KTR : 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:40 AM
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో అర గ్యారెంటీని (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) మాత్రమే అమలు చేసి మిగతావి తుస్సుమనిపించారని.. ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతావి తుస్సు
రేవంత్.. రుణమాఫీపై గ్రామాల్లో తేల్చుకుందామా?
ఈ నెల 26న రైతు భరోసా రూ.15వేలు ఇవ్వాలి
లేదంటే వెంటాడుతాం.. ఎన్ని కేసులైనా తగ్గం: కేటీఆర్
షాద్‌నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో అర గ్యారెంటీని (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) మాత్రమే అమలు చేసి మిగతావి తుస్సుమనిపించారని.. ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘‘రైతులందరికీ రుణ మాఫీ కాలేదని నిరూపించడానికి మేం సిద్ధం. పూర్తయిందని మీరు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కార్యకర్తలం తా రాజీనామా చేస్తారు. రేవంత్.. మాతో గ్రామాలకు మీరు వస్తారా? మీకు సమయం లేకుంటే మంత్రులనైనా పంపించండి’’ అని సవాల్ విసిరారు. అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా తెలంగాణలోనే పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ ఢిల్లీలో చక్రం తిప్పుతానని అనడం పెద్ద జోక్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ రైతు దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి రైతుకు రూ.15 వేలు చెల్లించాల్సిందే. రైతు కూలీలకు కూడా రూ.12 వేలు ఇవ్వాల్సిందేనని అన్నారు. రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించడం సరికాదన్నారు. ‘‘లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతు భరోసా జమ చేసి తర్వాత చేతులెత్తేశారు. వానాకాలం పంట రైతు భరోసా రూ.7500 ఇవ్వలేదు. మేం నిలదీస్తుంటే దసరా, దీపావళి అని దాటవేశారు. ఇప్పుడు జనవరి 26 అని చెబుతున్నారు. ఇకనైనా ఇస్తారా? ఈ దీక్ష ఆరంభం మాత్రమే. కాంగ్రెస్ హామీలను అమలు చేయకుంటే వెంటాడుతూనే ఉంటాం. ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ కేసులు పెడుతోంది. ఎన్ని కేసులైనా భయపడేదే లేదు’’ అని అన్నా రు. ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.17,500, రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళలకు రూ.30 వేలు బాకీ పడిందని.. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే ముందు ఈ డబ్బులను చెల్లించి ఓట్లు అడగండి అని డిమాండ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాహుల్, రేవంత్ పైనే కేసులు పెట్టాలి
సీఎం రేవంత్ పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు అని.. హామీలు అమలు చేయనందుకు రేవంత్, కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోసం కేసు పెట్టాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని జోస్యం చెప్పారు. దీక్షలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీమంత్రులు మహమూద్ అలీ, సబిత, శ్రీనివా్‌సగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.
అలీబాబా అరడజన్ దొంగల్లా రేవంత్ దోపిడీ ముఠా సంచారం
మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
షాద్‌నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అలీబాబా అరడజన్ దొంగల మాదిరిగా సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన దోపిడీ ముఠా సంచరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డితో పాటు వేం నరేందర్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి, ఫహీం, ఖురేషి, ఏవీ రెడ్డిలు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో తిరుగుతున్నారన్నారు. ఈ ముఠా పలు కంపెనీల యాజమాన్యాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. కబ్జా లు, భూదందాలే వీరి లక్ష్యం అని అన్నారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో చాట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి పెద్ద అవకాశవాది.. మోసకారి.. ఇందుకు నిదర్శనం ఎన్నికల హామీలను విస్మరించడమే.. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాందీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసి వెళ్లిపోయారు.
తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను పార్టీ నాయకులు ప్రశ్నించాలి’’ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో జరుగుతున్న పార్టీ విభేదాల గురించి ఎలా ప్రశ్నిస్తున్నారో అలాగే రాష్ట్రంలో జరుగుతున్న మోసాల గురించి కూడా ప్రశ్నిస్తే బాగుంటుందన్నారు. బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు కలిసి ఈడీ, ఏసీబీ కేసులు పెడుతున్నా తాము ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గ్రీన్ కో కంపెనీకి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి రూపాయి లాభం కూడా జరగలేదని, మరి క్విడ్‌ప్రోకో అనే మాట ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. త్వరలోనే పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు.