Share News

రేపటి నుంచి సుయతీంద్ర తీర్థుల మహా సమారాధన

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:59 PM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి పూర్వపు పీఠాధిపతి (2006 - 2014) మంత్రాలయం నవ నిర్మాణ శిల్పిగా పేరుగాంచిన సుయతీంద్ర తీర్థుల 12వ మహా సమారాధన ఉత్సవాలు 18నుంచి 20వరకు కన్నుల పండుగగా జరుగనున్నాయి.

 రేపటి నుంచి సుయతీంద్ర తీర్థుల మహా సమారాధన
సుయతీంద్ర తీర్థులు, పూర్వపు పీఠాధితి

మంత్రాలయం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి పూర్వపు పీఠాధిపతి (2006 - 2014) మంత్రాలయం నవ నిర్మాణ శిల్పిగా పేరుగాంచిన సుయతీంద్ర తీర్థుల 12వ మహా సమారాధన ఉత్సవాలు 18నుంచి 20వరకు కన్నుల పండుగగా జరుగనున్నాయి. ప్రస్తుత పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులకు పీఠమిచ్చిన గురువుకు తన 12వ ఏట ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించి గురుభక్తిని చాటుకోనున్నారు. 18న పూర్వారాధన, 19న మధ్యారాధన, 20న ఉత్తరరాధన నిర్వహించనున్నారు. 19న సుయతీంద్ర తీర్థులు బంగారు రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి మహ సమారాధనలో పాల్గొని మొక్కులు చెల్లించి పరవశించనున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు సుయతీంద్ర తీర్థుల -2025 అవార్డులను పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా పండిత విధ్వాంసులచే ప్రవచనాలు, పుస్తకాల ఆవిష్కరణ, సంగీత కచేరీలు భక్తులను అలరించనున్నాయి. ఇప్పటికే మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి, ఏఈ బద్రినాథ్‌లు ఏర్పాట్లు పూర్తిచేసి సుయతీంద్ర తీర్థుల బృందావనం , యాగశాలను ముస్తాబు చేశారు.

వైభవంగా సుధీంద్ర తీర్థుల మధ్యారాధన మహోత్సవాలు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి పీఠం మిచ్చిన గురువు, పూర్వపు పీఠాధిపతులు సుధీంద్ర తీర్థుల మధ్యారాధన మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కర్ణాటకలోని అనగొంది సమీపంలో తుంగభద్ర నది మధ్యన నవ బృందావనంలో వెలసిన సుధీంద్ర తీర్థుల బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య బృందావనానికి నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, విశేష పం చామృతాభిషేకం నిర్వహించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పట్టు వ స్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ద్వారపాలక అనంతస్వామి, ప్రకా్‌షఆచార్‌, పవన ఆచర్‌, విజయేంద్రాచార్‌, ఆనందతీర్థ ఆచర్‌, గౌతమ్‌ ఆచార్‌, గోపాలకృష్ణస్వామి, వరధేంద్రాచార్‌, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఫ నవబృందావనం సమీపంలో వెలసిన వ్యాసరాజ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంజనేయస్వామి దేవాలయంలో కలశ ప్రతిష్టాపన మహ కుంభాభిషేకాన్ని మఠంపీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, వ్యాసరాజమఠం పీఠాధిపతులు విద్యాశ్రీష తీర్థులు, సుజయనిధి తీర్థులు వైభవంగా చేశారు. ఇరువురు పీఠాధిపతులు వారి సాంప్రదాయాల ప్రకారం ఒకరినొకరు శాలువా, ఫల, పుష్పాలతో ఘనంగా సత్కరించుకున్నారు.

మంత్రాలయంలో భక్తుల కోలాహలం

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం వరకు వేలాది మంది భక్తులు రావడంతో అతిఽథి గృహాలు, ప్రైవేట్‌ లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్‌ కారిడార్‌ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది.

రూ.లక్ష విరాళం

రాఘవేంద్రస్వామి మఠానికి బెంగుళూరుకు చెందిన భానుమతి అనే భక్తురాలు రూ.లక్ష విరాళం ఇచ్చినట్లు ఏఏఓ మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్‌ జోషి తెలిపారు. ఆదివారం కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని శ్రీమఠం అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళం ఇచ్చిన ట్లు తెలిపారు. విరాళం ఇచ్చిన దాతల కుటుంబానికి పీఠాధిపతి సుబుధేం ద్ర తీర్థులు ఆశీస్సులతో పండితులు రాఘవేంద్ర స్వామి మెమోంటో, శేషవస్త్రం, ఫల,పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.

అలరించిన భరతనాట్యం

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం యాగశాలలో బెంగళూరుకు చెందిన పృథ్వి పార్థసారథి, విభ, అథితి, వసుధ అనే కళాకారులచే నిర్వహించిన భరత నాట్యం భక్తులను అలరించింది. ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులతో పద్మనాభ ఆచార్‌ ఆధ్వర్యంలో చేసిన భరతనాట్య కళా ప్రదర్శనలో భక్తులను మైమరపించింది. పాట, తాళం, తబల, సంగీతంతో నాట్యం చేస్తుండగా భక్తులు హర్షధ్వనాలు మోగించారు. కళాకారులకు పండితులు శేషవస్త్రం, ఫల,పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో మేనేజర్లు వెంకటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి, మేనేజర్‌, ఈఈ, సురేష్‌ కోణాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, వ్యాసరాజ ఆచార్‌, అనంతపురాణిక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:59 PM