గుర్రంబోడు గోస వినరూ
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:39 AM
పేద రైతుల బతుకు పోరాటంగా నిలిచి, నేతల హామీలు, పోలీసుల పహారాలు, నిత్యం ఆందోళనలు, ఆవేదనలు, ఆశా, నిరాశలతో నిండిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలోని 540 సర్వేనెంబరులోని భూసమస్యకు నేటికీ పరిష్కారం లభించలేదు.

కొలిక్కిరాని 540 సర్వే నెంబరు భూ వివాదం
గొడవలు, ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
అర్హులకు జరగని న్యాయం
పేద రైతుల బతుకు పోరాటంగా నిలిచి, నేతల హామీలు, పోలీసుల పహారాలు, నిత్యం ఆందోళనలు, ఆవేదనలు, ఆశా, నిరాశలతో నిండిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలోని 540 సర్వేనెంబరులోని భూసమస్యకు నేటికీ పరిష్కారం లభించలేదు. రెండేళ్ల కిందట అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘రైతు భరోసాయాత్ర’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో రచ్చ జరిగి ఈ తండా సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత సర్వేలు, నివేదికలు, అధికారులు సస్పెన్షన్లతో కాలం గడిచిందే తప్ప నిర్ధిష్టమైన సమాధానం ప్రభుత్వాల నుంచి రైతులకు అందలేదు. వెరసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.
- (ఆంధ్రజ్యోతి-మఠంపల్లి)
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అప్పటి ప్రభుత్వం మఠంపల్లి మండలం పెద్దవీడు పం చాయతీ పరిధి 540 సర్వేనెంబరులోని గుట్టల భూమిని ఇచ్చింది. 50ఏళ్ల క్రితం ఉన్న చట్టాలకు అనుగుణంగా గిరిజన రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ డీఫాంలు జారీ చేసింది. కానీ రైతులకు హద్దులతో కూడిన భూమిని అప్పగించలేదు. దీంతో భూనిర్వాసితులు సర్వే నెంబరులోని కనబడిన భూములను గిరిజనులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉన్న రైతుల కుటుంబాలు, వారసలు పెరుగుతూ వందల సంఖ్యలోకి వచ్చారు. ఎవరి భూమి ఎవరు సాగు చేసుకుంటున్నారో, పట్టా ఎవరి పేరున ఉందో, కబ్జాలో ఎవరు ఉన్నారో వారికే తెలియని పరిస్థితి. గుడ్డి నమ్మకంతో వ్యవసా యం చేస్తూ బతుకుతున్న గిరిజనులకు మారుతున్న ప్రభుత్వాలు హక్కులను కల్పించడంలో నిర్లక్ష్యం వహించాయి. రెవెన్యూ నక్ష ప్రకారం ఢీపాం ఆధారంగా రైతులు ఉంటున్న భూములపై పాస్‌పుస్తకాలు జారీ చేసి ఉంటే కొంతమేలు జరిగి ఉండేది. అలాంటివి ఇక్కడ అమలు చేయలేదు. కాలంతో పాటు పెరిగిన కుటుంబాలు తండా నుంచి పంచాయతీగా ఎదగిన ఊరు ఒక్కసారిగా రెక్కలు తొడిగిన భూముల ధరలతో కబ్జాదారుల కన్నుపడింది. ఈ క్రమంలోనే 540 సర్వే నెంబరులో 1,873 ఎకరాల రైతుల భూమిని ఆరు వేలకు ఎకరాలకు పెంచి తప్పుడు రికార్డులను సృష్టించి ప్రైవేట్ కంపెనీలు, బడాబాబులకు కట్టబెట్టారు. తప్పిదాలను సరిదిద్దకపోగా అధికారులు, ప్రజా ప్రతినిధులు అక్రమార్కులకు కొమ్ముకాశారు.
క్షేత్రస్థాయిలో సర్వే జరిగి ఉంటే..
గుర్రంబోడుతండా భూవివాద నేపథ్యంలో అప్పటి సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, రిటైర్డ్ ఆర్డీవో భిక్షంనాయక్ గిరిజనుల వినతుల మేరకు గుర్రంబోడుతండా తండాను సందర్శించారు. ఆయా భూముల్లో పర్యటించి రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అక్రమాలపై 20 రోజుల్లో పూర్తిస్థాయి సర్వేచేసి 30 రోజుల్లో అర్హులైన రైతులకు స్వయంగా తండా రైతులు, పెద్దల సమక్షంలో పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి వెళ్లారు. అనంతరం 2023 నవంబరులో 540 సర్వేనంబర్‌లో సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించినా కిందిస్థాయి అధికారులు ఆ మేరకు బాధ్యతగా పనిచేయలేకపోయారు. 540 సర్వేనంబర్‌లో భూముల వివరాలకు అనుగుణంగా రైతులను కలవడం, హక్కుదారులను గుర్తించ డం, సాగులో ఉన్న భూములు పరిశీలించడం, కబ్జాలో ఉన్న రైతుల పేర్లు నమోదు చేయకపోవడం, తూతుమంత్రంగా చేసిన సర్వేలో రైతుల భూములను హద్దులను గుర్తించకపోవడం, ని బంధనలకు విరుద్ధంగా సర్వే చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. భూనిర్వాసితులకు ఇచ్చిన భూమి ఎంత మేరకు ఆక్రమణకు గురైం దో సర్వేలో నిర్ధిష్టంగా తేల్చలేదు. కలెక్టర్ ఆదేశాలు ఖచ్చితంగా పాటించి మండల స్థాయి అధికారులు, వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులందరినీ కలిసి ఉంటే వివాదం పరిష్కారమయ్యేదని, అర్హులైన రైతులకు న్యాయం జరిగేదని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు.
