ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ABN, Publish Date - Jan 10 , 2025 | 04:24 AM

ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు.. తెలియదు అన్న సమాధానాలు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచటం కోసం తాము కృషి చేస్తే ఇప్పుడు రంధ్రాన్వేషణ ఏమిటంటూ నిలదీత.. అడిగిన ప్రశ్నలే మళ్లీ ఎన్నిసార్లు అడుగుతారు?

  • ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్‌ కౌంటర్లు

  • ఫార్ములా-ఈ కేసులో ఆరున్నర గంటల విచారణ

  • మాజీ మంత్రికి పలు కోణాల్లో 50కి పైగా ప్రశ్నలు

  • రేసింగ్‌ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?.. టెండర్లు ఎందుకు పిలవలేదు?

  • స్పాన్సరర్‌ తప్పుకొంటే చర్యలు తీసుకోలేదేం?

  • క్యాబినెట్‌ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా?

  • కోడ్‌ ఉండగా.. నిధులు ఎలా ఇస్తారు?: ఏసీబీ

  • హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ తెద్దామని కృషి చేస్తే.. ఈ రంధ్రాన్వేషణ ఏమిటి?

  • నిధులు దుర్వినియోగం జరిగింది ఎక్కడ?

  • బీఆర్‌ఎ్‌సకు పేరొస్తుందనే సర్కారు రద్దు చేసింది

  • రేవంత్‌రెడ్డిపై కేసు ఎందుకు పెట్టరు?

  • కావాలంటే అరెస్టు చేసుకోండి అని వ్యాఖ్య సంక్రాంతి తర్వాత మళ్లీ కేటీఆర్‌ విచారణ

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు.. తెలియదు అన్న సమాధానాలు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచటం కోసం తాము కృషి చేస్తే ఇప్పుడు రంధ్రాన్వేషణ ఏమిటంటూ నిలదీత.. అడిగిన ప్రశ్నలే మళ్లీ ఎన్నిసార్లు అడుగుతారు? కావాలంటే, అరెస్టు చేసుకోండని సవాల్‌.. చివరికి.. ‘మీరిక వెళ్లొచ్చు’ అని అధికారులు చెప్పినప్పుడు.. ముఖంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం.. ఏసీబీ విచారణ సందర్భంగా కేటీఆర్‌లో కనిపించిన భిన్న స్పందనలు ఇవీ..! ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు గురువారం ఆరున్నర గంటలకుపైగా విచారించి 50కి పైగా ప్రశ్నలు సంధించారు. ఉదయం పది గంటల సమయంలో ఏసీబీ కార్యాలయానికి తన న్యాయవాది రాంచందర్‌రావుతో కలిసి వెళ్లిన కేటీఆర్‌ సాయంత్రం ఐదు తర్వాత బయటకు వచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఒక గదిలో కూర్చోబెట్టి, ఆయన కన్పించే విధంగా మరికొంత దూరంలో న్యాయవాది రాంచందర్‌రావును కూర్చోపెట్టారు. విచారణ పూర్తిగా సీసీ కెమెరాలతో కవర్‌ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. విచారణ ప్రక్రియను ఏసీబీ డైరెక్టర్‌ తరుణ్‌ జోషి పర్యవేక్షించగా జాయింట్‌ డైరెక్టర్‌ రుతిరాజ్‌, అడిషనల్‌ ఎస్పీ శివరాం శర్మ, సీఐయూ యూనిట్‌ డీఎస్పీ మాజిద్‌ఖాన్‌ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేసు ఒప్పందం, క్యాబినెట్‌ ఆమోదం తీసుకోకపోవడం, డబ్బుల బదిలీ, సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘన, స్పాన్సరర్‌ కంపెనీతో సాన్నిహిత్యం తదితర విషయాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్‌ అధికారి దానకిషోర్‌ వాంగ్మూలం, సహనిందితుడైన ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ వాంగ్మూలం ఆధారంగా కూడా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.


పలు కోణాల్లో ప్రశ్నలు

ఫార్ములా-ఈ రేసు తొలి ఒప్పందం ఏ విధంగా జరిగింది? దీనికి స్పాన్సరర్‌గా గ్రీన్కో కంపెనీకి చెందిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ను ఎందుకు ఎంపిక చేశారు? వారికి క్రీడల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకున్నా.. వారినే ఎంపిక చేయడానికి కారణాలేమిటి? టెండర్లకు వెళ్లకుండా ఆ కంపెనీకే ప్రత్యక్షంగా అవకాశం ఎలా ఇచ్చారు? చలమలశెట్టి అనిల్‌కు మీకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అనే ప్రశ్నలను కేటీఆర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కారు రేసు 9వ సెషన్‌ పూర్తయిన తర్వాత 10వ సెషన్‌కు సంబంధించి స్పాన్సరర్‌ తప్పుకుంటున్నట్లు మీకు ఎవరు చెప్పారు? త్రైౖపాక్షిక ఒప్పందం నుంచి స్పాన్సరర్‌ తప్పుకుంటే ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలకు ఎందుకు వెళ్లలేదు? లీగల్‌ నోటీసు ఇద్దామని పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ చెబితే మీరేమన్నారు? లీగల్‌ నోటీసు ఎందుకు వద్దన్నారు? అంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. అయితే, ఈ ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచటం కోసం తాను ఫార్ములా-ఈ కారు రేసును తీసుకొస్తే అందులో మీరు బొక్కలెతుకుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నట్లు తెలిసింది.


ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ విషయంలో నాటి అధికారుల సూచన మేరకే వ్యవహరించానని, ఎఫ్‌ఈఓతో పురపాలకశాఖ మరో ఒప్పందం చే సుకోవడంలో తప్పేముందని కేటీఆర్‌ ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. క్యాబినెట్‌ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నించగా, క్యాబినెట్‌ అనుమతి లేకుండానే ఈ ప్రభుత్వం రేసును రద్దు చేసింది కదా! అని కేటీఆర్‌ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పురపాలకశాఖ, ఎఫ్‌ఈఓ మధ్య ఒప్పందం జరిగితే పురపాలకశాఖ నిధులు వాడాలి కానీ, హెచ్‌ఏండీఏ నిధులు సుమారు రూ.46 కోట్లు ఎందుకు విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీ రూపంలో పంపించారు అని ప్రశ్నించగా, నిధుల ఖర్చు సంగతి అధికారులదని, విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బు అక్కడే ఉందని వారు చెబుతుంటే ఇక నిధులు దుర్వినియోగం అయ్యింది ఎక్కడ అని కేటీఆర్‌ బదులిచ్చారు. హెచ్‌ఏండీఏ నుంచి పది కోట్ల పైన నిధులు తీసుకోవాలంటే ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాలి కదా అన్న ప్రశ్నకు.. తనకు ఆ విషయం తెలియదని ఆయన సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద హెచ్‌ఎండీఏ నుంచి రూ.56 కోట్లు దుర్వినియోగం అయ్యాయి కదా అని ప్రశ్నించగా, సెకండ్‌ సెషన్‌ నిర్వహిస్తే బీఆర్‌ఎ్‌సకు పేరొస్తుందన్న కారణంతోనే ఈ ప్రభుత్వం ఆపివేసిందని, ప్రభుత్వానికి నష్టం చేసిన రేవంత్‌ రెడ్డిపైన కూడా కేసు నమోదు చేయాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘన గురించి ప్రశ్నించినపుడు అదంతా ప్రధాన కార్యదర్శి పరిధిలోని అంశమని ఆమెనెందుకు ప్రశ్నించలేదని కేటీఆర్‌ పేర్కొన్నట్లు తెలిసింది.


కోడ్‌ అమల్లో ఉండగా.. నిధుల విడుదలా?

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నిధుల విడుదలకు ఎలా అనుమతించారని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఎన్నికల కమిషన్‌ తమకేమీ లేఖ రాయలేదని, అంతా అధికారులు చూసుకునే వ్యవహరమని కేటీఆర్‌ బదులిచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఏసీబీ విచారణలో చాలా వరకు ప్రశ్నలకు తెలియదు అనే జవాబుతో పాటు.. ప్రశ్నకు ప్రశ్ననే కేటీఆర్‌ సంధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగే సమయంలో ఏసీబీ అధికారులు పలుమార్లు విరామం ఇచ్చారు. అయితే, మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు అడగటంతో ఒక దశలో కేటీఆర్‌ కొంత అసహనానికి గురై.. ‘ఇదొక పనికిరాని కేసు.. నన్ను ఎందుకు వెంటాడుతున్నారు? ఇందులో కొత్తగా బయటపడేది ఏమీ లేదు. మీరు నన్ను అరెస్టు చేయదలచుకుంటే చేసుకోండి. మళ్లీ వేసిన ప్రశ్నలే వేయడం వల్ల ఉపయోగం లేదు’ అని చెప్పినట్లు సమాచారం.


టెన్షన్‌లో కేటీఆర్‌!

విచారణ ప్రారంభించినప్పటి నుంచి కేటీఆర్‌ కొంత టెన్షన్‌గానే ఉన్నారని, పలుమార్లు అధికారులు విరామం ఇచ్చి ప్రశ్నలు అడిగినా ఆయనలో అసహనం కన్పించిందని, లంచ్‌ టైంలోనూ ముభావంగా ఉన్నారని సమాచారం. విచారణ ముగిసిన తర్వాత మీరు వెళ్లిపోవచ్చు అని ఏసీబీ అధికారులు చెప్పినపుడు కేటీఆర్‌ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కనిపించిందని.. మంచినీళ్లు తాగి ఆయన ఏసీబీ ఆఫీసు నుంచి బయటకు వచ్చేశారని తెలిసింది.


సంక్రాంతి తర్వాత మరోసారి విచారణ

తొలిరోజు విచారణలో ఏమీ బయటపడకపోవడంతో కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మూడో నిందితుడైన బీఎల్‌ఎన్‌ రెడ్డి విచారణ కూడా ముగిసిన తర్వాత కేటీఆర్‌ను సంక్రాంతి పండుగ అనంతరం మళ్లీ పిలవవచ్చని తెలుస్తోంది.


సుప్రీంలో కేటీఆర్‌కు చుక్కెదురు పిటిషన్‌పై అత్యవసర విచారణకు నిరాకరణ

  • 15న విచారణ జరుపుతామని సీజేఐ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తక్షణమే విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిరాకరించింది. శుక్రవారం అత్యవసర విచారణ చేపట్టాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తోసిపుచ్చారు. ముందుగా లిస్ట్‌ చేసిన ప్రకారం ఈ నెల 15న విచారణ చేపడతామని స్పష్టం చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ కేటీఆర్‌ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయవాది మోహిత్‌రావు రిజిస్ట్రార్‌కు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రార్‌ సీజేఐకి నివేదించడంతో కేటీఆర్‌ పిటిషన్‌పై విచారణకు ఈ నెల 15వ తేదీని కేటాయించారు. గురువారం మరోసారి కేటీఆర్‌ న్యాయవాదులు సీజేఐ బెంచ్‌ ముందు ప్రస్తావించారు. శుక్రవారం విచారణ జరపాలని కోరారు. స్పందించిన సీజేఐ.. అత్యవసర విచారణకు నిరాకరించారు.

Updated Date - Jan 10 , 2025 | 04:24 AM