Hyderabad: కిలోమీటరుకు 372 కోట్లు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:39 AM
మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం-కోకాపేట్ మార్గంలో కిలోమీటరుకు సగటున రూ.372 కోట్లు వ్యయం కానున్నట్లు సమాచారం.

రాయదుర్గం-కోకాపేట్ మార్గంలో మెట్రో నిర్మాణ అంచనా వ్యయం.. నిర్ధారించిన అధికారులు
ఎల్‌బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో కి.మీ.కు సగటున రూ.264 కోట్లు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం-కోకాపేట్ మార్గంలో కిలోమీటరుకు సగటున రూ.372 కోట్లు వ్యయం కానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్’ (హెచ్‌ఏఎంఎల్) అధికారులు నిర్మాణ ఖర్చులను సైతం పెంచారు. కారిడార్ల నిర్మాణానికి కావాల్సిన భూములను కలుపుకొని ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లో ఈ మేరకు పొందుపరిచారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్-ఏ కింద నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8 కి.మీ.), రాయదుర్గం- కోకాపేట్ నియోపోలీస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీనగర్-హయత్‌నగర్ (7.1 కి.మీ.) మార్గాలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అలాగే పార్ట్-బీ కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఫోర్త్‌సిటీ (40 కి.మీ.), జేబీఎ్‌స-శామీర్‌పేట్ (22 కి.మీ.), ప్యారడైజ్-మేడ్చల్ (23 కి.మీ.) మార్గాలను ప్రతిపాదించారు. పార్ట్-ఏ కింద ఉన్న 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను గతేడాది నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మార్చిలో సంబంధిత అనుమతి లభించనున్నట్లు హెచ్‌ఏఎంఎల్ అధికారులు చెబుతున్నారు.
కి.మీ.కు రూ.317 కోట్లు
రెండో దశ ప్రాజెక్టులో ఒక కి.మీ.కు సగటున రూ.317 కోట్ల వ్యయం అవుతుందని మెట్రో అధికారులు అంచనాలు రూపొందించారు. కాగా, ఇదే సెకండ్ ఫేజ్‌లో బెంగళూరులో ఒక కి.మీ.కు సగటున రూ.533 కోట్లు, చెన్నైలో రూ.531 కోట్లతో పనులు చేస్తున్నారని, వాటితో పోల్చితే మన వద్ద నిర్మాణ వ్యయం తక్కువగా ఉందని, ఎక్కువగా భూసేకరణ లేకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట, రాయదుర్గం-కోకాపేట్ ప్రాంతాల్లోనే భూసేకరణకు అధికంగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. కాగా, మెట్రో రెండోదశలో రాయదుర్గం-కోకాపేట్ మార్గంలోనే అత్యధిక వ్యయం అవసరమవుతోంది. 11.6 కి.మీ.ల ఆ కారిడార్‌కు రూ.4,318 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించారు. దీంట్లో దాదాపు రూ.1200 కోట్ల వరకు భూసేకరణకే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ ఒక కి.మీ.కు రూ.372కోట్ల చొప్పున లెక్కించి డీపీఆర్‌ను రూపొందించారు. రెండో దశలో అతిపెద్ద కారిడార్ అయిన 36.8 కి.మీ.ల నాగోల్-శంషాబాద్ మార్గంలో కి.మీ.కు రూ.305కోట్ల వ్యయాన్ని నిర్ధారించారు. ఈ రూట్‌లో భూసేకరణ సమస్యలు లేకపోవడంతో నిర్మాణ వ్యయం తగ్గింది. అలాగే ఎల్‌బీనగర్-హయత్‌నగర్ మార్గంలో 7.1కి.మీ. మెట్రోకు సగటున కి.మీ.కు రూ.264 కోట్లు ఖర్చు చేస్తున్నా రు. ఆ మార్గంలో ఇప్పటికే జాతీయ రహదారి ఉండడంతో భూసేకరణ సమస్యల్లేవు. దీంతో నిర్మాణవ్యయం తక్కువగా ఉంది.
పాతబస్తీలో చురుగ్గా పనులు
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ.ల మార్గంలో ప్రతిపాదించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రూట్‌లో ఆస్తుల సేకరణను అధికారులు వడివడిగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 360 మందికి రూ.120 కోట్ల నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన నిర్వాసితుల ఇళ్లు, కమర్షియల్ భవనాలను తొలగిస్తున్నారు. ఈ నెల చివరివారంలోగా చెక్కుల పంపిణీని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..