సరి దిద్దాలంటే?
ముంపు రైతులకు న్యాయం జరగాలన్నా, గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలన్నా, రెవెన్యూ శాఖ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 540 సర్వే భూములను ప్రక్షాళన చేసి అక్రమదారులను గుర్తించి సాగులో ఉన్న రైతులకు పాస్ పుస్తకాలు, హక్కులు కల్పించి కబ్జాదారులను ఖాళీ చేయించడం, అర్హులైన గిరిజన రైతులుంటే పట్టాలు ఇవ్వడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది. ఇది సాధ్యమవ్వాలంటే ప్రభుత్వం కఠిననిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
కనిపించని చర్యలు ....
గుర్రంబోడుతండాలో 540 సర్వే నెంబరులో ఆరు వేల ఎకరాలకు పెరిగిన భూమి రికార్డుపరంగా జరిగిన తప్పులు సరిదిద్దే ప్రయత్నం జరగడం లేదు. ఇప్పటికే జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం కాని లేకపోవడంతో గుర్రంబోడుతండా రైతుల గోడు అలాగే మిగిలి ఉంది. పూర్తిస్థాయిలో సర్వేలు జరగకపోవడం వెనక అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయనే విమర్శలు నిజం అనుకునేలా పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు కోర్టులను ఆశ్రయించినప్పుడే కొంత కదలిక వచ్చి అధికారులు చర్యలు తీసుకున్నారే తప్ప, ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ అమలుకాకుండాపోయింది.
120 ఎకరాల సంగతేంటి?
భూవివాదంపై విచారణలు, సర్వేలు కొనసాగుతుండగానే ఇటీవల 120 ఎకరాల భూమి పలువురు రైతులకు చెందినవేనని జరుగుతున్న ప్రచారంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 1,876 ఎకరాలకు నకీలి పట్టాలు, తప్పుడు పట్టాలు సృష్టించి 6వేల ఎకరాలకు పెంచి అక్రమాలకు పాల్పడిన వారిని వదిలి 120 ఎకరాలను గుర్తించినట్లు బీఆర్‌ఎస్ నేతలు కొందరులు చేసిన ప్రచారం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రచారాన్ని అధికారులు కొట్టివేయడం లేదని, అధికారులు నోరు విప్పకపోవడంతో కొందరు నాయకులు 120 ఎకరాలను కూడా కాజేసేందుకు ఆడుతున్న నాటకంగా రైతులు అనుమానిస్తున్నారు.
భూములు వదిలే ప్రసక్తే లేదు
కొద్దిపాటి ఉన్న భూముల ను సేద్యం చేసుకోవడంతో పాటు మరికొంత భూమిలో కబ్జాలో ఉంటూ జీవనం గడు పుతున్నాం. మా భూములను లాక్కోవాలనే ప్రయత్నాలు చేస్తే ఆత్మహత్య కు వెనకాడం, భూములు వదులకోం. మా వద్దపట్టాలు ఉన్నాయి. భూస్వాములకు ఎవ రు విక్రయించారో వారిని తీసుకురమ్మనండి. ఆ భూములను చూపమనండి. మేం ఎవరికీ భూములు విక్రయించలేదు. మా భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ధికారులు వాస్తవాలు గుర్తించి న్యాయం చేయాలి.
- రమావత్ దీప్లానాయక్
కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం
రెండు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న మా భూములకు పట్టాలు ఇవ్వాలని అడిగినందుకు కేసు బనాయించారు. 45 రోజులు జైలు జీవితం గడిపా. మా గోడును వినిపించుకోకుండా అధికారులు దళారుల మాటలు నమ్మి మాకు పట్టాలు రాకుండా చేశారు. నాతో పాటు గుర్రంబోడుతండాకు చెందిన మరో 40మందిపై అక్రమ కేసులు పెట్టారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.
- రమావత లచ్చిరాంనాయక్, గుర్రంబోడుతండా
అధికారులే పరిష్కరించాలి
540 సర్వే నెంబర్‌లో నెలకొన్న సమస్యను రెవెన్యూ అధికారులే పరిష్కరించాలి. తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను బడాబాబులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటు న్నా అధికారులు సమాధానం చెప్పకుండా ఉండటం బాధాకరం. ఎవరి భూమి అనేది చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. ఎవరి నుంచి కొనుగోలు చేశారో వారు ఎక్కడ ఉన్నారో ఆ భూములు ఎక్కడున్నాయే గుర్తించి సమస్యను పరిష్కరించాలి. సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన మాకు అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడి అన్ని అర్హత కలిగి కబ్జాలో ఉన్న నిరుపేద అర్హులందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
- ఇస్లావతు బాలాజీనాయక్, భూపరిరక్షణ సమితి అధ్యక్షుడు, గుర్రంబోడుతండా