రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:35 AM
రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన వరి ధాన్యం మొత్తం ప్రభుత్వం మద్దతు ధరతో కనుగోలు చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన వరి ధాన్యం మొత్తం ప్రభుత్వం మద్దతు ధరతో కనుగోలు చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దాదాపు పదేళ్ల పాటు తాలు పేరిట క్వింటాల్‌కు నాలుగు కిలోల చొప్పున కట్ చేసిన విధంగా తమ ప్రభుత్వ హయాంలో రైతన్నలను ఎలాంటి ఇబ్బందులు పెట్టడంలేదన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరలో ప్రభుత్వం కొనుగోలు చేసి వారి అకౌంట్లలో డబ్బులు వేస్తామదన్నారు. సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధరతోపాటు ఐదు వందల రుపాయలు బోనస్ ఇచ్చి మరింతగా ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులందరికి అందుబాటులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, డైరెక్టర్లు, రెవెన్యూ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
కమాన్‌పూర్(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీపరిశ్రమల శాఖమంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల ఆదర్శనగర్‌లో ఆదివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25ఆర్థిక సంవత్సరంలో 40వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి వరిగింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. అంతకుముందు కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్ధిళ్ల శ్రీపాధరావు విగ్రహానికి మంత్రి శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమాన్‌పూర్ గ్రామపంచాయతీ కార్మికులకు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు శ్రీపాధరావు వర్థంతిని పురస్కరించుకొని షీల్డ్‌ల బహుకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.