ఇన్‌చార్జి మార్పు ఉంటుందా?
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:19 AM
కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జిని మార్చుతారని ఆ పార్టీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏ పార్టీకైనా జిల్లా రాజకీయాల్లో జిల్లా కేంద్ర అసెంబ్లీ నియోజక వర్గ రాజకీయాలు, ఆ రాజకీయాలకు నాయకత్వం వహించే నేతలు కీలకంగా ఉంటారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జిని మార్చుతారని ఆ పార్టీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏ పార్టీకైనా జిల్లా రాజకీయాల్లో జిల్లా కేంద్ర అసెంబ్లీ నియోజక వర్గ రాజకీయాలు, ఆ రాజకీయాలకు నాయకత్వం వహించే నేతలు కీలకంగా ఉంటారు. దీంతో కాంగ్రెస్‌కు జిల్లా అధ్యక్ష పదవి ఎంత ముఖ్యమో కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి అంత ప్రాధాన్యం ఉన్నది. గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పురమల్ల శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేలు లేని చోట ఆ పదవికి పోటీ చేసిన వ్యక్తినే నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా భావించడం ఆనవాయితీగా వస్తున్నది. పురమల్ల శ్రీనివాస్ తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడిగానే ఉంటూ వచ్చినా ఆ తర్వాత క్రమంలో కొంత స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు.
ఫ నామినేటెడ్ పోస్టుల కోసం అనుచరుల పేర్ల ప్రతిపాదన
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వెలిచాల రాజేందర్‌రావు, అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్ ఉన్నా వారు ఆ పదవుల్లో నామమాత్రంగా మారిపోయారనే విమర్శలు వచ్చాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటే ఇక్కడ చెల్లుబాటవుతూ వారిద్దరూ ఆయన చెప్పిన దానికి తలూపడం మినహా చేసేదేమి లేని విధంగా మారిపోయారనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడి పురమల్ల నామినేటెడ్ పదవుల విషయంలో తాను కొందరి పేర్లను ప్రతిపాదిస్తూ జాబితాను తయారు చేసి ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమర్పించారు. మరికొన్ని విషయాల్లోనూ ఆయన ఇలాగే వ్యవహరించడం జిల్లా మంత్రి పొన్నంకు అగ్రహం కలిగించారని సమాచారం. డీసీసీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తాను నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా తనను ఏమాత్రం సంప్రదించకుండా నిధులు తదితర కేటాయింపులు చేస్తూ మంత్రి పొన్నం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పర్యటన విషయాలు తనకు సమాచారం ఇవ్వడం లేదని, ఇసుక కాంట్రాక్టులు, పార్కు నిర్వహణ కాంట్రాక్టు తనకు కావాల్సిన వారికి ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ వ్యవహారంపై కొందరు నియోజకవర్గ నాయకులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పురమల్ల శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆయన దానికి ఏ జవాబు ఇచ్చారో.. పార్టీ ఏమి ఆలోచించిందో.. కాని ఆ వ్యవహారంపై ఆ తర్వాత ఏలాంటి ప్రకటన వెలువడలేదు. అది అక్కడికి సద్దుమణిగినా పురమల్ల శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం ప్రారంభమైంది. కొద్ది రోజులుగా ఈ ప్రచారం ఊపందుకుంది.
ఫ తెరపైకి పలువురి పేర్లు
కరీంనగర్ నియోజక వర్గ ఇన్‌చార్జి పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. పార్లమెంట్ నియోజక వర్గ ఇన్‌చార్జిగా ఉన్న వెలిచాల రాజేందర్‌రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి అంజన్‌కుమార్, ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వి నరేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్ల చెబుతున్నారు. నియోజక వర్గ ఇన్‌ఛార్జి పదవి ఎవరికి ఇవ్వాలన్నా మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతే కీలకం. ఆయన సూచించిన వారికి మాత్రమే పదవి దక్కే అవకాశం ఉంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని ఆ పదవికే అంగీకరించని మంత్రి పొన్నం ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యత ఇచ్చే ప్రసక్తే లేదని అనుకుంటున్నారు. అంజన్‌కుమార్, వి నరేందర్‌రెడ్డి విషయంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అంత సానుకూల అభిప్రాయం లేదని, రాజేందర్‌రావు పేరును ఆయన అంగీకరించవచ్చని అంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జిని తొలగించి ఓసి సామాజిక వర్గానికి చెందిన రాజేందర్‌రావుకు అవకాశం కల్పిస్తే మంత్రి పొన్నం బీసీ నేతగా అపఖ్యాతిని ఎదుర్కొవాల్సి వస్తుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రికి ఈ పదవి మార్పు, కొత్త నేత ఎంపిక సవాలుగానే ఉంటుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరో వైపు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పురమల్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూపించానని, రెండో ఎపిసోడు, మూడో ఎపిసోడు కూడా ఉంటుందని వాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.