Mahesh Kumar Goud: యూత్ కాంగ్రెస్ రక్షణ కవచంలా ఉండాలి
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:32 AM
కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ రక్షణ కవచంలా పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.

పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ రక్షణ కవచంలా పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్య నిర్వాహక సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే జూన్, జూలైలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్‌కు తగిన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంలో యూత్ కాంగ్రెస్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని, సామాజిక మాధ్యమాల్లో యూత్ కాంగ్రెస్ మరింత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని, రాజీవ్ యువ వికాసంపై అవగాహన పెంచాలని సూచించారు. కంచ గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాల అనైతిక విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి విష్ణునాథ్ సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సన్నబియ్యం, రూ.500లకు గ్యాస్, ఉచిత విద్యుత్, వడ్లకు బోనస్ వంటి అనేక పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి యూత్ కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా ప్రచార కార్యక్రమాలనుచేపట్టాలని కోరారు. యూత్ జోడో- బూత్ జోడో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యుడు సంపత్ కుమార్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.