పోరాట జ్వాల దొడ్డి కొమరయ్య
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:04 AM
తెలంగాణ పోరాట చైతన్య జ్వాల దొడ్డి కొమరయ్య అని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతిలో ఆయన మాట్లాడారు.

కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోరాట చైతన్య జ్వాల దొడ్డి కొమరయ్య అని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతిలో ఆయన మాట్లాడారు. తొలుత కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించిన సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా దొడ్డి కొమరయ్య నిలిచారన్నారు. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తందారీ పై ధిక్కార స్వరంగా మారి విజయం సాధించిన దొడ్డి కొమరయ్య పోరా టం అజరామరంగా నిలుస్తుందన్నారు. ఆయన పోరాట పటిమను విద్యార్థులు స్పూర్తిగా తీసుకుంటే ఎంతటి అపజయమైనా విజయమవుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీవో ఎం. కృష్ణారెడ్డి, డీఆర్డీవో టీ.నాగిరెడ్డి, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్లు యాదయ్య, వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, టీజేఏసీ స్టేట్ ట్రెజరర్ మందడి ఉపేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచవద్దు
(ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్): రాజీవ్ యువ వికాస్ పథకం కోసం లబ్ధిదారులు కుల, ఆదాయం ధ్రువీకరణ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచవద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీచేశారు. ఆ సమయం లో అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చిన సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించగా, కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లామని అధికారులు సమాధానం ఇవ్వడంతో ఇలాంటి పొరపాటు మరోసారి జరగవద్దని ఆగ్రహం వ్యక్తం చే స్తూ, లబ్ధిదారులకు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు.