మండుతున్న ఎండలు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:06 AM
ఎండలు ముందుగానే సుర్రుమనిపిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు భగ్గుమంటుండడంతో మధ్యాహ్నం వేళల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం ఎండ తీవ్రతో జిల్లా కేంద్రంలోని ప్రధాన జన సంచార ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట)
ఎండలు ముందుగానే సుర్రుమనిపిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు భగ్గుమంటుండడంతో మధ్యాహ్నం వేళల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం ఎండ తీవ్రతో జిల్లా కేంద్రంలోని ప్రధాన జన సంచార ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా నమోదైంది. తంగళ్లపల్లి మండలంలో గరిష్ఠ ఉష్రోగ్రత 40.5 డీగ్రీలు నమోదు కాగా, కోనరావుపేట, చందుర్తి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండలాల్లో 40.3 డీగీల్రు, వేములవాడ రూరల్, వీర్నపల్లి, సిరిసిల్లలో 40.1 డిగ్రీలు, ముస్తాబాద్, వేములవాడ 39.9డిగ్రీలు, గంభీరావుపేట, రుద్రంగిలో 38.7 డీగ్రీలు, ఎల్లారెడ్డిపేటలో 38.5 డీగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ఈసారి పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మట్టికుండలపై ఆసక్తి..
సూర్యుడు ఈసారి ఇప్పుడు మార్చిలోనే భగ్గుమంటుండడంతో ఎండ దాహాన్ని తీర్చుకోవడానికి మట్టి రంజన్లను ఆశ్రయిస్తున్నారు. పేదవాడి ఫ్రిజ్‌గా పేరొందిన ఆదిలాబాద్ రంజన్లకు పోటీగా ఈసారి గుజరాత్ రాజస్థాన్‌ల నుంచి ఎక్కువగా రంజన్లు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన రంజన్లకు నల్లాలతో పాటు రకరకాల డిజైన్లు ఉండడం, ధర అందుబాటులోనే ఉన్నాయి. సిరామిక్ రంజన్లు నీటి చల్లదనం ఎక్కువగా ఉంటుందని భావించి కొనుగోలు చేస్తున్నారు.
పండ్లు, శీతలపానీయాలకు డిమాండ్..
మార్చి మాసంలోనే మండే ఎండలకు జనం విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు పండ్లు, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. వేడిమి నుంచి రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎండ తాపాన్ని తట్టుకునేందుకు ఆయా గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. చల్లని నీటి కోసం ఇళ్లలో నీటి బాటిళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారు. తలకు టోపీలు, ముఖానికి తెల్లని చేతిరుమాళ్లు కట్టుకోవడం, మహిళలు ముఖానికి చేతులను కప్పే దుస్తులు ధరించకుండా బయటకు వెళ్లడం లేదు. ప్రజలు నీడ, చల్లని గాలి, శీతల పానీయాల కోసం వెతుకుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో శీతలపానీయాలు, కొబ్బరి బొండాలు దుకాణాలు వెలిశాయి. ప్రజలు, వాహనదారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బొండాల దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. చల్లదనం ఇచ్చే పుచ్ఛకాయలు, కొబ్బరి బొండాలు, దోసకాయలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీంలకు గిరాకీ భలే పెరిగింది. ఖర్చులకు వెరవకుండా వేసవిలో సేదదీరడానికి అందుబాటులో ఉండే సదుపాయాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
బయటికి వెళితే జాగ్రత్త..
- ప్రదీప్, సీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యుడు, ఎల్లారెడ్డిపేట
ఎండలో ఎక్కువసేపు పనిచేయకూడదు. ఒకవేళ తప్పనిసరైతే ఎక్కువ నీటిని తాగాలి. నెత్తిన టోపీ ధరించాలి. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎండలో తిరిగేటప్పుడు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఒత్తిడికి గురి కాకుండా పనిచేయాలి. వడదెబ్బ బారిన పడినవారు గ్లూకోజ్, ఎలక్ర్టోల్ ఓఆర్‌ఎస్‌ను నీటిలో కలిపి తరచూ తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. ప్రాథమిక చికిత్సలో భాగంగా చల్లని నీటితో శరీరాన్ని తుడవడం, చిటికెడు ఉప్పు, చెంచా పంచదార కలిపిన నీటిని తాగి దగ్గరలోని ఆసుపత్రిని సంప్రదించాలి.