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయమని తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, చిన్న పరిశ్రమలకు బడ్జెట్ ఆపన్నహస్తాన్ని అందించిందన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది అని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు నిధులను పెంచడం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు కేంద్రమంత్రి.
ఇది అద్భుతమైన బడ్జెట్: బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అని తెలిపారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవుతుందన్నారు. గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇది అంటూ బండి సంజయ్ అన్నారు.
దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లుగా బడ్జెట్: హరీష్ రావు
2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమన్నారు. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటోందని కేంద్ర ప్రభుత్వం అంటూ హరీష్ వ్యాఖ్యలు చేశారు.
పేరుకే తెలుగు పడుచు.. కానీ: జగ్గారెడ్డి
కేంద్ర ప్రభుత్వం పెట్టిన 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారని... కానీ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి కేటాయింపులు లేవని కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ నుంచి ప్రజలు కట్టే పన్నులు ఏడాదికి లక్ష కోట్లు అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోవడంతో ఒక ప్రశ్నగా మిగిలిపోయారన్నారు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించారని.. దీంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారని తెలిపారు. నిర్మలా సీతారామన్...పేరుకే తెలుగు ఆడపడుచు అని.. తెలంగాణకు ప్రత్యేక నిధి కేటాయించకోవడం ఆమె రాజకీయ బలహీనురాలిగా భావిస్తున్నామన్నారు. అందుకే తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ బడ్జెట్‌లా లేదని.. బీహార్ ఎన్నికల బడ్జెట్‌గా కనపడుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పండుగ లాంటి వార్త.. 12 లక్షల వరకు నో ట్యాక్స్
కొత్త పన్నులు.. నెలకు మిగిలేది ఎంతంటే..
Read Latest Telangna News And Telugu News