ప్రభుత్వ పాఠశాలల్లో సర్వే
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:17 AM
ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల నమోదు, హాజరు పెంపొందించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక యూడైస్ ప్లస్ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) వెబ్‌సైట్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్యను క్షేత్ర స్థాయిలో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

జగిత్యాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల నమోదు, హాజరు పెంపొందించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక యూడైస్ ప్లస్ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) వెబ్‌సైట్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్యను క్షేత్ర స్థాయిలో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. యూడైస్ ప్లస్ సర్వే పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో డీఎడ్ విద్యార్థులతో సమాచార సేకరణకు సిద్ధమైంది. ఈ సర్వేలో పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిశీలించి గణాంకాలను నమోదు చేస్తారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా లేదా అని కూడా ధ్రువీకరిస్తారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు నిధులు కేటాయిస్తాయి. విద్యా సంస్కరణలను మరింత పటిష్టం చేస్తాయి.
ఫతప్పుల సవరణపై దృష్టి
పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులు తెలియజేసేందుకు రూపొందించిన యూడైస్ ప్లస్‌లో తరచూ దొర్లుతున్న తప్పులు సవరించేందుకు అధికారులు దృష్టి సారించారు. ఆన్‌లైన్‌లో ఉండే వివరాలకు పాఠశాలల్లో రికార్డులకు సరిపోల్చేందుకు సర్వే నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎంత మంది ఉన్నారు..మరుగుదొడ్లు ఉన్నాయా..తరగతి గదులెన్ని..తదితర విషయాల్లో వ్యత్యాసం గుర్తించనున్నారు. విద్యాశాఖ క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించేందుకు తొలిసారిగా థర్డ్ పార్టీ సర్వే చేపట్టనుంది. ఈనెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో వివరాల సేకరణ కొనసాగనుంది. ప్రతీ సంవత్సరం యూడైస్ ప్లస్‌పై ప్రధానోపాధ్యాయులకు ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నా వివరాల నమోదులో తప్పులు దొర్లుతున్నాయి. ప్రొఫార్మా పాటించకపోవడంతో జిల్లాలోని పాఠశాలలకు సరిపడా నిధులు రావడం లేదన్న అభిప్రాయాలున్నాయి. మౌలిక వసతులపై ప్రభుత్వానికి స్పష్టత ఉండడం లేదు. ప్రతీ యేటా యూడైస్ ఫ్రొఫార్మాను ఐదు శాతం సీఆర్‌పీలు వెరిఫికేషన్ చేసేవారు. కానీ ప్రభుత్వం ఈ యేడాది పారదర్శకత కోసం థర్డ్ పార్టీకి అప్పగించింది. తప్పులు ఉంటే అప్పటికప్పుడు యూడైస్ ప్లస్ పోర్టల్‌లో సరి చేయనున్నారు.
ఫజిల్లాలో సర్వే ఇలా...
జిల్లాలో ప్రభుత్వ పంచాయతీ రాజ్ పరిధిలో 844 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 518, ప్రాథమికోన్నత పాఠశాలలు 90, ఉన్నత పాఠశాలలు 236 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 66 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సర్వేలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని 410 పాఠశాలల నుంచి 46,770 విద్యార్థుల హాజరును పరిశీలించి ఛాత్రోపాధ్యాయులు నివేదికలను రూపొందిస్తారు. సర్వే కోసం కరీంనగర్‌లోని డైట్ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. సంబంధిత కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్‌పీ)లు సహకారం అందిస్తారు.
ఫక్షేత్ర స్థాయి సమాచార సేకరణ
జిల్లాలో డీఎడ్ చదువుతున్న 41 మంది ఛాత్రోపాధ్యాయులను ఈ సర్వే కోసం కేటాయించారు. వీరు ప్రతి రోజు రెండు పాఠశాలల చొప్పున సర్వే చేపడతారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలను అప్పగించి, నివేదికలను రూపొందించేలా శిక్షణ ఇచ్చారు. యూడైస్ ప్లస్ పోర్టల్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్యను హాజరైన విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చి వాస్తవ గణాంకాలను నమోదు చేస్తారు.
ఫసర్వే ప్రాముఖ్యత
సర్వే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నిధుల కేటాయింపు కోసం కీలకం కానుంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాంలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ భత్యం వంటి సౌకర్యాలను అందిస్తోంది. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ సర్వే ద్వారా వాస్తవ గణాంకాలను సేకరించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు.
పకడ్బందీగా సర్వే
-రాము, జిల్లా విద్యాధికారి
రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు వంటి క్షేత్ర స్థాయి సమాచారం తెలుసుకుంటారు. ఇందుకు గాను చాత్రోపాధ్యాయులను జిల్లాకు కేటాయించారు. వీరు ఆయా పాఠశాలలను సందర్శించి యూడైస్ ప్లస్ పై ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సర్వే చేపడతారు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.