Mahesh Kumar Goud: రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:29 AM
మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ: మహేశ్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువని.. అయితే ఆయన పార్టీ గీత దాటి మాట్లాడారా.. లేదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తనకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ రాయలేదన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ అన్నది పార్టీ సమష్ఠిగా తీసుకునే నిర్ణయమని, అనేక సమీకరణాలతో కూడుకున్న అంశమని తెలిపారు. పార్టీలో చేరికలపై ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్‌రెడ్డి.. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకూడదంటే కాంగ్రె్‌సలో చేరడమే శరణ్యమని భావించి పార్టీలో చేరారని చెప్పారు. వారి చేరికతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలూ మెరుగుపడ్డాయన్నారు. అయితే తాము కాంగ్రె్‌సలో చేరాం కాబట్టే పార్టీ గెలిచిందని వారనుకోవడము..కాంగ్రెస్ గెలుస్తుందనే వారు పార్టీలో చేరారని అనుకోవడం.. రెండూ నిజమే కావచ్చని వ్యాఖ్యానించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గం ఏర్పాటు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.
కేటీఆర్ పగటి కలలు మానుకోవాలి..
‘పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఏం వెలగబెట్టిందని మళ్లీ అధికారంలోకి వస్తది? తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు మళ్లీ ఓటెందుకు వేస్తరు? ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. కేటీఆర్ పగటి కలలు కనడం మానుకుంటే మంచిది’ అని మహేశ్‌గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినా బీఆర్‌ఎస్ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతో పెద్ద ఎత్తున రైస్ స్కామ్ జరిగిందని, దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఎగుమతి చేయడం ద్వారా రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వీటన్నింటిపైనా విచారణ చేస్తామన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, ఎస్సీ వర్గకరణ జీవోను విడుదల చేశామని, ధరణితో విసిగి వేసారిన ప్రజలకు భూ భారతితో మోక్షం లభించిందని చెప్పారు.