Share News

NIMS Research: పాతికేళ్లకే కిడ్నీలు కుదేలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:47 AM

రాష్ట్రంలో పట్టుమని పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50-60 ఏళ్ల వయసులో ఆస్పత్రులకు వెళ్లేవారు.

NIMS Research: పాతికేళ్లకే  కిడ్నీలు కుదేలు

  • యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు

  • గతంలో 50 ఏళ్లు దాటాకే సమస్యలు..

  • ఇప్పుడు 20 దాటిన వారిలోనూ..!

  • మగవారిలో ఐజీఏ నెఫ్రోపతి.. ఆడవారిలో

  • లూపస్‌ నెఫ్రోటిస్‌.. నిమ్స్‌ పరిశోధనలో వెల్లడి

  • పదేళ్లలో లక్షకు పైగా డయాలసిస్‌ కేసులు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టుమని పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50-60 ఏళ్ల వయసులో ఆస్పత్రులకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు 20-30 ఏళ్ల వారు ఈ సమస్యతో ఎక్కువగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిమ్స్‌ ఆస్పత్రి చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కిడ్నీలు విఫలమవడం, క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సీకేడీ)పై నిమ్స్‌ ఆస్పత్రి పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధన చేస్తోంది. పదేళ్ల క్రితం మూత్ర పిండాల సమస్యలతో బాధపడే కేసులు నెలకు సగటున 5-10 వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 50కు పైగానే ఉంటున్నట్లు నిమ్స్‌ రిసెర్చ్‌ చెబుతోంది. ఇక ఏటా కొత్తగా రక్తశుద్ధి (డయాలసిస్‌) అవసరమయ్యే వారి సంఖ్య 3500 వరకు ఉంటున్నట్లు పేర్కొంది.


బీపీ,షుగర్‌.. నొప్పి నివారణ మందులతో

మారుతున్న జీవనశైలితో ఎక్కువ మంది అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం బారినపడుతున్నారు. మధుమేహం సోకి, సరిగా మందులు వాడని వారిలో మూడు నాలుగేళ్లకే కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వైద్యులు చెబుతున్నారు. షుగర్‌ సోకినా, ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడంతో తమకేం కాదన్న భావనతో నిర్లక్ష్యం చేస్తున్నారని, చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీవ్రమైన పని ఒత్తిడుల కారణంగా బీపీ, షుగర్‌ బారిన పడి, కిడ్నీలు పాడు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక పల్లెల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండడంతో నొప్పులు తగ్గించే మాత్రలు ఎక్కువగా వాడుతున్నారని.. దీర్ఘకాలంలో అవి కిడ్నీలను దెబ్బ తీస్తున్నాయని నిమ్స్‌ నెఫ్రాలజిస్ట్‌ తాడూరి గంగాధర్‌ తెలిపారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా సీకేడీ, కిడ్నీ ఫెయిల్యూర్‌ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆడవారిలో కంటే మగవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నట్లు డయాలసిస్‌ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 20-30 ఏళ్ల పురుషుల్లో ఇటీవల కాలంలో ఐజీఏ నెఫ్రోఫతి కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఐజీఏ నెఫ్రోఫతి ఒక రకమైన మూత్రపిండ వ్యాధి. కిడ్నీల్లో యాంటీబాడీలు ఏర్పడి మూత్రపిండాల్లో ఉండే చిన్నచిన్న ఫిల్టర్ల (గ్లోమెరులి)కు నష్టం కలిగిస్తాయి. ఫిల్టర్లు సాధారణంగా రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని వడపోసి మూత్రాశయానికి పంపుతాయి. ఐజీఏ ప్రొటీన్‌ ఈ వడపోతను నిరోధిస్తుంది. దాంతో కిడ్నీ జబ్బులు, కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఇక మహిళల్లో లూపస్‌ నెఫ్రోసిస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఒక ఆటో ఇమ్యూనో వ్యాధి. మన శరీర కణాలు, అవయవాలపై రోగనిరోధక వ్యవస్థనే దాడి చేస్తుంది. లూపస్‌ వల్ల కలిగే మూత్రపిండ వ్యాధి కాలక్రమేణా తీవ్రమవుతుంది. కిడ్నీ వైఫల్యానికి దారి తీస్తుందని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు. లూపస్‌ నెఫ్రోటిస్‌ వల్ల ఆడవారిలో మూత్రంలో ఎక్కువగా ప్రొటీన్‌ పోతుందని, జట్టు రాలిపోవడం, శరీరమంతా వాచినట్లుగా లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న వారికి అవయవ మార్పిడి తప్పనిసరి. మూత్రపిండాలు అందుబాటులో లేకుంటే రక్తశుద్ధి ఒక్కటే మార్గం. తెలంగాణలో 2013-24 మధ్య కాలంలో 2235 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. కిడ్నీ కోసం జీవన్‌దాన్‌లో 7796 మంది రిజిష్ట్రేషన్‌ చేసుకొని, ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో 5436 మంది బాధితులు డయాలసిస్‌ చేసుకుంటుండగా.. 2024 నాటికి ఈ సంఖ్య 1,11,121కు చేరింది. ఇక డయాలసిస్‌ బాధితులు ఏటా 2 వేల మంది వరకు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పదేళ్లలో డయాలసిస్‌ కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1076 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 108 రక్తశుద్ధి కేంద్రాలున్నాయి. వాటిలో 730 డయాలసిస్‌ పరికరాలున్నాయి. 2014 నుంచి నేటి వరకు మొత్తం 75 లక్షల డయాలసిస్‌ సెషన్స్‌ చేసినట్లు ఆరోగ్య శ్రీ గణాంకాలు చెబుతున్నాయి.


పిల్లల్లోనూ కేసులు పెరుగుతున్నాయి

కిడ్నీ జబ్బుల్లో పెద్ద మార్పు వచ్చింది. పిల్లల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. నెలలు నిండకుండా పుట్టడం, కిడ్నీ ఆకారంలో తేడాలుండడం, జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లల్లో సీకేడీ, కిడ్నీ ఫెయిల్యూర్‌ కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. జీవనశైలి ఒత్తిడి కారణంగా పాతికేళ్లకే బీపీ, షుగర్‌ బారిన పడి బాధితులుగా మారుతున్నారు. పెరుగుతున్న కిడ్నీ జబ్బుల తీరుపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి నిమ్స్‌ పరిశోధన చేస్తోంది. కిడ్నీ జబ్బులకు ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రోగాన్ని పూర్తిగా నయం చేసే పరిస్థితి లేదు. మందులు రోగి జీవితకాలాన్ని పెంచుతాయు.

- డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు, నెఫ్రాలజిస్టు, నిమ్స్‌ ఆస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి:

Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు

Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..

Updated Date - Mar 12 , 2025 | 04:47 AM