Share News

కమనీయం.. రామయ్య కల్యాణం..

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:05 AM

జనసంద్రమైన వేములవాడ రాజన్న క్షేత్రం భక్తిభావంతో ఉప్పొంగింది.

కమనీయం.. రామయ్య కల్యాణం..

వేములవాడ కల్చరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జనసంద్రమైన వేములవాడ రాజన్న క్షేత్రం భక్తిభావంతో ఉప్పొంగింది. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్ర్తోక్తంగా కన్నుల పండువలా నిర్వహించారు. రాజన్న సన్నిధిలో నిర్వహించిన రామయ్య కల్యాణ తంతును కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. రాజన్న ఆలయంలో శ్రీరామనవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీరాజరాజేశ్వరస్వామి వారితో పాటుగా శ్రీసీతారామచంద్రస్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వారలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలోని మూలవిరాట్టు మూర్తులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాల, కోలాటాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు. శ్రీసీతారామచంద్ర స్వామివార్ల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరిపించారు. రాచంద్రస్వామి గొప్పతనాన్ని వర్ణిస్తూ, సీతమ్మతల్లి అణకువను వివరిస్తూ కల్యాణతంతు అంగరంగవైభవంగా సాగింది. కాగా సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శ్రీసీతారాముల కల్యాణఘట్టం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది.

పట్టు వస్ర్తాలు సమర్పించిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే శ్రీసీతారామంచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌-వనజ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీస్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో, పాడిపంటలతో కాలకాలం వర్థిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు కళకళలాడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. స్వామివారికి రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌లు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ తరపున బీజేపీ నాయకులు పట్టువస్ర్తాలను సమర్పించారు. కాగా ఎస్పీ మహేష్‌ బి. గితే దర్శించుకోగా ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి స్వామివార్లకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఏనుగు మనోహర్‌రెడ్డి, నాగం కుమార్‌, రొండి రాజు, కనికరపు రాకేష్‌తో పాటుగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శ్రీస్వామి వారిని దర్శించుకుని తరించారు.

భారీగా తరలివచ్చిన భక్తులు..

వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీసీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి భక్తులు తరలివచ్చి రాజన్న ఆలయ వసతి గదులతో పాటుగా ఆలయ ఆవరణలో విడిది చేశారు. సుమారుగా 50 వేలకు పైగా భక్తులు రాజన్న ఆలయానికి తరలివచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చల్లని నీటిని, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. భక్తులు వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. దీంతో రాజన్న ఆలయ ప్రాంగాణం, ఆవరణతో పాటుగా పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో భక్తులు శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారిని పెళ్లాడిన హిజ్రాలు..

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన సీతారామచంద్ర స్వామి దివ్య కల్యాణమహోత్సవానికి పెద్ద సంఖ్యలో ధారణ చేసుకున్న శివపార్వతులతో పాటుగా హిజ్రాలు తరలించ్చారు. అర్చకులు స్వామివారి కల్యాణ తంతు జరుపుతున్న సమయంలో శివపార్వతులు, హిజ్రాలు ఒకరిపై ఒకరు జిలకర్రబెల్లం పెడుతూ, మంగళాసూత్రాన్ని మెడలో కట్టుకుంటూ తలంబ్రాలు చల్లుకుంటూ శ్రీస్వామి వారిని మనువాడినట్లు స్మరించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 01:05 AM