Share News

నేటి నుంచి శివకళ్యాణోత్సవం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:09 AM

రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం నుంచిశివకల్యాణ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి శివకళ్యాణోత్సవం

వేములవాడ కల్చరల్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం నుంచిశివకల్యాణ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీపార్వతి పరమేశ్వరుల కల్యాణం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే రాజన్న క్షేత్రంలో మాత్రం గత 60 యేళ్లుగా అనాదిగా వస్తున్న సంప్రదాయంతో శివమహాపురాణం, లింగపురాణం ఆధారంగా మన్మథుడి దహనంతో ఉత్సవాలు పూర్తి అయిన తరువాత శ్రీపార్వతి పరమేశ్వరుల కల్యాణ వేడుకలు ప్రారంభమవుతాయని అర్చకులు వివరించారు. దీంతో ఈనెల 16వ తేది నుంచి 20వ తేది వరకు రాజన్న ఆలయంలో అంగరంగా వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం రాజన్న కల్యాణం..

శివకల్యాణ వేడుకల్లో భాగంగా ఈనెల 17వ తేదిన సోమవారం రోజున ఉదయం 10.40 గంటల నుంచి 12.55 గంటల వరకు రాజన్న ఆలయ ఆవరణలోని గెస్ట్‌ హౌస్‌ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కల్యాణ వైభవాన్ని నిర్వహిస్తారు. 19వ తేది బుధవారం సాయంత్రం 3.05 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండవగా నిర్వహించనున్నారు. 20వ తేది గురువారం రోజున ఉదయం పూర్ణహుతి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాంత సేవ పూజా కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి.

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు..

రాజన్న ఆలయంలో నిర్వహించే శివకళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేశామని, భక్తుల సౌకర్యార్థం గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నామని, వేసవి కాలం కావడంతో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 16 , 2025 | 01:09 AM