Share News

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 06:46 PM

Water Conflict: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తోంది. ఆ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
TG Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 06: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజూ రోజుకు తీవ్రతరమవుతోంది. అలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా తెలంగాణకు నీటి విషయంలో జరుగుతోన్న అన్యాయంపై కృష్ణా ట్రిట్యునల్‌లో వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌కు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధలో న్యాయ నిపుణులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై.. ఆ యా అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా, ఏపీతో వివాదాలపై సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలపై ఈ సమావేశం వేదికగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఈ అంశంపై ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణలో ప్రస్తావించాల్సిన అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వైద్య నాథన్ వివరించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండుగా విడిపోయి దశాబ్దం దాటింది. విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. నీటి వివాదాలు మాత్రం ఈ ఇరు రాష్ట్రల మధ్య తరచూ చోటు చేసుకొంటున్నాయి. కృష్ణా, గోదావరి జలాలు.. వాడుకోవాల్సిన వాటి కంటే.. అధికంగా ఏపీ వాడేసుకొంటుందంటూ తెలంగాణ ఆరోపిస్తుంది.


ఈ అంశంపై పలుమార్లు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు వివిధ సందర్భాల్లో సమావేశాలు నిర్వహించి.. చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రల మధ్య నీటి వాటా కోసం.. కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ అంశంపై ఈ ఏడాది మూడో వారంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వినిపించాల్సిన వాదనలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో పలు కీలక విషయాలను చర్చించనట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

For Telangana News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 06:47 PM