Medak: దొంగ బాబా అరెస్టు.. మహిళలకు మత్తుమందు ఇస్తూ.. వీడి అరాచకం మాములుగా లేదు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:02 PM
మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

మెదక్ జిల్లా: దేశంలో దొంగ బాబాలు పెరిగిపోతున్నారు. మాయలు, మంత్రాలతో సమస్యలు తొలగిస్తామని చెప్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. లక్షలకు లక్షలు డబ్బులు దోచేయడమే కాకుండా మహిళల మానాలూ తీస్తున్నారు కేటుగాళ్లు. బాధలు తీర్చాలని వెళ్లిన వారిపై అత్యాచారాలు చేస్తూ పేట్రేగిపోతున్నారు. సమస్యలు తీర్చాలంటే తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ అమాయక మహిళలను లోబర్చుకుంటున్నారు. మాట వినని వారిని మంత్రాల పేరుతో భయపెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి.. బాబా అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పూజలు చేసి సమస్యలు తొలగిస్తానని మహిళలతో పరిచయం పెంచుకుంటున్నాడని, ఆపై ఒంటరిగా పిలిచి మత్తు పదార్థాలు ఇచ్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఆ సమయంలో వీడియోలు తీసి బాధిత మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, వారి నుంచి అందినకాడికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధలు తీర్చమని వెళ్లిన పలువురు మహిళలు అతని వలలో చిక్కి మోసపోయారని తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు బాపుస్వామిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. నిందితుడి నుంచి తాయత్తులు, మత్తుమందు, రెండు సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద దొరికిన ఫోన్లలో మహిళలతో ఉన్న వీడియోలు, ఫొటోలు లభించాలని సంచలన విషయాలు తెలిపారు. వాటితోనే మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగ బాబాలను నమ్మెుద్దని, మీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మంత్రాలకు చింతకాయలు రాలవని.. కుటుంబసభ్యులు, బంధువులతో చర్చించి ఆర్థిక, ఆరోగ్య, ఇతర సమస్యలు తీర్చుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
Betting Apps: బిగ్ బ్రేకింగ్.. రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..