జాతీయ రహదారి సమీపంలో ఏటీఎంలో చోరీ
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:43 AM
రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినా వినియోగదారుల సమాచారంతో బుధవారం రాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినా వినియోగదారుల సమాచారంతో బుధవారం రాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంకిరెడ్డిగూడెం శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న ఏటీఎం షట్టర్ దింపి ఉండటంతో బుధవారం సాయంత్రం వరకూ ఎవరూ అటుగా వెళ్లలేదు. కొందరు వినియోగదారులు అనుమానంతో పోలీసులకు సమాచారమివ్వటంతో ఏటీఎం మిషనలోని నగదు ఉంచే ప్రాంతం ధ్వంసం చేసినట్లు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించి షట్టర్ కిందికి దించి గ్యాస్ కట్టర్‌తో నగదు భద్రపరిచే ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. ఏటీఎంలో భద్రపరిచిన నగదును దొంగిలించిన తర్వాత షట్టరు కిందికి దించి పరారయ్యారు. బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ అక్షాంశ యాదవ్, ఏసీపీ మధుసూదన రెడ్డి , సీఐ మన్మధకుమార్ , బ్యాంకు ఏటీఎం సిబ్బంది పరిశీలించారు. క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరించారు. గతంలో కూడా ఇదే ఏటీఎంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో ఎంత నగదు అపహరణకు గురైందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.