ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:51 PM
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకున్నది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకున్నది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న పోటీలో బీజేపీ అభ్యర్థితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు పోటీ పడుతున్నారు. ఈసారి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులకు కూడా ఓటు హక్కు కల్పించడంతో ఓటర్ల సంఖ్య పెరిగింది. అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులు సైతం పోటీ చేసేందుకు అర్హత ఉండడంతో పెద్దపల్లి జిల్లా బంధంపల్లికి చెందిన మల్క కొమురయ్యను బీజేపీ బరిలో నిలిపింది. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్లు పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఇళ్లకు కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల ఓట్లు 1,111 ఉన్నాయి. ఎక్కువగా పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్ పట్టణాల్లో ఉపాధ్యాయ ఓటర్లున్నారు. వారినందరినీ సాయంత్రం వేళల్లో ఒక చోట సమావేశ పరిచి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వారి అనుచరులు ఓటర్ల వద్దకు వెళ్లి అభ్యర్థులతో ఫోన్లలో మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల దావత్‌లు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటాపోటీ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి పులిప్రసన్న హరికృష్ణ, ఏఐఎఫ్‌బీ నుంచి సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా మద్దతుతో యాదగిరి శేఖర్ రావు, మహ్మద్ ముస్త్యాక్ అలీ, డాక్టర్ బండారి రాజ్‌కుమార్, తదితరులు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 31,037 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 19,008 మంది, మహిళలు 12,028 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 13,974 మంది, మంథని నియోజకవర్గంలో 5,020 మంది, రామగుండం నియోజకవర్గంలో 9,973 మంది, ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం మండలంలో 2,070 మంది ఓటర్లు ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టు కునేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, మంథని ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 17న ఒకేరోజు మూడు నియోజక వర్గాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిం చారు. రెండు రోజులుగా మండలాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమవేశాలు నిర్వహించి ఓటర్లను కలిసే బాధ్యతలను అప్పగిస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి తరపున ఆ పార్టీ నాయకులు మండ లాలు, పట్టణాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నేరుగా ఓటర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ నినాదంతో ఆయన ముందుకు వెళుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టనప్ప టికీ, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి, యాదగిరి శేఖర్ రావులకు బీఆర్‌ఎస్ శ్రేణులు కొందరు పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్న ప్రసన్న హరికృష్ణ కొందరు బీఆర్‌ఎస్ నాయకులు అంతర్గతంగా మద్దతునిస్తున్నట్లు కనబడుతున్నది.
వాయీస్ మెస్సేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌లతోనూ ప్రచారం..
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానం 13 జిల్లాలకు విస్తరించి ఉండడంతో అభ్యర్థులకు నేరుగా ఓటర్లను కలిసే పరిస్థితి లేకపోవడంతో వారి సెల్ నంబర్లు సేకరించి వాయీస్ మెస్సేజ్‌లు, ఎస్‌ఎంఎస్ లను పంపిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి కనీసం రెండు సార్లయినా వాయిస్ మెస్సేజ్‌ల ద్వారా తమ పేరు చెప్పుకుంటూ బ్యాలెట్ పేపర్‌లో తమ సీరియల్ నంబర్ చెబుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థి స్తున్నారు. మరికొందరు అభ్యర్థులు ఓటర్లకు వారి సెల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు. ఈ ఎస్‌ఎం ఎస్‌ల్లో ఓటరు పేరు, పోలింగ్ స్టేషన్ నంబర్, చిరు నామాతో పాటు అక్కడి జాబితాలో ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ తేదీని పేర్కొంటున్నారు. అలాగే ఎక్క డికక్కడే వాట్సప్ గ్రూపులను సైతం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటాపోటీగా, రసవత్తరంగా జరుగుతున్నాయి.