Mahesh Kumar Goud: మనువాదం అమలుకు బీజేపీ యత్నం
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:41 AM
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. దేశంలో కాషాయ అజెండా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు.

కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు: మహేశ్ గౌడ్
గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు
అసెంబ్లీ ఆవరణలో జెండా ఆవిష్కరించిన స్పీకర్
హైదరాబాద్/ఢిల్లీ/సైదాబాద్/వెల్దుర్తి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. దేశంలో కాషాయ అజెండా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిండు పార్లమెంటులో అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల నియంత పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఒక్క ఇల్లూ కట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని చెప్పారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, పార్టీ నేతలు వీ హన్మంతరావు, కుసుమ్‌కుమార్, ఎంపీ అనిల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4 పథకాలు ప్రారంభమైన నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌భవన్‌లో రాష్ట్ర పార్టీ నేత సామ భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన టీడీపీ జెండాను ఆవిష్కరించారు. జనసేన కార్యాలయంలో వేడుకల్లో జనసేన తెలంగాణ ఇన్‌చార్జి వేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు రాధారం రాజలింగం పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా జాతీయ పతాకాన్ని ఎగరేశారు. కేంద్ర హోంమంత్రి పథకాలు పొందిన 17 మంది పోలీసు సిబ్బందిని డీజీపీ జితేందర్ అభినందించారు. చంచల్‌గూడలోని జైళ్ల శాఖ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా జెండాను ఎగరేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి. శబరి బ్లాక్‌లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ జెండాను ఆవిష్కరించారు.