Share News

భవిత కేంద్రాలకు భరోసా

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:51 AM

భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల స్థాయి చిన్నారులకు భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీ (ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌) బోధన అందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో సరైన సౌకార్యలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

భవిత కేంద్రాలకు భరోసా

జగిత్యాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల స్థాయి చిన్నారులకు భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీ (ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌) బోధన అందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో సరైన సౌకార్యలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భవిత కేంద్రాలకు భరోసా కల్పిస్తూ నిధులు విడుదల చేసింది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురిలో భవిత కేంద్రాలు ఉండగా సొంత భవనాలు కలిగిన మూడు కేంద్రాలకు వివిధ పరికరాలు, సామగ్రి కొనుగోలు ఒక్కో కేంద్రానికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 6 లక్షలు మంజూరు చేస్తూ...సమగ్రశిక్షా ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. సుమారు పదేళ్ల తరువాత భవిత కేంద్రాలకు నిధులు కేటాయించడంతో విద్యార్థుల సమస్యలు తీరుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

- ప్రత్యేక కమిటీ ద్వారా..

జిల్లా వ్యాప్తంగా సుమారు 2,100 మందికిపైగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్నట్లు అంచనా ఉంది. ఒక్కో భవిత కేంద్రం 20 నుంచి 30 మంది చొప్పున చిన్నారులకు ఐఈఆర్‌పీలు రోజూ ఫిజియోథెరఫీ చేసి ఆటాపాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. కేంద్రాలు లేని చోట నాన్‌ ఐఈఆర్‌సీ కేంద్రాల్లో విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పాత భవిత కేంద్రాలకు మంజూరైన నిధులతో ప్రత్యేక కమిటీ ద్వారా సౌకర్యాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఎంఈవో, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు, భవిత కేంద్రం అనుసంధానంగా ఉన్న ప్రధానోపాధ్యాయుల నేతృత్వం లో వీటిని సమకూర్చనున్నారు.

- 115 రకాల సామగ్రి అందుబాటులోకి...

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వచ్చిన నిధులతో 115 రకాల సామగ్రి అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనోపకరణాలు, ఐఈఆర్‌పీలకు కుర్చీలు, చికిత్స అందించే బల్లలు, మసాజ్‌ బాల్‌, డంబెల్స్‌, రౌండ్‌ టేబుల్‌, బీరువాలు తదితర సామగ్రిని అందిస్తారు. వీటి కొనుగోలు, వినియోగంపై మార్గనిర్దేశం చేశారు. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధన, చికిత్స అందిస్తారు.

- ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోక..

సమగ్ర శిక్షలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఐఈఆర్‌పీ (ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌పర్సన్‌)లు తమ పోస్టుల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూపులతో గడుపుతున్నారు. ప్రభుత్వ భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు పాఠాలు బోదిస్తూ ముందుకెళ్తున్న సంబంధిత ప్రత్యేక ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భవిత కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న 996 మంది ఐఈఆర్‌పీ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒక్కరు, కొన్ని చోట్ల ఇద్దరు చొప్పున 28 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్పెషల్‌ బీఈడీ, డీఈడీ అర్హత కలిగిన వీరిని ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా పోటీ పరీక్ష రాసి రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ పద్ధతిలో అప్పటి ప్రభుత్వం నియమించింది. రూ. 19,350 జీతంతో వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని అర్హతలున్నా ప్రభుత్వం క్రమబద్ధీకరించడం లేదని వారు వాపోతున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన పాఠ్యపుస్తకాలు, ఆట బొమ్మలు, వివిధ రకాల వస్తువులతో భవిత కేంద్రాల్లో బోధిస్తున్న వీరి భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో సుమారు 30 వేలమందికి పైగా ప్రత్యేకావసరాలు గల దివ్యాంగ చిన్నారులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వైకల్యంతో బాధపడేవారికి రెగ్యులర్‌ టీచర్లు బోధించే పాఠాలు సరిపోవు. వీరికి సుశిక్షితులైన టీచర్లే బోధించాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. 10 మంది విద్యార్థులుంటే ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని సూచించింది.

విద్యార్థులకు ఎంతో మేలు..

- మహేశ్‌, భవిత జిల్లా కోఆర్డినేటర్‌

ప్రభుత్వం సమగ్ర శిక్షా నుంచి భవిత కేంద్రాలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమయ్యే బోధనోపకరణాలు అందుబాటులోకి తీసుకొస్తాము. తద్వారా విద్యానైపుణ్యాల పెంపొందించడంతో ప్రత్యేక విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రత్యేక ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి

- ఎం రాజబాబు, ప్రత్యేక ఉపాధ్యాయుడు, భవిత కేంద్రం, జగిత్యాల

దివ్యాంగ పిల్లలను విద్యాబోధన చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించింది. భవిత కేంద్రంలో ఆటాపాటలతో ఏళ్ల తరబడి విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వం మమ్మల్ని క్రమబద్ధీకరించడం లేదు. ఇరవై ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా రెగ్యులరైజ్‌ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము.

Updated Date - Mar 16 , 2025 | 12:51 AM