Share News

అందని ఆత్మీయ భరోసా

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:48 AM

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది. పథకాన్ని ఆరంభించి నెలన్నర రోజులు గడుస్తున్నప్పటికీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతు కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందని ఆత్మీయ భరోసా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపా యలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయగా, రైతు భరోసా పథకాన్ని యాసంగి సీజన్‌ నుంచి ఆరంభించారు. సాగులో ఉన్న భూమిని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు గల రైతుల ఖాతాల్లో ఎకరానికి 7,500 రూపాయలకు బదులు రూ.6 వేలు జమ చేశారు. మిగతా రైతులకు జమ చేయాల్సి ఉంది. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట ఏడాదిలో రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున 12 వేలు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకం, కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆరంభించిన విష యం తెలిసిందే. ఈ పథకాలను ఆరంభించిన రోజున మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాల కింద ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు ఆయా పథకాలను వర్తింపజేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించిన రైతు కూలీలకు వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయలేదు.

15,046 మంది రైతుల గుర్తింపు..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 15,046 మంది రైతు కూలీలను గుర్తించారు. 2023-24లో ఇరవై రోజులపాటు ఉపాధిహామీ పథకం ద్వారా కూలీ చేసిన వారిని గుర్తించారు. ఇందులో ఎలాంటి పట్టా భూములు లేని రైతు కూలీలకు ఇంది రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప జేయను న్నారు. ఎలిగేడు మండలంలో 472 మంది, ఓదెలలో 1.010 మంది, రామగిరిలో 1,049, పాలకుర్తిలో 1,216, జూలపల్లిలో 440, ముత్తారంలో 575, ధర్మారంలో 1,341, అంతర్గాంలో 1,133, కాల్వశ్రీరాంపూర్‌లో 1,219, మంథని లో 1,960, పెద్దపల్లి మండలంలో 2,156 మంది, సుల్తానాబాద్‌లో 1,907, కమాన్‌పూర్‌ మండలంలో 568 మంది రైతు కూలీలను గుర్తించారు. జనవరి 24, 25 తేదీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో పేర్లు రాని రైతు కూలీలు తాము 20 రోజులకు పైగా ఉపాధిహామీ పనులను నిర్వహించా మని మాకు ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప జేయా లని 6,584 మంది రైతు కూలీలు దరఖాస్తు చేసుకు న్నారు. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 13 గ్రామాల్లో గుర్తించిన రైతు కూలీలు మినహా మిగతా రైతుల ఖాతాల్లో 6 వేల రూపాయలు పడకపోవడంతో ఆందోళనకు గురవుతు న్నారు. తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా అని సంబంధిత శాఖ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఈ విషయమై తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని రైతు కూలీలు కోరుతున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:48 AM