కమనీయం.. రమణీయం
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:10 AM
మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది.

ఇల్లందకుంట, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. యాజ్ఞికులు శేషం సీతారామాచార్యులు, ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట కార్యక్రమం చేశారు. లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లెకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 10:30కు ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అర్చకులు మధ్యాహ్నం 12:04గంటలకు జీలకర బెల్లం పెట్టి 12:18గంటలకు సీతమ్మ మెడలో రామచంద్రమూర్తి మాంగళ్యధారణ చేశారు.
భక్తులకు ఉచిత సేవలు....
జమ్మికుంట కాటన్, రా రైస్, పారాబాయిల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణానికి హాజరైన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో జమ్మికుంట నుంచి ఇల్లందకుంట వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సౌజన్యంతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వొడితెల ప్రణవ్ ప్రారంభించారు. పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ తులసిదాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.
ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు...
భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారి కల్యాణానికి రావడంతో కల్యాణ మండపంలో రెండు ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయిని సుప్రియ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్, ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, హుజూరాబాద్ ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్ రాణి ఏర్పాట్లు చేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 40వేల మంది భక్తులు హాజరయ్యారు.
ప్రముఖుల హాజరు.....
శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణానికి జాయింట్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో పుల్లయ్య, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ హాజరయ్యారు.
సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్తు
ఇల్లందకుంట సీతారాముల కల్యాణ మహోత్సవానికి సుమారు 250మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్ ఆలం అన్నారు. ఆదివారం ఉదయం కల్యాణ మండపం, వీఐపీ గ్యాలరీలను హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కల్యాణ మండపంకు వెళ్లే ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన డీఎఫ్‌ఎండీలు, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరుపున అవసరమైన అన్ని భద్రత చర్యలు చేపట్టామన్నారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీ పర్యవేక్షణలో రూరల్ సీఐ కోరె కిశోర్, ఎస్‌ఐలు రాజకుమార్, తోట తిరుపతితోపాటు నలుగురు సీఐలు, 8మంది ఎస్‌ఐలు, 250మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.