రెండో రోజుకు చేరిన మరమగ్గాల కార్మికుల సమ్మె
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:53 AM
సిరిసిల్ల పట్టణం లో సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరమగ్గాలతో పాటు అనుబంధ రంగాల కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరుకుంది.

సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణం లో సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరమగ్గాలతో పాటు అనుబంధ రంగాల కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరుకుంది. దీంతో బుధవారం పట్టణంలోని బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనం నుంచి మరమగ్లా కార్మికులతో నాయకులు బైక్ ర్యాలీని చేపట్టారు. పట్టణంలోని అన్ని చౌరస్తాల గుండా చేపట్టిన బైక్ ర్యాలీతో సిరిసిల్ల కలెక్టరేట్ వరకు చేరుకుని ప్రధాన ద్వారం ఎదు ట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షు డు సిరిమల్లె సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్‌లు మాట్లాడుతూ సిరిసిల్లలో మర మగ్గాల అనుబంధ రంగాల కార్మికులకు కూలి పెంచడంతో పాటు ఇతర సమ స్యలను పరిష్కరించే విధంగా కలెక్టర్ స్పందించాలన్నారు. పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండు రమేష్, నాయకులు ఉడుత రవి, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, శ్రీకాంత్, సదానందం, వేణు, తిరుపతి, వెంకటేశ్వర్లు, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.