నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ సర్వే
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:42 AM
ఏకీకృత జిల్లా పాఠశాలల విద్యా సమాచారం (యూడై్‌స)లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలపై నేటి నుంచి థర్డ్ పార్టీ సర్వే ప్రారంభం కానుంది.

థర్డ్ పార్టీ ద్వారా నిర్వహణ
విద్యార్థుల సంఖ్యపై తేలనున్న వాస్తవాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2,800 పాఠశాలలు
250 మంది డీఈడీ, బీఈడీ విద్యార్థుల ద్వారా సర్వే
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్): ఏకీకృత జిల్లా పాఠశాలల విద్యా సమాచారం (యూడై్‌స)లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలపై నేటి నుంచి థర్డ్ పార్టీ సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు విద్యా సంవత్సరంలో యూడైస్ నమోదు పూర్తయ్యాక కేవ లం 5శాతం పాఠశాలల్లో క్లస్టర్ రిసో ర్స్ పర్సన్స్ (సీఆర్‌పీ) మాత్రమే తనిఖీ లు చేసేవారు. కానీ యూడై్‌సలో నమో దు చేస్తున్న విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో వసతుల వివరాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం లో వాస్తవాలపై ప్రభుత్వం దృష్టిని సారించింది. దీంతో ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు పాఠశాలల వారీగా డీఈడీ, బీఈడీ విద్యార్థులు యూడైస్ వివరాల ఆధారంగా సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు సర్వేలో పాల్గొనే విద్యార్ధులకు అవగాహన, శిక్షణ తరగతులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని సుమారు 2,800 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సర్వే సాగనుంది. అయితే విద్యాశాఖలో థర్డ్ పార్టీ సర్వే ఇదే ప్రథమం కావడం గమనార్హం.
యూడైస్ నమోదు వివరాల ఆధారంగానే పాఠశాలలకు ప్రభుత్వం గ్రాం ట్స్ మంజూరు చేస్తుంది. వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో పాఠశాల విద్యలో యూడైస్ అత్యంత కీలకం. పాఠశాల వివరాలతో పాటు విద్యార్థి సమగ్ర వివరాలు కూడా యూడైస్‌లో నమోదు చేస్తారు. ఈ మేరకు 2024-25 విద్యాసంవత్సరంలో నమోదైన వివరాలపై థర్డ్ పార్టీ సర్వే జరగనుంది. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా చదువుతున్న విద్యార్థులు, ఆధార్ అనుసంధానం, తరగతి గదులు, మూత్రశాలలు, తాగు నీరు, పాఠశా ల భవనం, క్రీడా స్థలం, ఫర్నిచర్, ల్యాబ్, విద్యార్థుల యూనిఫాం, పాఠ్యపుస్తకాల సరఫరా, ప్రస్తు త విద్యాసంవత్సరంలో నూతన ప్రవేశాలు, డ్రాపౌ ట్స్, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులు, ఖాళీలు తదితర సమగ్ర వివరాలను యూడై్‌సతో సరిపోల్చుతారు. పాఠశాల, తరగతుల వారీగా కావాల్సి న సదుపాయాలు, అవసరాలను గుర్తించనున్నా రు. అలాగే యూడై్‌సలో నమోదు చేసిన వివరాల తప్పొప్పులను సర్వే సభ్యులు ధ్రువీకరించనున్నా రు.దీంతో విద్యాశాఖలో ఈథర్డ్‌పార్టీ సర్వే అత్యంత కీలకమైనదని అధికారులు పేర్కొంటున్నారు.
ఒక్కొక్కరు పది పాఠశాలలు...
థర్డ్ పార్టీ సర్వే బాధ్యతను విద్యాశాఖ డీఈడీ, బీఈడీ విద్యార్థులకు అప్పగించింది. ప్రభుత్వ డైట్ కళాశాలల ప్రిన్సిపాల్ లేదా జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. ఒక్కొక్కరికి పది పాఠశాలలను కేటాయించారు. ఐదు రోజుల పాటు సర్వే బృందాలు ప్రతీ రోజు రెండు పాఠశాలలను సందర్శించి సర్వే నిర్వహిస్తాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్స్ స్కూళ్లలో సర్వే జరగనుంది. మిగతా ప్రభుత్వ యాజమాన్య ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో రెండో దశలో సర్వే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇదే తరహా సర్వేను నిర్వహిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో సుమారు 2,800 పాఠశాలల్లో 250మంది బీఈడీ, డీఈడీ విద్యార్థులు ఐదు రోజుల పాటు సందర్శిస్తారు. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్ వివరాలను రికార్డుల రూపంలో సిద్ధం చేసి ఉంచారు. ఆ రికార్డులను వీరు పరిశీలించి ధ్రువీకరిస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం : కె.సత్యనారాయణ, యాదాద్రి డీఈవో
యూడైస్ థర్డ్ పార్టీ సర్వే కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వే బృందాలకు పాఠశాలలను కేటాయించాం. అయితే యూడై్‌సలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు సమగ్రంగానే ఉంటాయని భావిస్తున్నాం. థర్డ్ పార్టీ సర్వేతో పాఠశాలలకు ప్రయోజనం చేకూరనుంది.