Share News

Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ABN , Publish Date - Feb 22 , 2025 | 05:05 AM

సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, ఆచరణలో మాత్రం కాలు కదలడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

  • కాంగ్రె్‌సను నమ్మి ఓట్లేస్తే నిండా ముంచారు

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది

  • కేసీఆర్‌ దోపిడీ పాలనకు కొనసాగింపుగా

  • కాంగ్రెస్‌ పాలన: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మెదక్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, ఆచరణలో మాత్రం కాలు కదలడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మెదక్‌లో బీజేపీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మాటలు నమ్మి ఓట్లేస్తే.. ప్రజల ఆశలను అడియాశలు చేశారని, నిండా ముంచారని విమర్శించారు. రాష్ట్ర మంత్రుల్లో సఖ్యతే లేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం దోపిడీ చేస్తే.. దానిని కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తోందని ఆరోపించారు. నాడు కేసీఆర్‌ రూ.9 లక్షల కోట్ల అప్పు చేస్తే.. ఇప్పుడు రేవంత్‌ ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.


14 నెలల రేవంత్‌ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌.. తెలంగాణ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. ఉద్యోగుల పదవీ విరమణ బెనిఫిట్స్‌ చెల్లించడం లేదని ఆక్షేపించారు. తెలంగాణలో మంచి పాలనకు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టిస్తామని ఆయన చెప్పారు. మెదక్‌ ఎంపీ రఘనందన్‌ మాట్లాడుతూ.. కొన్ని ఉమ్మడి జిల్లాలలో పార్లమెంట్‌ సభ్యులంతా బీజేపీకి చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు చాలా సులువని చెప్పారు.

Updated Date - Feb 22 , 2025 | 05:05 AM